‘నియంత్రిత’ నైరాశ్యంలో రైతులు

ABN , First Publish Date - 2020-12-02T07:48:10+05:30 IST

తెలంగాణలో రైతులు నష్టాల ఊబిలోకి నెట్టివేయబడుతున్నారు. ఈ సంవత్సరం వానాకాల సాగులో ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయం పేరుతో, ఎన్నో ఏళ్లుగా...

‘నియంత్రిత’ నైరాశ్యంలో రైతులు

నిజానికి రైతుల పరిస్థితి దుక్కి దున్నినప్పటినుంచి కష్టాల మయమే. పంట చేతికొచ్చి అమ్ముకొనే దాకా నమ్మకం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే 2015 నుంచి నష్ట పరిహారం ఇవ్వడం లేదు. రైతుబంధు మొదలుపెట్టిన నాటి నుంచి పంటల బీమా పథకానికి రాష్ట్ర వాటా చెల్లించడం లేదు. ఫలితంగా రైతులకు పంటల బీమా పథకం ద్వారా అందే నష్ట పరిహారం రావడం లేదు. ఇప్పుడేమో ఉన్న పంటల బీమా పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిలోదకాలు వదిలాయి. దేశం కోసం రైతు. మరి రైతు కోసం ఎవరు?


తెలంగాణలో రైతులు నష్టాల ఊబిలోకి నెట్టివేయబడుతున్నారు. ఈ సంవత్సరం వానాకాల సాగులో ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయం పేరుతో, ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న పంటలు కాకుండా నిర్దేశిత పంటలు వేయమని సూచించింది. భూమి స్వభావం, నీటి లభ్యత, పెట్టుబడి, కూలీల సమస్య, మార్కెటింగ్ మొదలైన వాటిని బట్టి ఏ పంట సాగు చేయాలో నిర్ణయం తీసుకొని సాగు చేయడం రైతులకు పరిపాటి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పత్తి వేయమని, మొక్కజొన్న వేయొద్దని, సన్నరకం వరి సాగు చేయాలని రైతుల మీద ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకుంటే– కొనుగోలు చేయమని చెప్పారు. రైతు బంధు రాదేమో, పంటలను కొనుగోలు చేయరేమో అనే భయంతో రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలే సాగు చేశారు. గత ఏడాది పత్తి పంటను 54 లక్షల 45 వేల ఎకరాలలో సాగు చేస్తే ఈ సంవత్సరం 60లక్షల 22 వేల ఎకరాలలో సాగు చేశారు. కానీ భారీవర్షాల వల్ల 70 శాతం పత్తి పంట దెబ్బతింది. పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో రైతులు దిక్కుతోచక అల్లాడుతున్నారు.


మద్దతు ధరల జాబితాలో ఉన్న పంటల్లో మొక్కజొన్న ఒకటి. ఆ పంట వేయొద్దని, వేస్తే కొనుగోలు చేయమని చెప్పడం వల్ల గత ఏడాది 10 లక్షల 78 వేల ఎకరాలలో సాగు చేసిన మొక్కజొన్నను ఈ సంవత్సరం 2 లక్షల 25 వేల ఎకరాలలో మాత్రమే సాగు చేశారు. ఆ పంట రాష్ట్రం అంతటా ఒకేసారి రాదు. నిజామాబాద్ జిల్లాలో ముందుగా వస్తుంది. ప్రభుత్వం కొనుగోలు చేయదు అన్న ముఖ్యమంత్రి ప్రకటన మొక్కజొన్న పంట చేతికొచ్చిన అనంతరం వెలువడింది! దానికి మద్దతు ధర రూ.1850 ఉండగా రూ.1000 నుంచి రూ. 1200 లోపు ధరకే వ్యాపారులు కొన్నారు. ఫలితంగా ప్రతి రైతు ఎకరానికి 25 వేల వరకు నష్టపోయాడు. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని, అలాగే సన్నరకం వరికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి రూ. 2500/- ఇవ్వాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరపున అన్నీ జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చి రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేశాం. ప్రగతి భవన్ ముట్టడి సైతం చేశాం. అటు తర్వాత జగిత్యాల, కామారెడ్డి జిల్లాలలో రైతులు ధర్నాలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి దిగివచ్చి మొక్కజొన్నను కొనుగోలు చేస్తామని చెప్పారు. మరి తక్కువధరకే వ్యాపారస్థులకు అమ్ముకున్న రైతుల విషయం ఏమిటి? మొక్కజొన్న కొనుగోలు విధానం చూస్తుంటే దాని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అనిపిస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మొక్కజొన్న ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కాని 21 క్వింటాళ్లే కొంటున్నారు. మరి మిగిలింది ఎవరికి అమ్ముకోవాలి? పంట సాగు వివరాలు అధికారుల వద్ద ఉంటేనే కొంటున్నారు. నిజానికి సాగు వివరాలు రాసుకునేటప్పుడు మొక్కజొన్న వేసినా, రైతుబంధు కోసం ఇతర పంటలు వేసినట్లు రైతులు చెప్పారు. కొంతమంది అధికారులు గ్రామస్థాయిలో రైతులను కలవకుండానే సాగు వివరాలు రాసుకున్నారు! ఒకే జిల్లాలో రెండు మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య దళారులకే అమ్ముకోవడం మంచిదని చాలామంది రైతులు రూ. 1300 నుండి రూ.1400 లకే అమ్ముకుంటున్నారు.


వరి పంట సాగు విషయంలో టిఆర్‌యస్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి సన్నరకం వరి సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో రైతులంతా ఆ రకమే సాగు చేశారు. రాష్ట్రమంతా 52 లక్షల 55 వేల ఎకరాల్లో వరి సాగు అయితే అందులో 34 లక్షల ఎకరాల్లో సన్న రకం సాగు అయింది. అయితే సన్నాలకు విపరీతమైన దోమపోటూ, కాటుక రోగం వచ్చి పూర్తిగా దిగుబడి తగ్గిపోయింది. పంట పూర్తిగా నాశనం అయిన బాధాకర ఉదంతాలూ ఉన్నాయి. కొన్ని జిల్లాలలో పంట కోయిస్తే కూలీకి సైతం సరిపడా డబ్బులు కూడా పరిస్థితి. జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో చాలామంది రైతులు తమ పంటను తగలబెట్టుకున్నారు. రైతులు ఇలా ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం ఆలోచించాలి. అంతే కాకుండా అప్పులు ఎలా తీర్చాలో తెలియని మనోవేదనతో సన్న రకం పంట వేసిన రైతులు నిత్యం ఎక్కడో ఒక చోట ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. మద్దతు ధర విషయానికి వస్తే సన్నాలుకు, దొడ్డు రకం ధరలకు మధ్య 20 రూపాయల వ్యత్యాసం ఉంది. సన్నాలు క్వింటాలుకు రూ.2500 మద్దతు ధర డిమాండ్ చేసినా ప్రభుత్వం కనికరం చూపలేదు.


కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం ఆరోపణలు చేసుకుంటూ రైతులను ముంచుతున్నారు! ఈ మధ్య కేంద్రప్రభుత్వంతో చేసుకున్న యంఓయు కాపీ ఒకటి చూపిస్తూ బోనస్ ఇస్తే కేంద్రం పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నారు. మద్దతు ధర కంటే ఒక్క పైసా ఎక్కువ ఇచ్చినా కేంద్రం ఒప్పుకోదని ముఖ్యమంత్రి చెబుతుంటే కేంద్రం స్పందించకపోవడమేమిటి? నిజానికి ఎప్పుడూ రాష్ట్రప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా తీసుకోదు. ముఖ్యమంత్రి చెబుతున్నది నిజమైతే బోనస్ ఇస్తున్న రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉండాలి. మరి ఆ రాష్ట్రాలలో రాని సమస్య తెలంగాణలోనే ఎందుకు ఏర్పడింది? యాసంగి కొనుగోలులో తరుగు పేరు మీద రైస్ మిల్లర్లు ఏ విధంగా విచ్చలవిడిగా దోచుకున్నారో ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. కొనుగోలు కేంద్రాల్లో రైతు ధాన్యం తూకం వేయగానే రైతుకు తూకం పట్టీ ఇవ్వాలి. కానీ ఎక్కడా వారికి ఆ తూకం పట్టీ ఇవ్వడం లేదు. రైతు వద్ద కనీసం ఆధారం లేకుండా చేసి తరుగు పేరు మీద దోచుకుంటున్నారు. మిల్లర్ల మాటే నడుస్తోంది! .ఒక సభలో ముఖ్యమంత్రి స్వయంగా మద్దతు ధరకంటే 100 లేదా 150 ఎక్కువ రావాలి, వచ్చేటట్లు చేస్తా అని చెప్పారు. అది ఉత్త హామీగానే మిగిలిపోయింది. కిసాన్ కాంగ్రెస్ తరపున రాష్ట్రమంతా ధర్నాలు చేశాం. చాలా చోట్ల రైతులు స్వయంగా రోడ్ల మీదకు వచ్చి సన్నరకానికి రూ. 2500మద్దతు ధర ఇవ్వాలని ధర్నాలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మహిళా రైతులు ధర్నా చేసి మండల రెవెన్యూ అధికారికి తమ గోడు చెప్పుకున్నారు. సన్నాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు కానీ రైతుల డిమాండును మాత్రం ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు!


సన్నరకం వరికి బోనస్ ధర ఇవ్వమనే డిమాండ్‌తో రోడ్ల మీద ధర్నా చేస్తున్న రైతుల ఘోష కేంద్ర, రాష్ట్ర పాలకులకు విన్పించడం లేదు. వరదలతో పంటలన్నీ నీట మునిగి నష్టపోయిన రైతుల పొలాలు వారికి కనిపించడం లేదు. ప్రభుత్వాన్ని నమ్మి సన్నాలు సాగు చేసి చీడపీడలతో పంట అంతా నష్టపోతే తగల బెట్టుకుంటున్న పొలాలూ కనిపించడం లేదు. ప్రతి రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల వేదనా వాళ్లకు పట్టడం లేదు. దేశం కోసం రైతు. మరి రైతు కోసం ఎవరు? ఇప్పటికైనా ప్రభుత్వాలు మూసుకుపోయిన కళ్ళు తెరిచి రైతులను ఆదుకుంటే వ్యవసాయాన్ని రక్షించుకోగలుగుతాం. లేదా భవిష్యత్తులో సాగు చేసేవాడు ఉండని పరిస్థితి వస్తుంది. ఒకవేళ నిజంగా రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తే అప్పుడు దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఏం తింటారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

అన్వేష్ రెడ్డి సుంకేట 

చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్

Updated Date - 2020-12-02T07:48:10+05:30 IST