వి‘ప’త్తు

ABN , First Publish Date - 2022-05-21T04:58:11+05:30 IST

మార్కెట్‌లో అసలు విత్తనాలు ఏవో.. నకిలీవి ఏవో పోల్చుకోలేని

వి‘ప’త్తు

  • నాణ్యత లేని విత్తనాలతో రైతుల పరేషాన్‌
  • జిల్లాలో రెచ్చిపోతున్న మాఫియా
  • జోరుగా నకిలీ విత్తన వ్యాపారం
  • రహస్యంగా రైతులకు అంటగడుతున్న వ్యాపారులు
  • పత్తాలేని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు
  • మళ్లీ బీటీ-3 పైనే పత్తి రైతుల ఆసక్తి
  • యేటా కాత, పూత రాక లక్షల ఎకరాల్లో నష్టం


మార్కెట్‌లో అసలు విత్తనాలు ఏవో.. నకిలీవి ఏవో పోల్చుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రతిఏటా నకిలీల బారినపడి రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై వ్యవసాయాధికారులు దాడులు నిర్వహిస్తున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. రైతుల వద్దకే వెళ్లి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయి... ఎక్కువ లాభాలు పొందవచ్చని వ్యాపారులు రైతులకు ఆశ చూపుతూ మోసగిస్తున్నారు. 


రంగారెడ్డి అర్బన్‌, మే 20 : జిల్లాలో బ్రాండెడ్‌ ప్యాకెట్లలో విత్తనాలు ఉంచి రైతులకు అంటగడుతున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని రైతులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి ఇంటిల్లిపాది కష్టపడి పంటలను సాగు చేస్తున్నారు. తీరా పంట ఎదిగి పూత, కాతకు నోచుకోక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పటిదాక రైతు పడిన వ్యయ ప్రయాసాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుంది. లక్షలాది రూపాయలు నష్టపోయి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు బోరుమంటున్నారు.

రైతన్నలు వానాకాలం సాగుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. దుక్కులు దున్ని తొలకరి పలకరింపు కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది వానాకాలం సీజన్‌లో జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 3,79,675 ఎకరాలు కాగా, అందులో ప్రధాన సాగు పంటగా పత్తి 1,31,600 ఎకరాల్లో సాగు చేశారు. గత సీజన్‌ కంటే ఈసారి పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలున్నాయి. రైతుల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు అమ్ముతున్నారు. ప్రతి సంవత్సరం వ్యవసాయ, పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుంటున్నా వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. రైతుల ఆశలను ఆసరాగా తీసుకుని వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతీయేటా ప్రభుత్వం, జిల్లా అధికారులు నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా నకిలీ దందాకు పూర్తి స్థాయిలో చెక్‌ పడటం లేదు. ఫలితంగా అమాయక రైతులు నకిలీ విత్తన విక్రయదారుల మాయమాటలను నమ్మి మోసపోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అసలు విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు. 


బీటీ-3పైనే ఆసక్తి

నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలపైనే రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే.. కలుపు నివారణ లేకుండా పంట దిగుబడులు చేతికొచ్చే అవకాశం ఉన్న బీటీ-3 విత్తనాల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు.  కొన్నేళ్లుగా ఈ విత్తనాలను ప్రభుత్వం నిషేధించినా అమ్మకాలు మాత్రం జోరుగా కొనసాగుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపారులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని విక్రయించేందుకు కొందరు వ్యాపారులు గ్రామాల్లో ప్రతినిధులను నియమించుకుని.. వారి ద్వారా రైతులకు అందజేస్తున్నారు. ఏజెంట్లకు కొంత కమీషన్‌ ఆశచూపుతూ విక్రయాలు పెంచుకుంటున్నారు. 750 గ్రాముల బీటీ -3 పత్తి విత్తన ప్యాకెట్‌ ధర డిమాండ్‌కు అనుగుణంగా రూ.800 నుంచి రూ.1200 వరకు అమ్ముతున్నారు. ఇప్పటికే కొంత మంది రైతుల వద్దకు బీటీ-3 విత్తనాలు చేరాయి. రైతుల డిమాండ్‌ను బట్టి ఆయా గ్రామాల్లో నకిలీ విత్తనాలు నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


ముందుచూపు ఎక్కడ?

నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టేందుకు అధికారులకు ముందుచూపు కరువైంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా వ్యవసాయశాఖ అధికారుల తీరు కనిపిస్తోంది. వానాకాలం సీజన్‌ సమీపిస్తుంది. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. ఈక్రమంలో కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 


రహస్యంగా దిగుమతి

వ్యాపారులు నిషేధిత పత్తి విత్తనాలను గుట్టుచప్పుడుకాకుండా ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి బీటీ-3 విత్తనాలు జిల్లాకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. కర్ణాటక, ఏపీలోని కర్నూల్‌, గుంటూరు జిల్లాల తదితర ప్రాంతాల నుంచి తరలిస్తున్నట్లు సమాచారం. గతంలో పట్టుబడిన నకిలీ విత్తనాలు కూడ కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర నుంచి వచ్చినవేనని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారులు అదునుచూసి వివిధ మార్గాల్లో సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్‌ కేంద్రంగా ప్యాకింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా నిల్వ చేసుకున్న పత్తి విత్తనాలను రహస్యంగా ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లలో గ్రామాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం ఆప్రమత్తమైనట్లు కనిపించడం లేదు. 


నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

జిల్లా, మండల స్థాయిలో తనిఖీలు చేస్తున్నాం.. నకిలీ విత్తనాల కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. వ్యాపారులు నకిలీ, నిషేధిత విత్తనాలను విక్రయిస్తే చర్టపరమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయశాఖ లైసెన్స్‌ పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తన కొనుగోలు బిల్లుపై నెంబర్‌, విత్తన రకం, గడువు తేదీలు, డీలర్‌ సంతకం, రైతు సంతకం బిల్లుపై ఉండేలా చేసుకోవాలి. లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయొద్దు, విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లును పంటకాలం పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. 

- గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి 


జిల్లాలో పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు, నమోదైన కేసుల వివరాలు

వివరాలు 2019 2020 2021 2022

నమోదైన కేసులు 01 07 18 --

ఏపీసీ కేసులు 01 07 14 --

6ఎ కేసులు -- -- 02 --

పీడీ యాక్ట్‌ -- -- 01 --

డెటెన్షన్‌ -- -- 04 --

కాటన్‌ (లూస్‌ సీడ్స్‌) 1.67క్వింటాళ్లు 63.00 క్వింటాళ్లు 80.20 క్వింటాళ్లు 1,500 కిలోలు

కాటన్‌ (ప్యాకెట్లు) -- 1078 ప్యాకెట్లు 869 ప్యాకెట్లు --

ఇతర పంటలు -- 4.80 క్వింటాళ్లు 13.455 క్వింటాళ్లు --

మొత్తం విలువ 1.85 లక్షలు 108.273 లక్షలు 167.03 లక్షలు రూ.15 లక్షలు

శాంపిల్‌ సంఖ్య 01 14 40 --

అరెస్టయిన వారు -- 11 20 --

Updated Date - 2022-05-21T04:58:11+05:30 IST