సాగుభూమి కనుమరుగు

ABN , First Publish Date - 2020-06-06T09:44:03+05:30 IST

గతంలో వర్షాకాలం వచ్చిందంటే గ్రామీణప్రాంతాలు పలురకాల పంటలతో కళకళలాడుతూ

సాగుభూమి కనుమరుగు

మేడ్చల్‌ జిల్లాలో తగ్గుతున్న సాగు విస్తీర్ణం 

గతంలో 70వేల ఎకరాల్లో సాగు... ప్రస్తుతం 25వేల ఎకరాలకే పరిమితం

భారంగా వ్యవసాయం 

భూముల విక్రయానికే రైతుల మొగ్గు 

నగరానికి చేరువలో ఉండటంతో భూముల ధరలకు రెక్కలు 

జోరుగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం


పల్లెల్లో పచ్చని పొలాలు కనుమరుగవుతున్నాయి. వ్యవసాయ భూములన్నీ రియల్‌ దెబ్బకు మాయమవుతున్నాయి. వివిధ పంటలు పండే భూములు వెంచర్లు, లేఅవుట్లుగా మారుతున్నాయి. నగర శివారులో ఉండే గ్రామాల భూములపై రియల్‌వ్యాపారుల కన్ను పడింది. రహదారుల వెంట ఉండే పంట పొలాలను కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చుతున్నారు. ధర బాగానే రావడంతో రైతులు కూడా వాటిని అమ్ముకుంటున్నారు. దీంతో సాగు భూమి కనిపించకుండా పోతోంది.


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : గతంలో వర్షాకాలం వచ్చిందంటే గ్రామీణప్రాంతాలు పలురకాల పంటలతో కళకళలాడుతూ ఉండేవి. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాలు పచ్చని పొలాలతో కనువిందు చేసేవి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకోవడంతో పల్లెలు ఆ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములు వెంచర్లు, లేఅవుట్లుగా మారుతున్నాయి. వ్యవసాయం భారం కావడంతోపాటు పంటల దిగుబడులు తగ్గిపోయి నష్టాలను చవిచూడటం.. పల్లెల్లోని వ్యవసాయ భూములు నగరానికి చేరువలో ఉండటం... రియల్‌ వ్యాపారంతో భూములకు అధిక ధరలు పలుకుతుండటంతో రైతులు అమ్ముకునేందుకు మొగ్గుచూపుతున్నారు.


మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో వరితోపాటు కూరగాయలు, పండ్ల తోటల సాగు అధికంగా ఉంటుంది. గతంలో దాదాపు 70వేల ఎకరాల్లో పలురకాల పంటలను సాగుచేసేవారు. ప్రస్తుతం 26వేల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగవుతున్నాయి. సాగు భూములు అమ్ముకున్న కొంతమంది రైతులు, నీటిసౌకర్యం ఉన్న ప్రాంతాల్లో మళ్లీ భూములు కొనుగోలు చేసుకుని పంటలు పండిస్తున్నారు. మరికొంతమంది పట్టణాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని గ్రామాలన్నీ నగరశివారు ప్రాంతాల్లో ఉండటంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను పంట భూములపై పడింది. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న భూములను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో లేఅవుట్‌ను దాదాపు 20 నుంచి 100ఎకరాలకు విస్తరిస్తున్నారు. మొదట నాలుగు ఎకరాలతో ప్రారంభమైన వెంచర్లు.. నాలుగైదేళ్లలో వందల ఎకరాలకు చేరుకుంది. దీంతో పంటలు పండే భూములన్నీ ప్లాట్లుగా మారుతున్నాయి. 


కీసర మండలంలోని నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, అహ్మద్‌గూడ, కీసర, బోగారం గ్రామాలు, మేడ్చల్‌ నగరపంచాయతీ సమీప గ్రామాలు, శామీర్‌పేట్‌ మండలంలోని శామీర్‌పేట్‌, తూంకుంట, అంతాయిపల్లి, ఉప్పర్‌పల్లి, దేవరయంజాల్‌ గ్రామాలు, ఘట్‌కేసర్‌ మండలంలోని నారపల్లి, పోచారం, అన్నోజిగూడ, శివారెడ్డిగూడ, కొర్రెమలు, చౌదరిగూడ, ప్రతాపసింగారం, కాచవానిసింగారం, కొండాపూర్‌ గ్రామాల్లో వ్యవసాయ భూములు కనుమరుగై లేఅవుట్లు, వెంచర్లుగా దర్శనమిస్తున్నాయి. మేడ్చల్‌ జిల్లాలో నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్లు, 9 మునిసిపాలిటీలు ఏర్పడ్డాయి. రోజురోజుకూ నగరం విస్తరిస్తుండటంతో గతంలో శివారులో ప్లాట్లను కొనుగోలు చేసుకున్న వారు సొంతింటిని నిర్మించుకుంటున్నారు. మరికొందరు స్థిరాస్తి కోసం ముందస్తుగా ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడికైనా సులువుగా వెళ్లేందుకు ఔటర్‌, ఇన్నర్‌ రింగురోడ్లు, జాతీయరహదారులు ఉండటంతో ఈప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. శివారులో పారిశ్రామికవాడలు నెలకొల్పారు. కొత్తగా మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. దీంతో భూములు, ప్లాట్ల ధరలు అమాంతం పెరిగాయి. సాగు భూములు కనుమరుగవడంతో ఆహార ధాన్య ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది.


మేడ్చల్‌ జిల్లా నగరానికి చేరువలో ఉండటంతో పదేళ్లుగా రియల్‌ వ్యాపారం ఊపందుకుంది. శివార్లలో గ్రామాలన్నీ మునిసిపాలిటీలుగా మారాయి. దీంతో జిల్లాలోని శామీర్‌పేట్‌, ఘట్‌కేసర్‌, కీసర, మేడ్చల్‌ మండలాల పరిధిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఆరునెలల కాలంలో అన్ని మండలాల్లో ఎకరాకు 30 నుంచి 50శాతం ధరలు పెరిగాయి. జిల్లాలోని ఈ మండలాల్లో రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. చాలావరకు కొత్తగా హెచ్‌ఎండీఏ లేఅవుట్లు ఏర్పాటు చేస్తూ ప్లాట్లను విక్రయిస్తున్నారు. రెండేళ్ల క్రితం గజం భూమి రూ. 4,500 నుంచి రూ.6000వరకు ఉండేది. ప్రస్తుతం రూ.6000 నుంచి రూ.15వేల వరకు ధర పలుకుతోంది. ప్లాట్ల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.


ప్రధాన రహదారులపై ఎటుచూసినా కొత్తగా వెలిసిన లేఅవుట్లే దర్శనమిస్తున్నాయి. ఒక్కోచోట 10 నుంచి 100 ఎకరాల్లో వెంచర్లను నిర్మిస్తున్నారు. ఆరునెలల్లో శామీర్‌పేట్‌లోని భూములకు రెట్టింపుస్థాయిలో ధరలు పెరిగాయి. శామీర్‌పేట్‌ మండలంలోని అంతాయిపల్లిలో నూతన కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో శామీర్‌పేట్‌ ప్రాంతం జిల్లా కేంద్రంగా మారనుంది. ఈ నేపథ్యంలో రాజీవ్‌రహదారికి ఇరువైపులా లేఅవుట్లు చేశారు. భూముల ధరలు ఆరునెలల కింద ఎకరానికి రూ.1.50కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.2 నుంచి రూ.2.50కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయి. రహదారులకు దగ్గరలో ఉన్న గ్రామాల్లోనూ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మేడ్చల్‌ మండలంలోని 45వ నేషనల్‌ హైవేపై ఎకరాకు రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు ధరలు ఉన్నాయి. ఆరు నెలల్లోగా 20శాతం వరకు పెరిగాయి.


కీసర మండలంలో ఆరు నెలల కిత్రం ఎకరాకు రూ.80లక్షల వరకు ఉండేది. ప్రస్తుతం ఎకరాకు రూ.1.50కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. ఈసీఐఎల్‌ నుంచి కీసర.. అక్కడ నుంచి ఘట్‌కేసర్‌ రోడ్డుకు ఇరువైపులా వెంచర్లు వెలిశాయి. ఘట్‌కేసర్‌ మండలంలో హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయరహదారికి ఇరువైపులా ఆరునెలల కింద ఎకరం ధర రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ధర ఉండేది. ప్రస్తుతం రూ.కోటి నుంచి రూ.1.50కోట్ల వరకు పలుకుతోంది.


Updated Date - 2020-06-06T09:44:03+05:30 IST