అకాల వర్షంతో రైతుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-01-15T09:13:26+05:30 IST

మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం

అకాల వర్షంతో రైతుల ఇక్కట్లు

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తడిసిన ధాన్యం


శ్రీకాకుళం, విజయనగరం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వరి రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం వేకువజాము నుంచే మేఘావృతమై చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. సీతంపేట, భామిని, వీరఘట్టాం, జలుమూరు, నరసన్నపేట తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యం సంరక్షించేందుకు ఇబ్బందులు పడ్డారు.


కాగా.. అకాల వర్షాలతో పెసర, మినుము, ఉలవ పంటకు ప్రయోజనమని రైతు లు చెబుతున్నారు. మామిడి, జీడి పంటలకు ఈ వర్షం ఉపయోగపడుతుందని ఉద్యానశాఖ అధికారులు భావిస్తున్నారు. విజయనగరం జిల్లాలో కోసిన ధాన్యం ఇంకా చాలాచోట్ల పొలాల్లోనే ఉంది. నూర్పు కూడా చేపట్టలేదు. అకాల వర్షాల దెబ్బకు ఆ ధాన్యమంతా తడుస్తోంది. మొలకలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గత నెలలో తుఫాన్‌ కారణంగా వరి నూర్పులను రైతులు వాయిదా వేసుకున్నారు. సంక్రాంతి తర్వాత చేపడదామని అనుకుంటున్న సమయంలో అకాల వర్షాలు నష్టం కలిగిస్తున్నాయి. సాలూరు మండలం మరిపిల్లి, భూతాడవలస, మామిడిపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. 


Updated Date - 2022-01-15T09:13:26+05:30 IST