పరిహారం ఇవ్వరా..?

ABN , First Publish Date - 2020-10-23T10:45:56+05:30 IST

ముందు మురిపించిన వానాకాలం సాగు ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పైరు నేలవాలి, పత్తి కాయలు రంగు మారి పూత దశలోనే తీవ్ర నష్టం వాటిల్లింది

పరిహారం ఇవ్వరా..?

జిల్లాలో 20వేల ఎకరాల్లో వరి, 8వేల ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం 

30 శాతం వరి కోతలు పూర్తి 

ఇంకా ప్రారంభం కానీ కొనుగోలు కేంద్రాలు 

ఆందోళనలో రైతులు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ముందు మురిపించిన వానాకాలం సాగు ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పైరు నేలవాలి, పత్తి కాయలు రంగు మారి పూత దశలోనే తీవ్ర నష్టం వాటిల్లింది. పంట నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేక పోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. వరుస అల్పపీడనాలు వెన్నాడుతుండడంతో ఉన్న పంట కూడా చేతికి వస్తుందా రాదా అన్నది అనుమానాస్పదంగా మారింది. ఇప్పటికే కోతలు పూర్తయిన చోట వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక కల్లాల్లోనే ధాన్యం తడిసి ముద్దవుతున్నది. ధాన్యం రంగు మారి కొనరేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


తీవ్ర నష్టం

జిల్లాలో ఇటీవల అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురవడంతో 20 వేల ఎకరాల్లో వరి, ఎనిమిది వేల ఎకరాల్లో పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 12 వేల మంది రైతులు ఇప్పటికే పంట చేతికిరాకుండాపోయి సుమారు 80 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. నేలరాలిన వరిని కాపాడుకుందామనుకున్నా వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతూ నీటిలోనే నానిపోతున్నాయి. ముందస్తు నాట్లు వేసిన ప్రాంతాల్లో వరి కోత దశకు వచ్చింది.  ప్రతి రోజు సుమారు 2వేల నుంచి 2,500 ఎకరాల్లో వరికోతలు జరుగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం వరిధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేసినా ఇప్పటికైతే ఒకటిరెండు చోట్ల మినహా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. 


తేమ పేరుతో కొనుగోళ్లలో జాప్యం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 216 కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా 41 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ద్వారా 78 కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్‌శాఖ ద్వారా 8 కొనుగోలు కేంద్రాలు, మెప్మా, హాకా ద్వారా ఒక్కో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. మంత్రి గంగుల కమలాకర్‌ రెండుసార్లు జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహించే ఏజెన్సీలు తేమ ఉన్న వరిధాన్యం వస్తుందనే కారణంతో కేంద్రాలను ప్రారంభించకుండా ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఉన్న స్థలంలో ఇప్పటికే పూర్తిస్థాయిలో రైతులు ధాన్యాన్ని తెచ్చి కుప్పలుగా పోశారు. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో వరి ధాన్యం అక్కడే తడుస్తూ అక్కడే ఆరుతున్నది. మరో అల్పపీడనం ఏర్పడిందన్న నేపథ్యంలో మళ్లీ వర్షాలు కురిస్తే ఇప్పటికే వచ్చిన వరి ధాన్యం తడిచి రంగు మారిపోతుందని కోతకు వచ్చిన పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వెంటవెంటనే వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించడం ద్వారా తమకు నష్టం జరుగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.


ప్రభుత్వం స్పందించాలని అన్నదాతల వినతి

మరోవైపు పంట నష్టపోయిన రైతులు తమకు పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో నీటమునిగిన కుటుంబాలకు ఒక్కో ఇంటికి 10వేల రూపాయల చొప్పున తక్షణ సహాయంగా ఇస్తున్న ప్రభుత్వం ఆరుగాలం కష్టపడ్డ రైతులు నష్టపోయినా పంట నష్టపరిహారం గురించి పల్లెత్తు మాట అనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకోకుండా పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు పంట నష్టం అంచనాలే చేయడం లేనందు వల్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. పంట నష్టపరిహారం ఇవ్వడం విషయంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేయడంతోపాటు అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.  


కలవరం కలిగిస్తున్న సన్నధాన్యం ధర: 

ప్రభుత్వ నియంత్రిత సాగు విధానంలో భాగంగా సన్న రకం వరి ధాన్యం సాగు చేసిన రైతులు ఇప్పుడు తీవ్రంగా కలవరపడుతున్నారు. జిల్లాలో 2,51,000 ఎకరాల్లో వరి సాగు జరుగగా ఇందులో 1,31,000 ఎకరాల్లో సన్న రకాలు సాగు చేశారు. సన్న వరి రకాలకు రోగాలు రావడంతో ఎకరాకు మూడు వేల రూపాయల వరకు పెట్టుబడి పెరిగింది. దొడ్డురకం వరితో పోలిస్తే ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి తగ్గడంతో ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం సన్నరకాలు ఎలాంటి ధర ప్రకటించక పోవడంతో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర మేరకు క్వింటాల్‌కు 1,868 రూపాయలు మాత్రమే లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ధరతో సన్న రకాలను కొనుగోలు చేస్తే తీవ్రంగా నష్టపోవలసి వస్తోందని, సన్నరకాలు సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నారు. బోసన్‌ ఇవ్వని పక్షంలో మళ్లీ సన్న రకాలు సాగు చేసేందుకు  అంగీకరించమని రైతులు అంటున్నారు. 

Updated Date - 2020-10-23T10:45:56+05:30 IST