ఆయకట్టు రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-08-08T10:03:09+05:30 IST

కేసరి సముద్రం చెరువు ఆయకట్టు పరిధిలోని చిన్న, సన్న కారు రైతులను ఆదుకోవాలని జాతీయ బీసీ కమీషన్‌ సభ్యుడు టి.ఆచారి

ఆయకట్టు రైతులను ఆదుకోవాలి

జాతీయ బీసీ కమీషన్‌ సభ్యుడు టి.ఆచారి


నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 7 : కేసరి సముద్రం చెరువు ఆయకట్టు పరిధిలోని చిన్న, సన్న కారు రైతులను ఆదుకోవాలని జాతీయ బీసీ కమీషన్‌ సభ్యుడు టి.ఆచారి అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రం పరిధిలోని కేసరిసముద్రం చెరువు ఆయకట్టు గ్రామాలైన ఎండబెట్ల, ఉయ్యాలవాడ, తిరుమలాపూర్‌ గ్రామాల రైతుల ఫిర్యాదు మేరకు శుక్రవారం ఆయన చెరువును సందర్శించి శిఖం, ఆయకట్టును పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో సమావేశమై మాట్లాడారు. వర్షాధారిత చెరువు అయిన కేసరిసముద్రం, ప్రస్తుతం కేఎల్‌ఐ ద్వారా అందిస్తున్న నీటితో ఏడాది పొడువునా చెరువు బఫర్‌ జోన్‌లో వంద శాతం నీరు నిల్వ ఉంటుందన్నారు. దీంతో దీనిపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులకు పడుతున్నారన్నారు.


నీటి శాతం తగ్గినప్పుడు బఫర్‌ జోన్‌ పరిధిలోని రైతులు కూరగాయలు వంటి తక్కువ కాలం పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని చెరువులో నీటి నిల్వ శాతాన్ని తగ్గించాలని ఆదేశించారు. అలాగే కొల్లాపూర్‌ మండలం సోమశిలలో ఉన్న 110 మంది రైతుల ఫారెస్ట్‌, రెవెన్యూ పరిధిలో ఉన్న భూమిని సర్వే చేసి నిజమైన పట్టాదారులకు రికార్డుల్లో అప్డేట్‌ చేయాలను ఆయన ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కేసరిసముద్రం చెరువు ఆయకట్టు రైతులు, బఫర్‌ జోన్‌ పరిధిలోని రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, వారికి న్యాయం చేస్తామని చెప్పారు. సోమశిల పరిధిలో భూ సర్వే చివరి దశకు చేరుకుందని, ఈ నెలాఖరుకు 110 మంది రైతులకు డిజిటల్‌ సంతకాలు పూర్తి చేసి పాసుపుస్తకాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో డీఆర్వో మధుసూదన్‌నాయక్‌, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి మురళి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శీరాములు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T10:03:09+05:30 IST