వీడని ప్రతిష్టంభన

ABN , First Publish Date - 2020-12-04T07:40:25+05:30 IST

చట్టాల రద్దు కోరుతున్న అన్నదాతలు... సవరణలకు సిద్ధమని ప్రభుత్వం... ఇదీ నాలుగో రౌండు చర్చల తీరు! వారంరోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం గురువారం జరిపిన మలి దఫా చర్చలు కూడా అసంపూర్ణంగా ముగిశాయి. మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదు

వీడని ప్రతిష్టంభన

నాలుగో రౌండ్‌ చర్చలూ అసంపూర్ణం.. రేపు మళ్లీ భేటీ

కనీస మద్దతు ధర వ్యవస్థ యథాతథం.. వ్యవసాయ మార్కెట్లను పటిష్ఠం చేస్తాం

కేంద్రం అహానికి పోవడం లేదు: తోమర్‌.. మద్దతు ధర కోసం కొత్త చట్టం తేవాలి

ఎంఎస్‌పీ కంటే తక్కువకు కొంటే శిక్షించాలి.. రైతు సంఘాల నేతల డిమాండ్‌

మీ భోజనం మాకు అక్కర్లేదు.. ప్రభుత్వ ఆఫర్‌ను తిరస్కరించిన రైతులు

పద్మవిభూషణ్‌ను వాపస్‌ ఇచ్చిన బాదల్‌.. అదే బాటలో సుఖ్‌దేవ్‌ ధిండ్సా

కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు.. సరిహద్దులను దిగ్బంధించిన రైతులు


న్యూఢిల్లీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): చట్టాల రద్దు కోరుతున్న అన్నదాతలు... సవరణలకు సిద్ధమని ప్రభుత్వం... ఇదీ నాలుగో రౌండు చర్చల  తీరు! వారంరోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం గురువారం జరిపిన మలి దఫా చర్చలు కూడా అసంపూర్ణంగా ముగిశాయి. మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో ప్రతిష్టంభన నెలకొంది. అయితే చర్చల సారాంశాన్ని బట్టి చూస్తే కేంద్రం కొన్ని అంశాల విషయంలో సమీక్షకు సుముఖత వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది.


చర్చలకు ముందు పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌తో హోంమంత్రి అమిత్‌ షా సమావేశమయ్యారు. తమ పార్టీ, ప్రభుత్వ వైఖరిని వివరించిన అమరీందర్‌ - సమస్యను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని కోరారు. వివిధ రైతు సంఘాలకు చెందిన 40 మంది నేతలతో ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, వాణిజ్య, రైల్వే శాఖ మం త్రి పీయూష్‌ గోయెల్‌, వాణిజ్య శాఖ మంత్రి, పంజాబ్‌ ఎంపీ అయిన సోమ్‌ ప్రకాశ్‌ చర్చలు జరిపారు. సుదీర్ఘంగా దాదాపు 7 గంటల పాటు చర్చలు జరిగినా ఓ అంగీకారం కుదరలేదు. 


తొలుత రైతులు తమ డిమాండ్లపై కేంద్ర మంత్రులకు వివరించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, అధికారులు... రైతులు లేవనెత్తిన అంశాలపై స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించారు. కొత్త చట్టాల ద్వారా కలిగే లాభాలతో పాటు ప్రైవేటు మార్కెట్లకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు మధ్య తేడా గురించి ప్రభుత్వ వర్గాలు వివరించాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యవస్థ కొనసాగుతుందని తోమర్‌ మరోమారు స్పష్టం చేశారు. అయితే..  కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించడానికి ఓ చట్టం చేయాలని రైతులు ప్రతిపాదించినట్లు సమాచారం. అంతేకాక- కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసే వారికి శిక్షలు విధించాలని, అది ఆ చట్టంలో ఉండాలని వారు కోరారు. దీనికి ప్రభుత్వం వెంటనే హామీ ఇవ్వలేదు. 


ఎంఎస్పీపై చట్టానికి బదులు లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి తోమర్‌ ప్రతిపాదించగా రైతులు అందుకు తిరస్కరించారు.   ’ఎంఎస్పీ వ్యవస్థను కొనసాగిస్తామని కేంద్రం గట్టిగానే అంటోంది.  ఈ చర్చల్లో కొంత పురోగతి ఉంది గానీ కొత్త చట్టాల రద్దు విషయం ఎటూ తేలలేదు. వాటిని రద్దు చేయాలని తాము డిమాండ్‌ చేస్తూంటే ప్రభు త్వం వాటిని సవరించడంపై మాట్లాడుతోంది’’ అని చర్చలు ముగిసిన తర్వాత భారత్‌ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాటి చెప్పారు.  ఈ నెల 5న మరోసారి చర్చలు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. 


అభ్యంతరాల్ని పరిశీలిస్తాం: తోమర్‌

ప్రస్తుతం పంటలకు ప్రకటిస్తున్న కనీస మద్ధతు ధరలను ఎలాంటి ఆటంకం కలగనివ్వబోమని నరేంద్ర తోమర్‌ ఈ సమావేశంలో పదేపదే అన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను (ఏపీఎంసీలను) పటిష్టం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ‘‘ప్రభుత్వానికి అహం లేదు. కొత్త చట్టం వల్ల వ్యవసాయ మార్కెట్‌ విధానం రద్దవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఆ మార్కెట్లను మరింత బలోపేతం చేస్తాం. ప్రభుత్వ సేకరణ విధానం యథావిధిగా జరుగుతుంది. ఈ చట్టాల ద్వారా రైతులకు మరిన్ని చట్టబద్ధమైన హక్కులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తాం. అలాగే, విద్యుత్తు చట్టంపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు లేవనెత్తిన అంశాలను పరిగణించి చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని ప్రకటించారు. అలాగే, వ్యవసాయ మార్కెట్ల బయట పంటను కొనుగోలు చేసే వ్యాపారులు రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉండేలా చూస్తామని తెలిపారు. ఏవైనా సమస్యలు వచ్చినపుడు సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ (ఎస్‌డీఎం)  కోర్టులకెళ్లాలన్నది చట్టంలో ఉందని, అయితే రైతులు ఇది మరీ దిగువస్థాయి కోర్టు అనీ, పైకోర్టులోనే తమ ఇబ్బందులు పరిష్కారమయ్యేలా నిబంధనలుండాలని అంటున్నారని, దీనినీ సానుకూలంగా పరిశీలిస్తామని తోమర్‌ చెప్పారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మరో రౌండు చర్చలు జరుపుతామని, ఆ భేటీ లో ఓ అంగీకారం సాధ్యం కావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 


నేడు రైతుసంఘాల చర్చ

ప్రభుత్వ ప్రతిపాదనలు, వైఖరిపై 35 రైతు సంఘాలు శుక్రవారం సంఘూ సరిహద్దు కేంద్రం వద్ద చర్చించనున్నాయి. ఎంఎస్పీ వ్యవస్థ కొనసాగేట్లు చట్టం తేవాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గరాదని సంఘాలు భావిస్తున్నాయి. కొన్ని యూనియన్లు 5వ తేదీనాటి చర్చల్లో కూడా అంగీకారం అసాధ్యమంటూ వాటిని బహిష్కరిద్దామని చెప్పాయి. మా వరకూ మేం చెప్పదలుచుకున్నది చెప్పేశాం.. ఇక తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే.. ఒక వేళ చట్టాల రద్దు కాదంటే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతాం అని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నేత ప్రతిభా షిండే స్పష్టం చేశారు. కొత్త చట్టాలపై తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి మరోమారు సమర్పించిన రైతు నేతలు- తమలో చీలిక తేవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా తమ నివేదికలో ఆరోపించారు.


యూపీ సరిహద్దు జిల్లాల రోడ్ల మూసివేత

రైతుల నిరసనలు ఆగలేదు. వరుసగా 8వ రోజు దేశరాజధాని ప్రాంతం ఆందోళనలతో హోరెత్తింది. ఇప్పటికే వచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న లక్షలాది మంది రైతులే కాకుండా ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, హరియాణ, పంజాబ్‌ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది గురువారం వచ్చారు. దాదాపుగా యూపీ సరిహద్దులన్నింటినీ మూసేశారు. వందల మంది పోలీసులు, ర్యాపిడ్‌ ఏక్షన్‌ ఫోర్స్‌ బలగాలు వారు ముందుకు రాకుండా నిరోధిస్తున్నాయి. ఈ నిరసన వల్ల ట్రాఫిక్‌ జామ్‌లు మరింత ఎక్కువయ్యాయి. 


షహీన్‌బాగ్‌ నిరసన మాదిరిగా టుక్డే టుక్డే గ్యాంగ్‌ మారుస్తోంది: తివారీ 

రైతులు చేస్తున్న ఆందోళనను మూడునెలల పాటు సాగిన షహీన్‌బా్‌ఘ నిరసన తరహాలో మార్చడానికి టుక్డే టుక్డే గ్యాంగ్‌ ప్రయత్నిస్తోందని, ఇది షహీన్‌బాగ్‌-2.0 అని ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ఆరోపించారు. ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు, ప్రధాని మోదీకి బెదిరింపులు మొదలైన వాటిని చూస్తుంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అనిపిస్తోందని, దేశంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రైతుల పేరిట జరుపుతున్న ఈ కుట్రను ప్రతి ఒక్క పౌరుడూ ఓడించాలన్నారు.

Updated Date - 2020-12-04T07:40:25+05:30 IST