అదరం..బెదరం!

ABN , First Publish Date - 2020-03-29T08:36:40+05:30 IST

‘ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోరు ఆపం. మా లక్ష్యం అమరావతి. ఏకైక రాజధాని అమరావతి అని స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అమీతుమీ...

అదరం..బెదరం!

  • అమరావతి కోసం అమీతుమీ తేల్చుకొంటాం
  • నినదించిన రైతులు, మహిళలు
  • 102వ రోజుకు రాజధాని ఆందోళనలు
  • 29 గ్రామాల్లో ప్రతి ఇంటిపై నల్లజెండాలు

గుంటూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ‘ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోరు ఆపం. మా లక్ష్యం అమరావతి. ఏకైక రాజధాని అమరావతి అని స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అమీతుమీ తెల్చుకొంటాం’ అని రాజధాని ప్రాంత రైతులు, కూలీలు, మహిళలు తెగేసి చెప్పారు. 102వ రోజైన శనివారమూ పట్టువదలకుండా వారంతా ఆందోళనలు కొనసాగించారు. కరోనా  వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే నిరసనలు కొనసాగించారు. వారంతా ఇళ్ల ముందే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇంటిల్లిపాది ఆందోళనలో భాగమయ్యారు. జేఏసీ జెండా చేతపట్టి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పెదపరిమిలో సామాజిక దూరం పాటిస్తూ రైతులు, యువకులు శిబిరంలో దీక్షలు కొనసాగించారు. రాజధాని 29 గ్రామాల్లో ప్రతి ఇంటిపైనా నల్ల జెండాను ఎగరవేసి నిరననలు తెలిపారు. 


‘అమరావతి వెలుగు’తోనే ఏపీ పరుగు..

అమరావతి వెలిగితే రాష్ట్రం అభివృద్ధిలో పరుగుపెడుతుందంటూ మహిళలు కొవ్వొత్తులతో నిరసనలు తెలిపారు. రాజధానిపై ప్రభుత్వ తీరు మార్చుకోవాలంటూ శనివారం రాత్రి 7.30 గంటలకు ‘అమరావతి వెలుగు’ పేరిట గ్రామ కూడళ్లలో మహిళలు, రైతులు కొవ్వొత్తులు చేతబూని ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు.

Updated Date - 2020-03-29T08:36:40+05:30 IST