లెక్క రాక.. అప్పు పుట్టక..!

ABN , First Publish Date - 2020-09-25T11:10:47+05:30 IST

పసుపు డబ్బులొస్తే ఖరీఫ్‌ పెట్టుబడికి వస్తుంది. ఇది రైతుల వ్యవసాయ ప్రణాళిక. మట్టిలో సేద్యం చిందించి పండించిన పంట దిగుబడులు మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు.

లెక్క రాక.. అప్పు పుట్టక..!

పసుపు బకాయి రూ.30 కోట్లు

ఖాతాకు చేరిన డబ్బు చేతికందకనే వెనక్కి

ఆధార్‌ సీడింగ్‌.. అకౌంట్‌ క్రెడిట్‌ పరిమిత సమస్యలు

పసుపు అమ్మిన లెక్క రాక.. ఖరీఫ్‌ పెట్టుబడికి అప్పులు దొరక్క

అవస్థలు పడుతున్న కష్టజీవులు

మూడు నాలుగు నెలలుగా మార్క్‌ఫెడ్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు

రైతు గోడు పట్టించుకోని ప్రజాప్రతినిధులు


(కడప-ఆంధ్రజ్యోతి): పసుపు డబ్బులొస్తే ఖరీఫ్‌ పెట్టుబడికి వస్తుంది. ఇది రైతుల వ్యవసాయ ప్రణాళిక. మట్టిలో సేద్యం చిందించి పండించిన పంట దిగుబడులు మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. మార్కెట్‌యార్డు నిబంధనల ప్రకారం పంట అమ్మిన రోజే రైతుకు డబ్బులు ఇవ్వాలి. గరిష్టంగా 15 రోజుల్లో చెల్లించాలి. మార్క్‌ఫెడ్‌కు పసుపు అమ్మిన అన్నదాతలకు నాలుగైదు నెలలుగా లెక్క అందలేదు. ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ రూ.30 నుంచి 35 కోట్లు బకాయి ఉంది. ఖరీఫ్‌ పెట్టుబడికి అప్పులు దొరక్క రైతులు పడే కష్టాలు ఎన్నో. రైతుల సంక్షేమమే మా ఆశయమంటున్న ఏలికలకు కష్టజీవుల కన్నీటి గోడు వినిపించదా..? లెక్క కోసం మరెన్ని నెలలు నిరీక్షించాలి..? రైతుల ప్రశ్నకు సమాధానం లేదు. ఆ వివరాలు ఇలా.. 


కడప, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, పోరుమామిళ్ల, భాకరాపేట, రాజంపేటలో ఏపీ మార్క్‌ఫెడ్‌ పసుపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ధరలు పతనమై రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంగా కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,800 ప్రకారం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను ఏపీ మార్క్‌ఫెడ్‌ సంస్థకు అప్పగించింది. కేడీసీఎంఎస్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు పసుపు సేకరణ ఏజెన్సీ బాధ్యత ఇచ్చింది. జిల్లాలో 1,75,710 క్వింటాళ్లు (17,571 మెట్రిక్‌ టన్నులు) కొనుగోలు చేశారు. పసుపు విక్రయించిన దాదాపు 5,850 మంది రైతులకు దాదాపు రూ.120 కోట్లు ఖాతాల్లో జమ చేయాలి. మే 1వ తేదీ నుంచి జూలై 10 వరకు రైతుల నుంచి పసుపు కొనుగోలు చేశారు. పసుపు లెక్క వస్తే ఈ ఖరీఫ్‌ పెట్టుబడికి ఇబ్బంది ఉండదని కొందరు, గతేడాది ఖరీ్‌ఫకు చేసిన అప్పులు సకాలంలో చెల్లించి మళ్లీ అప్పు తీసుకోవచ్చని మరికొందరు రైతులు భావించారు. కాగా నెలలు గడుస్తున్నా లెక్క అందక.. అప్పులు ఇచ్చిన వారికి సమాధానాలు చెప్పలేక అవస్థలు పడుతున్నారు. మరో పక్క వడ్డీలు పెరిగి ఆర్థికంగా చితికిపోతున్నారు. 


వచ్చిన డబ్బులు వెనక్కి

పసుపు 1,75,710 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. రూ.120 కోట్లు చెల్లించాలని జిల్లా కేంద్రం ఏపీ మార్క్‌ఫెడ్‌ ఆఫీసు నుంచి రైతుల బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌, భూమి వివరాలతో విజయవాడలోని మార్క్‌ఫెడ్‌ ప్రధాన కార్యాలయానికి బిల్లులు పంపారు. ఇప్పటి వరకు ఖాతాలో కేవలం రూ.85 నుంచి 90 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. మరో రూ.30-35 కోట్లు జమ కావాల్సి ఉంది. బ్యాంక్‌ ఖాతాలు ఆధార్‌ సీడింగ్‌ చేయకపోవడం, కొన్ని బ్యాంక్‌ల ఖాతాల్లో రూ.50-60 వేలకు మించి జమ (క్రెడిట్‌ లిమిట్‌) కాకపోవడంతో డబ్బులు వెనక్కి వెళ్లాయని స్థానిక ఏపీ మార్క్‌ఫెడ్‌ అధికారులు అంటున్నారు. బిల్లులు పంపే సమయంలో అన్ని వివరాలు సక్రమంగా చూసుకుని పంపించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని, నాలుగైదు నెలలుగా ఆఫీస్‌ చుట్టూ తిరిగినా లెక్క జమ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా రైతులకు కనిష్టంగా రూ.68,500, గరిష్టంగా రూ.2.72 లక్షలు రావాల్సి ఉంది. బ్యాంక్‌ అకౌంట్లు సరిచేసి తీసుకొస్తే మళ్లీ బిల్లులు పంపుతామని అధికారులు అంటున్నారు. 


రైతులపై వడ్డీ భారం

గరిష్టంగా 40 క్వింటాళ్లు కొనుగోలు చేసిన రైతుకు రూ.2.74 వేలు రావాలి. ముప్పాతిక శాతం మంది రైతులు పెట్టుబడికి అప్పులు చేశారు. మే, జూన్‌ నెలలో పసుపు అమ్మినా నేటికీ డబ్బు ఖాతాలో జమ కాలేదు. నాలుగైదు నెలలుగా డబ్బు కోసం నిరీక్షిస్తున్నారు. పంట అమ్మిన నెల రోజుల్లో ఇచ్చి ఉంటే అదేరోజు అప్పులు తీర్చేవారు. పసుపు లెక్క రాకపోవడంతో నేటికీ అప్పులు తీర్చేలేదు. ఈ లెక్కన నెలకు రూ.5,500 ప్రకారం నాలుగు నెలలకు రూ.22 వేలు వడ్డీ భారం భరించాల్సి వస్తుంది. అలాగే.. ఈ ఖరీ్‌ఫకు పెట్టుబడి సమస్య తీరేది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్యాంక్‌ ఖాతా లోపాలను సవరించి తక్షణమే పసుపు లెక్క ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. 


నాలుగు నెలలుగా తిరుగుతున్నా : కొండయ్య, పసుపు రైతు, కొత్తపల్లి గ్రామం, ఖాజీపేట మండలం

కడప మార్కెట్‌యార్డులోని మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రంలో మే 12న 25 బస్తాలు పసుపు అమ్మాను. రూ.1.19 లక్షలు రావాలి. బిల్లు నం:4517. నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ ఖాతాలో లెక్క పడలేదు. అధికారులను అడిగితే వారంలో వస్తుంది అంటూ నెలలు గడిపేశారు. ఇప్పటికే నాలుగైదు సార్లు కడపకు వచ్చాను. వచ్చిన ప్రతిసారి రూ.400-500 ఖర్చు వస్తుంది. గతేడాది పెట్టుబడికి చేసిన అప్పు తీరుద్దామంటే పసుపు లెక్క రాలేదు. వడ్డీలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది తమలపాకులు సాగు చేస్తున్నా. గతేడాది అప్పు తీర్చకపోవడంతో ఈ ఏడాది పెట్టుబడికి ఇబ్బందిగా ఉంది. అప్పులు పుట్టడం లేదు.. పసుపు లెక్క రావడం లేదు. మా గోడు వినేవారే లేరా..? 


త్వరలో ఖాతాలో పడతాయి : నాగరాజు, ఇన్‌చార్జి మేనేజరు, ఏపీ మార్క్‌ఫెడ్‌, కడప

జిల్లాలో పసుపు రైతులకు ఇప్పటికే రూ.30 కోట్లు వరకు బకాయి ఉన్నది వాస్తవమే. బ్యాంక్‌ ఆధార్‌ సీడింగ్‌ చేయక, క్రెడిట్‌ లిమిట్‌ వంటి సమస్యల వల్ల వచ్చిన డబ్బులు వెనక్కి వెళ్లాయి. బ్యాంక్‌ అకౌంట్లు సరిచేసి ఇవ్వాలని రైతులకు సూచించాం. త్వరలో లెక్క ఖాతాలో వేసేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-09-25T11:10:47+05:30 IST