రైతు కళ్లు చ‘మిర్చి’!

ABN , First Publish Date - 2020-04-03T09:18:24+05:30 IST

గోరుచుట్టుపై రోకటి పోటులా ఉంది ప్రస్తుతం..

రైతు కళ్లు చ‘మిర్చి’!

పడిపోతున్న పంట ధర

దానికి తోడైన కరోనా ప్రభావం

కోత కూలీలు రాక రాలిపోతున్న కాయలు

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు


కంచికచర్ల(కృష్ణా): గోరుచుట్టుపై రోకటి పోటులా ఉంది ప్రస్తుతం మిర్చి రైతుల దుస్థితి.  పంట ధర రోజురోజుకూ దిగజారుతున్నా వచ్చిన కాడికి అమ్ముకుంటుంటే కరోనా ప్రభావం ఆ కాస్త ఆశలను నీరుగార్చేసింది. తోటల్లో కాయలు కోసేందుకు కూలీలు రాకపోవడంతో మొక్కకు ఉన్న కాయలు రాలిపోతున్నాయి. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులకు భరోసా ఇవ్వకపోతే మిర్చి రైతులు రూ.లక్షల్లో నష్టపోయే ప్రమాదముంది.


జిల్లాలో 30 వేల ఎకరాల్లో పైగా మిర్చి తోటలు ఉన్నాయి. ఎకరానికి సగటున లక్షకు పైగా పెట్టుబడి అయింది. రెండో కోతలు ఇంకా కూడా పూర్తి కాలేదు. 15 శాతం మంది రైతులు మొదటి కోత కూడా కోయలేదు. అసలే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను కరోనా వైరస్‌ ప్రభావం నట్టేట ముంచింది. మిర్చి కోతలు పూర్తిగా బంద్‌ అయ్యాయి. లాక్‌ డౌన్‌ వల్ల కూలీలు ఇళ్లలో నుంచి బయటకు రావటం లేదు. దీనికితోడు ఆటోల్లో వెళ్లేందుకు పోలీసులు అనుమతించక పోవటం వల్ల కూలీలు కోతలకు రావటం లేదు. కోయాల్సిన కాయలు తోటల్లోనే ఎండిపోయి నేల రాలుతున్నాయి. కళ్ల ముందే కాయలు నాశనమవుతుండటంతో కన్నీళ్లు పెడుతున్న రైతులకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. రైతుల గోడు ఎవరూ ఆలకించటం లేదు. దీనికితోడు మార్కెట్‌లో ధర దిగజారుతోంది. 


కరోన్‌ ప్రభావానికి ముందు కల్లాల్లోనే క్వింటా రూ.13 వేల నుంచి రూ.14 వేలకు వ్యాపారులు కొన్నారు. అలాంటిది ఇప్పుడు తొమ్మిది వేలంటున్నారు. కరోనా ప్రభావంతో ఆ ధరకూ కొనేందుకు ముందుకు రావడం లేదు. కూలీలు లేనందున కల్లాల్లోని కాయలను గ్రేడింగ్‌ చేయకుండానే టిక్కీల్లో నింపి శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. స్థానిక గిడ్డంగుల్లో తప్పితే ఇతర ప్రాంతాల్లోని శీతల గిడ్డంగులకు వెళ్లనీయటం లేదు. ఇప్పట్లో మార్కెట్‌ పుంజుకుంటుందన్న నమ్మకం లేదు. అమ్మితే కూలి ఖర్చు, గిడ్డంగుల అద్దె కూడా వచ్చే పరిస్థితి కనిపించటం లేదని రైతులు వాపోతున్నారు. 


కాయలు రాలిపోతున్నాయి

కాయలు కోసేందుకు కూలీలను రానీయటం లేదు. కాయలు నేలపాలవుతున్నాయి. ఇక పనికిరాకుండా పోతున్నాయి. తోటలను నిలువుగా వదిలేయాల్సిన పరిస్థితి దాపురించింది. రైతుల బాధలను పాలకులు అర్థం చేసుకోవాలి. కూలీలను అడ్డగించకుండా ప్రభుత్వం ఆదేశించాలి.

- కొమ్మినేని సత్యనారాయణ, ముచ్చింతాల

Updated Date - 2020-04-03T09:18:24+05:30 IST