వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల ప్రదర్శన

ABN , First Publish Date - 2020-11-28T06:32:23+05:30 IST

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల ప్రదర్శన

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల ప్రదర్శన
నగరంలో రైతు సంఘాల నాయకుల ర్యాలీ

అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు

బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడంపై ఆగ్రహం

ఉపసంహరించే వరకు పోరాటం సాగుతుందన్న నేతలు

నిరసనకారులను బలవంతంగా అరెస్టు చేస్తున్న పోలీసులు

విజయవాడ సిటీ, నవంబరు 27: కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవసాయ చట్టాలను రూపొందించిందని, ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు చేస్తూ రైతాంగానికి సీఎం జగన్‌ తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీమంత్రి, ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష కో-ఆర్డినేషన్‌ కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు, రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవో 20, 21లకు వ్యతిరేకంగా శుక్రవారం రైతు సంఘాల నిరసన ప్రదర్శన జరిగింది. కార్యక్రమానికి కార్మిక, ప్రజా సంఘాలు, వామపక్షాలు మద్దతు తెలిపాయి. బందరురోడ్డులోని కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్న తమను ఇలా అడ్డగించి అరెస్టు చేయడం సరైనది కాదని పలువురు నేతలు పోలీసుల తీరుపై మండిపడ్డారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ శాంతియుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్న వారిని అడ్డుకోవడం ప్రజల హక్కులను హరించడమేనన్నారు. ఈ చట్టాలను రద్దు చేసే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. సీఐటీయూ నాయకుడు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని బలపరుస్తూ జీవోలు జారీ చేయడం దుర్మార్గమన్నారు. రైతులకు నష్టం కలిగించే ఈ నిర్ణయాలను ఉపంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అఽధ్యక్షుడు వై.కేశవరావు, కౌలురైతు సంఘం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, జమలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, సీపీఎం నేతలు సీహెచ్‌ బాబూరావు, మాల్యాద్రి, నాగేశ్వరరావు, సీఐటీయూ, ఐద్వా నాయకురాలు ధనలక్ష్మి, రమాదేవి పాల్గొన్నారు.



Updated Date - 2020-11-28T06:32:23+05:30 IST