అటవీశాఖ అధికారులను అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2022-05-27T05:37:39+05:30 IST

రిజర్వు ఫారెస్టు అటవీ ప్రాంతంలోని భూముల్లో రైతులు అక్రమంగా సాగు చేశారని నాటిన మామిడి మొక్కలను తొలగించే స్తుండగా అటవీశాఖ అధికారులను రైతులు అడ్డుకున్న సంఘటన మండల పరిధిలోని నర్సాయిపల్లి అటవీ ప్రాంతంలో గురువారం చోటు చేసు కుంది.

అటవీశాఖ అధికారులను అడ్డుకున్న రైతులు
అటవీశాఖ అధికారులతో వాగ్వాదం చేస్తున్న రైతులు

- అక్రమంగా సాగు చేశారంటూ మొక్కలను తొలిగించిన అధికారులు 

- 40ఏళ్లుగా సాగులో ఉన్నామని పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌

కోడేరు, మే 26 : రిజర్వు ఫారెస్టు అటవీ ప్రాంతంలోని భూముల్లో రైతులు అక్రమంగా సాగు చేశారని నాటిన మామిడి మొక్కలను తొలగించే స్తుండగా అటవీశాఖ అధికారులను రైతులు అడ్డుకున్న సంఘటన మండల పరిధిలోని నర్సాయిపల్లి అటవీ ప్రాంతంలో గురువారం చోటు చేసు కుంది. కోడేరు మండలం నర్సాయపల్లి రిజర్వు ఫారెస్టులో ఆ గ్రామానికి చెందిన  కొందరు రైతులు అటవీ భూములను అక్రమంగా సాగు చేస్తున్నారని జిల్లా అటవీశాఖ అధికారులు భూములలో ఉన్న చెట్లు, ఇతర వా టిని తొలగించాలని కొల్లాపూర్‌ ఫారెస్టు అధికారులను ఆదేశించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం కొల్లాపూర్‌ డిప్యూటీ ఫారెస్టు రేంజర్‌ పద్మారావు, బీట్‌ ఆఫీసర్‌ లక్ష్మయ్య, ఇతర సిబ్బంది నర్సాయపల్లి రిజర్వ్‌ ఫారెస్టులోకి వెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ రైతులు మాజీ ప్రజాప్రతినిధులు కొందరు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రైతులు వాటిని దాదాపు 20మామిడి మొక్కలను కొడవలితో నరికేశారు. దీంతో రై తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1977నుంచి సాగు చేసుకుం టున్నామని.. ఇప్పుడు మీరు వచ్చి నాటిన మొక్కలను తొలగించడానికి మీకు ఎవరు హక్కు కల్పించారని మండిపడ్డారు. 40ఏళ్లుగా మేము సాగు చేస్తున్నామని.. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నామని అన్నారు. అక్రమ సాగు మేము ఒక్కరమే చేస్తే గతంలో మొదటి నుంచి అక్రమంగా సాగు చేసి మామిడి తోటలు పెట్టిన పెద్ద రైతులవి తొలగిస్తే తాము కూడా తొలగించుకుంటామని అన్నారు. చిన్నసన్నకారు రైతులందరం కలిసి ఎకరా, రెండు ఎకరాలు సాగు చేసుకుంటే పెద్దకారు రైతులు 5 నుంచి 10ఎకరాల వరకు అక్రమం గా అటవీ భూములను సాగు చేస్తున్నారని ఆరోపించారు. మొదట వారిని తొలగిస్తే తాము కూడా ఊరుకుటామన్నారు. ఎలాంటి జీవనాధారం లేని ఒక్కసెంటు భూమి కూడా లేని రైతులకు పట్టాలు ఇచ్చి తగిన న్యాయం చేయాలని కోరారు. దీంతో డిప్యూటీ రేంజర్‌ పద్మారావు మాట్లాడుతూ అధికారుల వద్దకు వచ్చి అన్ని వివరాలు మాట్లాడుకోవాలని చెప్పి వెనుదిరిగి వెళ్లిపోయారు. 

Updated Date - 2022-05-27T05:37:39+05:30 IST