రైతులకు వెంటనే పంట రుణాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-07-06T05:05:38+05:30 IST

రైతులకు వెంటనే పంట రుణాలు ఇవ్వాలి

రైతులకు వెంటనే పంట రుణాలు ఇవ్వాలి
ఎస్బీఐ ఎదుట ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, రైతులు

బొంరాస్‌పేట్‌, జులై 5: రైతులకు వెంటనే పంట రుణాలను రెన్యువల్‌ చేయడంతో పాటు నూతన రుణాలను అందించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు రైతులతో కలిసి మంగళవారం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ ఎలాంటి నిబంధనలు లేకుండా బ్యాంకు ఖాతాల్లో జమచేసిన రైతుబంధు ఆర్థిక సహాయం డబ్బులను ఖాతాదారులకు అందించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ రుణాలను వెంటనే రెన్యువల్‌ చేయాలన్నారు. కొత్త పంట రుణాలను మంజూరు చేయాలన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిములుగౌడ్‌ మాట్లాడుతూ బ్యాంకు అధికారులు మొండి బకాయిల సాకుతో ఖాతాదారుల ఖాతాలను హోల్డ్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హోల్డ్‌లో ఉన్న ఖాతాలన్నీ అన్‌హోల్డ్‌ చేయాలన్నారు. బ్యాంకు ఖాతాలను హోల్డ్‌లో పెట్టడంతో రైతులు, ఖాతాదారులు ఆర్థిక లావాదేవీల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతు బంధు నిధులు, ధాన్యం అమ్మిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయని, ఇప్పుడు వారి ఖాతాలు హోల్డ్‌లో పెట్టడంతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. బ్యాంకు మేనేజర్‌ లవకుమార్‌ రైతులను సముదాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నట్టు ఆయన చెప్పారు. త్వరలో రైతుల సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు. ధర్నాలో కాంగ్రెస్‌ నాయకులు జయకృష్ణ, వెంకట్రాములుగౌడ్‌, రాంచంద్రారెడ్డి, దేశ్యనాయక్‌, నర్సిములు నాయుడు, భీమయ్యగౌడ్‌, భీంసేన్‌రావు, సంతోష్‌, మల్లికార్జున్‌, నర్సిములు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T05:05:38+05:30 IST