అయ్యో.. ఇప్పుడెలా!?

ABN , First Publish Date - 2021-10-19T03:23:38+05:30 IST

పురుగు మందు దుకాణం యజమాని అవగాహనలోపం, వ్యవసాయాధికారుల నిర్లక్ష్యం ఈ రైతు సోదరులను నిండా ముంచింది.

అయ్యో.. ఇప్పుడెలా!?
పురుగు మందు వాడాక దెబ్బతిన్న వరి పంట

పురుగుమందు పిచికారీలో అవగానాలోపం

చేతికందే దశలో ఎండిపోయిన వరి

సగానికి పడిపోయిన దిగుబడి

విచారించి నివేదికలు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ

పరిహారం విషయంలో సందిగ్ధత

ఆదుకోవాలని వేడుకుంటున్న రైతు సోదరులు

ఆత్మహత్యే శరణ్యమని కలెక్టర్‌కు వేడుకోలు

దగదర్తి అక్టోబరు 18 : పురుగు మందు దుకాణం యజమాని అవగాహనలోపం, వ్యవసాయాధికారుల నిర్లక్ష్యం ఈ రైతు సోదరులను నిండా ముంచింది. పురుగు మందు పిచికారి విషయంలో సరైన మార్గదర్శకం లేకపోవడంతో చేతికందే పంట ఒక్కసారిగా ఎండిపోయింది. దిగుబడి సగానికి పడిపోయి ఎడగారులో వారికి తీవ్ర నష్టం మిగిల్చింది. వ్యవసాయాధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా పరిహారం విషయంలో సందిగ్ధం నెలకొనడంతో ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని జిల్లా కలెక్టర్‌కు ఆ రైతు సోదరులు వేడుకున్నారు. 

దగదర్తి మండలం వెలుపోడు పంచాయతీ మబ్బుగుంటపాళేనికి చెందిన సోదరులు గద్దె మల్లికార్జున, చిన్న మల్లికార్జున ఈ ఎడగారులో తమకున్న 9.16 ఎకరాల్లో నెల్లూరు మసూరి రకం వరి సాగు చేశారు. గత ఆగస్టులో పైరు వెన్నుతీసింది. ఈ క్రమంలో పంటలో తెల్లతెగులు ఆనవాళ్లు కనిపించడంతో వెలుపోడు గ్రామంలోని ఎస్‌ఆర్‌ఎస్‌ రైతు డిపోలో ఓ కంపెనీకి చెందిన మోర్టార్‌ అనే పురుగు మందు రెండున్నర కేజీలు కొనుగోలు  చేశారు. డిపో యజమాని సూచనల మేరకు ఎకరాకు 250 గ్రాముల చొప్పున పిచికారి చేశారు. ఈ క్రమంలో కొద్ది రోజులకే పచ్చగా ఉన్న వరిపైరు ఒక్కసారిగా రంగు మారి, ఆకు ఎర్రబడి ముడుచుకుపోయింది. తాలు గింజలు తేలడంతో వారు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు. ఇదేంటని పురుగు మందు దుకాణం యజమాని వట్టికాళ్ల సురే్‌షను నిలదీశారు. గ్రామంలో రైతులకు అమ్మినట్లే మీకు అమ్మానని, వారికి రాని నష్టం మీకెందుకు వచ్చిందని అతను ఎదురు జవాబిచ్చాడు. దీంతో దిక్కుతోచని మల్లికార్జున సోదరులు మండల వ్యవసాధికారికి విన్నవించుకున్నారు. వీరి విన్నపం మేరకు కావలి ఏడీ కన్నయ్య  పంటను పరిశీలించి, విచారణ చేపట్టారు. నివేదికను జేడీ ఆనంద కుమారికి పంపారు. 

రైతులకు బెదిరింపులు

అధికారుల సూచనల మేరకు ఆలస్యం చేస్తే పూర్తిగా నష్టపోతామని గత నెలలో వరికోతలు చేపడితే... ఎకరాకు మూడు పుట్లు రావాల్సిన దిగుబడి.. మొత్తంగా 12 పుట్లకు పడిపోయిందని ఆ రైతు సోదరులు లబోదిబోమన్నారు. మూడు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని పుట్టి రూ.12వేలకు అమ్ముకోగా రూ.1.44లక్షలు మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో ఇతర రైతులకు ఎంత దిగుబడి వచ్చిందో అంత నష్టపరిహారం తాను చెల్లిస్తానని చెప్పిన పురుగు మందు దుకాణం యజమాని ఇప్పుడు మాట మార్చి.. తమ మీదకే దౌర్జన్యానికి దిగుతున్నారని ఆందోళన చెందారు. ఈ మేరకు.. దగదర్తి పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్కడా స్పందన లేకపోవడంతో కలెక్టరేట్‌లో జరిగే స్పందనలో తమ బాధను అర్జీ రూపంలో విన్నవించుకున్నారు. నష్టపరిహారం చెల్లించకుంటే ఆత్మహత్యే  శరణ్యమని అందులో స్పష్టం చేశారు. 

పరిహారం విషయంలో సందిగ్ధత

పంట నష్టంపై కావలి ఏడీ కన్నయ్య విచారణ చేపట్టి నివేదికను జేడీ జి.ఆనంద కుమారికి అందజేశారు. ప్రభుత్వం తరపున బాధితులకు ఎలాంటి పరిహారం అందదని వ్యవసాయాధికారులు చెబున్నారు. సంబంధిత పురుగు మందు దుకాణం యజమాని నుంచి నష్టపరిహారం ఇప్పించాలని  విచారణలో బాధితులు స్పష్టం చేశారు. 


మాకు ఎలాంటి సంబంధం లేదు...

ఇదే విషయమై ఎస్‌ఆర్‌ఎస్‌ రైతు డిపో యజమాని వి.సురే్‌షను ప్రశ్నించగా సంబంధిత పురుగుమందు ప్రతినిధుల సూచనల మేరకే.. 4 ఎకరాలకు కిలో మందు వాడాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇతర రైతులకు రాని నష్టం వారికెలా వస్తుందని.. తనకు ఎలాంటి సంబంధం లేదని బదులిచ్చారు. అలాగే పురుగు మందు కంపెనీ ప్రతినిధి ఒకరిని ప్రశ్నించగా ఇదే సమాధానం చెప్పారు. అయితే వరిపంట పొట్టదశలో ఉన్నప్పుడే ఆ ముందు పిచికారి చేయాలని వెన్ను తీసిన తర్వాత పిచికారి చేయాలని తాము చెప్పమని వెల్లడించారు. 


నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు

బాధిత రైతుల పంట నష్టానికి సంబంధించిన నివేదిక జేడీ పరిశీలనలో ఉంది. పంట నష్టం ఎందువల్ల జరిగిందని తేలిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి. బాధితులు చెప్పినట్లు అది నకిలీ మందుకాదు. అదే మందు వాడిన ఇతర రైతుల పంట దిగుబడి బాగానే ఉంది. పురుగు మందు పిచికారి విషయంలో అవగాహన లోపం స్పష్టం కనిపిస్తోంది. 

- ఎ.రాధ, వ్యవసాయాధికారిణి






Updated Date - 2021-10-19T03:23:38+05:30 IST