Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొగాకు సాగుకు రైతుల మొగ్గు

కందుకూరు, డిసెంబరు 4 : తుఫాన్‌ ప్రభావంతో పలు పంటలు దెబ్బతినడం, నల్లరేగడి నెలల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అదును దాటిపోవడంతో రైతులు పొగాకు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వర్షాల అదును దాటిపోయిన తరుణంలో నల్లరేగడి నెలల్లో పొగాకు మినహా ఏ పంట వేసిన సానుకూల దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. విధిలేని పరిస్థితుల్లో పొగాకు సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా తేలిక నేలల్లో మినుము సాగుచేసి దెబ్బతిన్న రైతులు కూడా మినుముని దున్నేసి పొగనాట్లు వేసేందుకు సిద్ధపడడం గమనార్హం. దీంతో పొగాకు సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. సాగు విస్తీర్ణం పెరిగినా క్యూరింగ్‌కు అవసరమైన బ్యారన్లు  అందుబాటులో ఉంటాయని పొగాకు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. పరిమితికి మించి పండించిన పంటపై పొగాకు బోర్డు వసూళ్లు చేసే అపరాద రుసుమును ఈ ఏడాది సగాకికి సగం తగ్గించడం కూడా రైతులకు కలిపొచ్చే అంశంగా మారింది. పరిమితికి మించి పొగాకు పండించిన బోర్డు పరిధిలో అమ్ముకునేందు ఇబ్బందిలేక పోవడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. కందుకూరులోని రెండు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో గత సంవత్సరం 20 వేల ఎకరాల వరకు పొగాకు సాగైంది. ఈ ఏడాది 30 వేల ఎకరాలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలకు ముందు కందుకూరు-1 వేలం కేంద్ర పరిధిలో 3500 ఎకరాలు కందుకూరు-2 వేలం పరిధిలో 2000 ఎకరాల్లో పొగనాట్లు దెబ్బతిన్నాయి. అయితే వర్షాలు వెలిసిన మరుసటి రోజు నుంచే దెబ్బతిన్న తోటల్లో తిరిగి నాట్లు వేసే ప్రక్రియను రైతులు ప్రారంభించారు. పొగనాట్లకు అనుకూలిస్తున్న భూముల్లోనూ, మూడునాలుగు రోజులుగా ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. దీంతో పొగనారు ధర కూడా రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా గత సంవత్సరం అనుమతించిన పరిమాణం కన్నా తక్కువ పొగాకు ఉత్పత్తి జరగడం ఈ ఏడాది కర్ణాటకలో కూడా అనుమతించిన దానికన్నా దాదాపు 20 మిలియన్ల తక్కువగా పొగాకు దిగుబడులు  రావడం కూడా రైతుల్లో పొగాకు సాగుపట్ల ఉత్సాహాన్ని కలిగిస్తుంది.  ముందుగా నాట్లు వేసే కలిగిరి , డీసీ.పల్లి వేలం కేంద్రాల పరిధిలో రేలపు దశలో తోటలు దెబ్బతిన్నాయి. ఈ పొగతోటలకు అపార నష్టం జరగడంతో ఈ ఏడాది దక్షిణాది తేలిక నేల పొగాకుకు మంచి డిమాండ్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయం కనిపించక పోవడంతో రైతులు పొగనాట్లుకు సిద్ధపడుతున్నారు. కొన్నేళ్లుగా తేలిక నేలల్లో పొగాకు సాగుకు స్వస్తి పలికిన రైతులు ఈ ఏడాది పెద్దఎత్తున తేలిక నేలల్లోనూ, పొగాకుకు సన్నద్ధం అవుతున్నారు. విస్తారంగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు, కుంటలు, చెక్‌డ్యాంలు, చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉన్నందున తేలిక నేలల్లో పొగనాట్లు వేస్తే అవసరమైతే ఒకటిరెండు నీటి తడులు ఇచ్చేందుకు ఇబ్బంది లేనందున మంచి దిగుబడులు సాధించవచ్చనే అలోచలనతతో రైతులు సిద్ధపడుతున్నారు. ఖాళీగా ఉన్న తేలిక నేలలతోపాటు మినుము సాగుచేసి దెబ్బతిన్న భూముల్లో సైతం ఆపైరును దున్నేసి పొగనాట్లు వేస్తున్నారు.  అదేవిధంగా నల్లరేగడి నేలల్లో శనగ సాగుకు ఇప్పటికే అదును దాటిపోయిందని భూములు ఆరాక శనగ వేసిన మంచి దిగుబడులు రావని అంచనా వేస్తున్న రైతులు ప్రత్యామ్నాయంగా పొగాకునే ఎంచుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది పొగాకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement