Abn logo
Jul 14 2021 @ 17:31PM

పార్లమెంటు ఎదుట 'శాంతియుత' బైఠాయింపు: రాకేష్ టికాయత్

న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు వివిధ రూపాల్లో చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 22న పార్లమెంటు వెలుపల రైతులు శాంతియుత నిరసనలు తెలుపుతామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ బుధవారంనాడు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 19న ప్రారంభమవుతున్న నేపథ్యంలో టికాయత్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

''శాంతియుతంగానే మా నిరసన ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే బయట మేము బైఠాయింపు నిరసన జరుపుతాం'' అని టికాయత్ చెప్పారు. బస్సులో 200 మందితో పార్లమెంటుకు వెళ్తామని, బస్సు ఛార్జీలు తామే భరిస్తామని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన 3 సాగు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రైతు సంఘాల ప్రధాన డిమాండ్‌గా ఉంది. తమ డిమాండ్లే చర్చల ఎజెండా కావాలని అంటోంది. అయితే, చట్టాల రద్దుకు కేంద్రం ససేమిరా అంటోంది. రైతు ప్రతినిధులతో కేంద్రం పలు దఫాలు చర్చలు జరిగినా సమస్య కొలిక్కి రాలేదు. ఎనిమిది నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.