అన్నదాతకు ధీ(బీ)మా

ABN , First Publish Date - 2021-09-15T05:02:54+05:30 IST

అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 2.96 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సున్న 1,79,803 మంది రైతులను 2021–22 సంవత్సరానికి రైతుబీమాకు అర్హులుగా గుర్తించింది. గతేడాది జిల్లాలో 1,61,714 మందికి బీమా కల్పించారు. వీరిలో 59 సంవత్సరాలు నిండిన 8,726 మంది బీమాకు అర్హత కోల్పోయారు. ఈసారి కొత్తగా 26,815 మంది రైతుబీమా కల్పించారు.

అన్నదాతకు ధీ(బీ)మా

జిల్లాలో 1,79,803 మందికి రైతుబీమా

గతేడాది 1,61,714 మందికి బీమా వర్తింపు

ఈ సంవత్సరం కొత్తగా 26,815 మందికి అవకాశం

59 సంవత్సరాలు నిండిన 8,726 మందికి నో ఛాన్స్‌

ఒక్కో రైతుకు రూ.3,486.90 చొప్పున ప్రీమియం 

గత మూడేళ్లలో 2,569 రైతు కుటుంబాలకు రూ.128.45 కోట్ల పరిహారం


సిద్దిపేట అగ్రికల్చర్‌, సెప్టెంబరు 14: అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 2.96 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సున్న 1,79,803 మంది రైతులను 2021–22 సంవత్సరానికి రైతుబీమాకు అర్హులుగా గుర్తించింది. గతేడాది జిల్లాలో 1,61,714 మందికి బీమా కల్పించారు. వీరిలో 59 సంవత్సరాలు నిండిన 8,726 మంది బీమాకు అర్హత కోల్పోయారు. ఈసారి కొత్తగా 26,815 మంది రైతుబీమా కల్పించారు. గతేడాది బీమా పొందిన రైతులను కొనసాగిస్తూనే, ఆగస్టు 3వ తేదీలోగా కొత్తగా భూమి కొనుగోలు రికార్డులు ఆన్‌లైన్‌లో నమోదయిన రైతులందరికీ రైతుబీమాకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 59 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న రైతుల నుంచి వ్యవసాయాధికారులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, నామిని ఆధార్‌కార్డు,  బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ కాపీలను సేకరించారు. ఆగస్టు 30వ తేదీతో రైతుబీమా నమోదుకు గడువు ముగిసింది. ఈమేరకు 1,79,804 మంది రైతులను ఈసారి రైతుబీమా పొందేందుకు అర్హులుగా గుర్తించి, వీరందరి తరఫున ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.3,486.90 చొప్పున ప్రీమియం చెల్లించింది. 


2,569 రైతు కుటుంబాలకు పరిహారం

రైతుబీమా పొందిన రైతు మరణిస్తే ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల బీమాసొమ్ము అందుతుంది. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 2018 నుంచి ఇప్పటి వరకు 2,569 మంది రైతు కుటుంబాలకు మొత్తం రూ.128.45 కోట్ల పరిహారం అందింది. కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలకు రైతుబీమా ఆర్థికంగా ధీమానిస్తున్నది. ఈ బీమా పథకానికి ప్రభుత్వమే సంవత్సరానికి ఒక్కో రైతుకు రూ.3,486.90 ప్రీమియం  చెల్లించి, ఆ కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. 2018–19 సంవత్సరంలో 763 రైతు కుటుంబాలకు రూ.38.15 కోట్లు, 2019–20లో 793 రైతు కుటుంబాలకు రూ. 39.8 కోట్లు, 2020–21లో 1,010 రైతు కుటుంబాలకు రూ.50.5 కోట్లు పరిహారం అందింది.


వృద్ధాప్య పింఛన్‌ ఉంటే రైతుబీమా కట్‌

వృద్ధాప్య పింఛన్‌ పొందుతున్న రైతులకు వ్యవసాయశాఖ అధికారులు రైతుబీమాను తొలగిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్‌, రైతుబీమా రెండు పథకాల్లో లబ్ధిపొందుతున్నవారిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. గతంలో 65 సంవత్సరాలు నిండినవారికే వృద్ధాప్య పింఛన్‌ వచ్చేది. దీంతో పలువురు ఆధార్‌కార్డులో పుట్టిన తేదీని మార్చుకుని పింఛన్‌ పొందుతున్నారని ఆరోపణలున్నాయి. ఇలాంటివారు రైతుబీమా పొందడం కోసం మరో ఆధార్‌కార్డును సృష్టించి నమోదు చేసుకుంటున్నట్టు గుర్తించారు. జిల్లాలో ఒకవైపు వృద్ధాప్య పింఛన్‌ తీసుకుంటూ మరోవైపు రైతుబీమా కోసం నమోదు చేసుకున్న 1,550 మందిని గుర్తించారు. వారిని అధికారులు రైతుబీమా, వృద్ధాప్య పింఛన్‌ ఏదో ఒకటి ఎంచుకోవాలని సూచించగా.. వారంతా పింఛన్‌ తీసుకోవడానికే మొగ్గుచూపారు. దీంతో అధికారులు వారి సమక్షంలోనే రైతుబీమా నుంచి తొలగించారు.


పది రోజుల్లో బీమా క్లెయిమ్‌ : శ్రావణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

రైతుబీమా పొందిన రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే 10 రోజుల్లోనే నామినీ ఖాతాలో రూ. 5 లక్షలు బీమా సొమ్ము జమ చేస్తున్నాం. రైతుబీమా లబ్ధిదారులు మృతిచెందితే కుటుంబ సభ్యులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. రైతుబీమాలో నమోదుకు 18 నుంచి 59  సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులు. వృద్ధాప్య పింఛన్‌ పొందుతున్నవారు 59 సంవత్సరాలకంటే ఎక్కువ వయస్సు కలిగిఉన్నట్టు గుర్తించి రైతుబీమా నుంచి తొలగించాం. వృద్ధాప్య పింఛన్‌ మినహా ఎలాంటి ఆసరా పింఛన్‌ తీసుకునే వారైనా రైతుబీమా నుంచి తొలగించడం లేదు.

Updated Date - 2021-09-15T05:02:54+05:30 IST