Abn logo
Oct 28 2021 @ 00:46AM

పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్నలు

రహదారిపై రాస్తారోకో చేస్తున్న నకిలీ విత్తనాల బాధిత రైతులు

రెడ్డిగూడెం, అక్టోబరు 27 : నకిలీ వరి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు బుధవారం రాత్రి పరిహారం కోసం రోడ్డెక్కారు. విజయవాడ - విస్సన్నపేట రహదారిపై మెన్యూర్స్‌ కంపెనీ ఎదుట పరిహారం చెల్లించాలని రాస్తారోకో చేశారు. రెడ్డిగూడెంలోని ప్రసాద్‌ మెన్యూర్స్‌ అండ్‌ సీడ్స్‌ దుకాణంలో రెడ్డిగూడెం, రాఘవాపురం, రంగాపురం, కొత్త రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన సుమారు 60 మంది రైతులు వరి విత్తనాలు కొని 130 ఎకరాల్లో సాగు చేపట్టారు. కేళీలు ఆధికంగా రావడంతో  30 రోజుల క్రితం బాధిత రైతులు ఆందోళన చేయడంతో వ్యవసాయశాఖ అధికారులు పొలాలను పరిశీలించి 35 శాతం కేళీలు ఉన్నట్లు గుర్తించారు. అయితే రైతులు మాత్రం 60శాతం కేళీలు వచ్చినట్లు చెబుతున్నారు.

కంపెనీ ప్రతినిధులు బుధవారం చర్చలకు రావడంతో ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. అయితే కంపెనీ ప్రతినిధులు ఎకరానికి రూ.4 వేలు, దుకాణదారుడు రూ.500లు ఇస్తామనడంతో రైతులు ధర్నాను కొనసాగించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని రైతులన్నారు. తహసీల్దార్‌ ఎం.శ్రీనివాసరావు, ఎస్సై డి.ఆనంద్‌కుమార్‌ రైతులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. గురువారం మరో మారు ఆందోళనకు దిగుతామని రైతులు తెలిపారు. ఉయ్యూరు లక్ష్మారెడ్డి, నరెడ్ల సాంబిరెడ్డి, మద్దిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.