అన్నదాన ఆర్తనాదం

ABN , First Publish Date - 2020-11-29T06:19:49+05:30 IST

మళ్లీ వరిధాన్యం పండించిన రైతుకథ మొదటికి వచ్చింది. ప్రభుత్వం ఈ సారి ఖరీఫ్‌లో సన్నరకం ధాన్యాన్ని ఎక్కువగా సాగుచేయాలని.. డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందం టూ రైతులకు భరోసానిచ్చింది.

అన్నదాన ఆర్తనాదం

వరిధాన్యం అమ్ముకునేందుకు అష్టకష్టాలు 

గిట్టుబాటు కాని మద్ధతుధర 

ఏ గ్రేడ్‌ పరిధిలోకి సన్నరకం ధాన్యం 

దొడ్డురకం ధాన్యానికి అదే ధర 

శాపమవుతున్న అధికారుల సమన్వయ లోపం 

ఆందోళన బాటలో జిల్లా రైతాంగం 

నిర్మల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : మళ్లీ వరిధాన్యం పండించిన రైతుకథ మొదటికి వచ్చింది. ప్రభుత్వం ఈ సారి ఖరీఫ్‌లో సన్నరకం ధాన్యాన్ని ఎక్కువగా సాగుచేయాలని.. డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందం టూ రైతులకు భరోసానిచ్చింది. సర్కారు భరోసాతో రైతులు ఈ సారి గతానికి భిన్నంగా పెద్దఎత్తున సన్నధాన్యాన్ని సాగుచేశారు. అయితే ప్రభుత్వం క్వింటాల్‌ ఏ ధాన్యానికి రూ. 1888 మద్దతు ధర ప్రకటించగా, బి గ్రేడ్‌కు రూ.1868 ధరను ఖరారు చేసింది. దీంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించింది. ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు, ఎఫ్‌సీఐ శాఖ అధికారుల మధ్య నెలకొన్న సమన్వయంతో ప్రస్తుతం కొనుగోలు ప్రక్రియ గందరగోళంగా మారుతోంది. సన్నరకం ఽధాన్యానికి కూడా ఏ గ్రేడ్‌ దొడ్డు రకం ధాన్యం ధరనే చెల్లిస్తుండడం, ముఖ్యంగా నిర్మల్‌ జిల్లాలో వివాదానికి కారణమవుతోంది. ఈ సారి ఖరీఫ్‌లో నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా 1.07 లక్షల ఎకరాల్లో వరిధాన్యాన్ని సాగుచేశారు. ఇందులో 45వేల ఎకరాల్లో సన్నరకంధాన్యం ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కాగా సర్కారు కొనుగోలు కేంద్రాల్లో దొడ్డురకం ధాన్యానికి చెల్లిస్తున్న రూ. 1888లనే  సన్నరకం ధాన్యానికి కూడా చెల్లిస్తుండడం వివాదానికి కారణమవుతోంది. గత కొద్ది రోజుల నుంచి ఈ వ్యవహారం కారణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అయితే కొంతమంది వ్యాపారులు సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 1900లకు పైగా చెల్లిస్తుండడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది. దొడ్డురకం, సన్నరకం ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయకపోవడం ప్రస్తుతం అయోమయ పరిస్థితులకు బీజం వేసింది. కొనుగోలు కేంద్రాల్లో దీని విషయమై రైతులు సంబంధిత శాఖల అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. చిలికిచిలికి గాలివానలాగా ఈ విషయంపై అసంతృప్తితో రగిలిపోతున్న రైతులు ఆందోళన బాట చేపడుతున్నారు. శనివారం లక్ష్మణచాంద మండలంలో అన్నదాతలు సన్నరకం ధాన్యం వ్యవహారంపై ఆందోళన చేపట్టారు. దాదాపు రెండు గంటలకు పైగా తమ నిరసనలో భాగంగా వారంతా రోడ్లపై బైఠాయించి ధర్నాకు దిగారు. అయితే ఈ విషయంలో పౌరసరఫరాలశాఖ అధికారులను వివరణ కోరగా ఎఫ్‌సీఐ నిబంధనల మేరకే తాము నడుచుకుంటామని ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించలేమంటూ స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా మద్దతుధర ప్రకటించిన దానికి అనుగుణంగానే కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తామే తప్పా తమ చేతిలో ఏమి లేదంటూ వెల్లడిస్తుండడం అన్నదాతలను మరింత గందరగోళానికి గురి చేస్తోంది. 

గందరగోళంగా కొనుగోలు వ్యవహారం..

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఖరీఫ్‌ వరిధాన్యం కొనుగోలు వ్యవహారమంతా గందరగోళంగా మారింది. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువస్తున్నప్పటికీ అక్కడి పరిస్థితుల కారణంగా అయోమయానికి లోనవుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు దొడ్డురకం ఏ గ్రేడ్‌, బి గ్రేడ్‌లకు ప్రకటించిన ధరలనే సన్నరకం ధాన్యానికి కూడా చెల్లిస్తామని ఇంతకంటే ఎక్కువగా చెల్లించడం తమ చేతిలో ఉండ దంటూ దాట వేస్తున్నారు. దీంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించిన దొడ్డు రకంధాన్యానికి ఎక్కువ పెట్టుబడితో తక్కువ దిగుబడి సాధించిన సన్నరకం ధాన్యానికి ఒకే ధరను చెల్లిస్తే తాము నష్టపోతామని సన్నరకాన్ని పండించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే తాము ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ దిగుబడి వస్తుందని తెలిసిన సన్నరకం ధాన్యం సాగుకే సంకల్పించామని తీరా ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం సమంజసం కాదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం ఈ వ్యవహారంలో తాము ఏమి చేయలేమంటూ చేతులేత్తేస్తుండడం అన్నదాతను మరింతగా కుంగదీస్తోంది. ప్రతియేటా మాదిరిగానే ఈ సారి కూడా వరి రైతు పరిస్థితి మరోసారి గందరగోళానికి గురవుతోంది. 

ఆవేదనలో సన్నరకం ధాన్యం సాగు చేసిన రైతులు

కాగా ఈ సారి సన్నరకం ధాన్యానికి ఎక్కువగా డిమాండ్‌ ఉంటుందని ప్రభుత్వం కూడా అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తుందని స్వయం గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు సన్నరకం ధాన్యంసాగు చేయాలంటూ రైతులను పురమాయించడంతో నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా దాదాపు 45వేల ఎకరాల్లో ఆ పంటనే సాగుచేశారు. దొడ్డురకం ధాన్యం కన్నా రెండింతల పెట్టుబడి పెట్టినప్పటికి తక్కువ దిగుబడులే వచ్చాయి. దిగుబడి తగ్గుతుందని తెలిసినప్పటికీ రైతులు ప్రభుత్వం ఇచ్చిన భరోసాను నమ్ముకొని సన్నరకం ధాన్యం సాగువైపు మొగ్గు చూపారు. ప్రభుత్వం ఏ గ్రేడ్‌, బి గ్రేడ్‌ పేరిట మద్దతు ధరను ప్రకటించినప్పటికీ సన్నరకం ధాన్యానికి మాత్రం ప్రత్యేకంగా మద్దతుధరను ప్రకటించలేదు. దీని కారణంగా అధికారులు దొడ్డురకం ధాన్యానికి చెల్లించిన మద్దతు ధరను సన్న రకం ధాన్యానికి కూడా చెల్లిస్తామంటూ వెల్లడించారు. దీంతో రైతులు సన్నరకం ధాన్యానికి ధర ఎక్కువగా ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధానికి కట్టుబడి ఉండాలని డి మాండ్‌ చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు ఎఫ్‌సీఐ నిబందనలకు అనుగుణంగానే ఏ గ్రేడ్‌, బి గ్రేడ్‌ రకాల పంటలకే మద్దతుధర ఉంటుందని, సన్నరకం ధాన్యమంటూ ప్రత్యేక నిబంధనల్లో లేదని వెల్లడిస్తున్నారు. అటు ఎఫ్‌సీఐ ఇటు సివిల్‌ సప్లయ్‌ అధికారుల మధ్య ముందు నుంచి సమన్వయం లేకపోవడంతో ప్రస్తుతం సన్నరకం ధాన్యం ధర విషయంలో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయంటున్నారు. 

ఆందోళన బాటలో అన్నదాతలు

ప్రభుత్వం నిర్బంధ సాగు పేరిట ఈ సారి మొక్కజొన్న పంటను సాగు చేయవద్దని ప్రకటించింది. అలాగే వరి, సోయాబీన్‌, పత్తి పంటలసాఽగు లక్ష్యాన్ని నిర్దేశించి ఆ దిశగా రైతులను ప్రొత్సాహించింది. ప్రభుత్వం నిర్బంధసాగు విధానంలో పంటలు పండించిన వారికి గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామంటూ కూడా ప్రకటించడమే కాకుండా సన్నరకం ధాన్యం సాగుకు ప్రొత్సాహిస్తామంటూ చెప్పింది. దీని కారణంగా రైతులు మొక్కజొన్న పంటను పక్కన పెట్టి దాదాపు లక్షన్నర ఎకరాల్లో ఇటు దొడ్డు రకం, అటు సన్నరకం ధాన్యాన్ని సాగుచేశారు. జిల్లాలో 1.07 లక్షల ఎకరాల్లో వరిపంటను సాగుచేయగా ఇందులో 45వేల ఎకరాల్లో సన్నరకం ధాన్యాన్ని సాగుచేశారు. అయితే సన్నరకం ధాన్యం సహసమే అయినప్పటికీ సర్కారు చేసిన ప్రకటన ఆధారంగా రైతులు ఈ సారి 45వేల ఎకరాల్లో సన్నరకం ధాన్యాన్ని సాగుచేయడం విశేషం. కాగా సన్నరకం ధాన్యానికి భారీగా ధర ఉంటుందని ఆ పంటను సాగు చేసిన రైతులు ఆశించారు. ఆ పంట దిగుబడులు తగ్గినప్పటికి రైతులు ధరపై ఆశలు పెట్టుకున్నారు. ఒక్కసారిగా వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇటు దిగుబడి తగ్గిపోవడం, అటు దొడ్డురకం ధాన్యానికి మాదిరిగానే మద్దతు ధర రావడంతో రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. చిలికిచిలికి గాలివాన లాగా ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తం గా రైతుల ఆందోళనకకు తెరలేపబోతుందంటున్నారు. ఇకనైనా ప్రభు త్వం సన్నరకం ధాన్యం సాగు చేసిన రైతులతో చర్చించి వారికి అనుకూలమైన నిర్ణయాన్ని ప్రకటించాలన్న డిమాండ్‌ విస్తరిస్తోందంటున్నారు. 

Updated Date - 2020-11-29T06:19:49+05:30 IST