Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అప్పులోళ్లా.. యములోళ్లా?.. మొగుడు పోయినా నువ్వున్నావుగా!

twitter-iconwatsapp-iconfb-icon
అప్పులోళ్లా.. యములోళ్లా?.. మొగుడు పోయినా నువ్వున్నావుగా!

అప్పు తీర్చకుంటే భార్యను పంపు!

ఉన్న భూమి అమ్మి అప్పు కట్టు!

సాయమిచ్చిన సొమ్మూ మింగారు

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో రైతు కుటుంబాల కన్నీటి వరద

‘ఆంధ్రజ్యోతి రైతు నిధి’ నుంచి 6 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం


‘ఇస్తే ఇయ్యి... లేకపోతే నీ పెండ్లాన్ని పంపు’... ఈ మాట ఒక మనిషిని చంపేసింది! ‘నీ మొగుడు పోతేనేం... నువ్వు బతికే ఉన్నావు కదా! అప్పు కట్టు’... ఈ మాట బతికున్న మనిషినీ చంపేస్తోంది! మనిషి ఉన్నా.. పోయినా కష్టం మాత్రం పోలేదు! చిన్న రైతులు... చితికిపోయిన బతుకులు! అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు రైతుల కుటుంబ సభ్యులతో ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌’లో కన్నీళ్లు వెల్లువెత్తాయి. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాల దుస్థితి అందరినీ కలిచి వేసింది. పూర్తి వివరాలు... 12-10-2015న ఏబీఎనలో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు...


ఆర్కే : నీ పేరేంటి?

అనిత


ఆర్కే : ఏ ఊరు?

అనిత : బూచనపల్లి


ఆర్కే : రంగారెడ్డి జిల్లానా?

అనిత : అవును సార్‌. రంగారెడ్డి జిల్లా


ఆర్కే : మీ భర్త ఎలా చనిపోయాడు?

అనిత : ఉరేసుకుని


ఆర్కే : ఎప్పుడు?

అనిత : ఆరో నెలల


ఆర్కే : జూన్‌లోనా?

అనిత : ఆ.. మొన్న నాలుగు నెలలాయె


ఆర్కే : ఎందుకు చనిపోయాడు?

అనిత : అప్పుల బాధకు


ఆర్కే : అప్పు ఎంతుంది?

అనిత : రెండు లక్షల యాభైవేలు ఉంది.


ఆర్కే : సొంతం పొలం ఉందా?

అనిత : ఉంది


ఆర్కే : ఎంతుంది?

అనిత : రెండెకరాలు


ఆర్కే : ఏం పండలేదా?

అనిత : ఏం పండలేదు. పత్తి వెట్టినం.. పత్తి వోయింది, మక్క వెట్టినం.. మక్క వోయింది.


ఆర్కే : ఎందుకు? విత్తనాల వల్లనా?

అనిత : విత్తనాలా మరి ఎందో తెలియదు. అప్పు తెచ్చి మందు కొట్టిండు. మందు కొట్టింనంగ కూడా పత్తి వండలేదు, మక్క వండలేదు. కూలి పైసలు కూడా రాలేదు. అప్పులెక్కువైనయనే హైదరాబాద్‌ వోయినం. అక్కడ కూడా ఇండ్లళ్ల పాసి పని చేసిన. ఆయన నీళ్లబండి నడిపిండు. అక్కడ కూడా మాకు ఆదెరువు తెలవలేదు. ఏంచేయాల్నో తెలవక మళ్లా ఊరికొచ్చినం. అప్పులు ఇచ్చినోళ్లు ఊరుకోలేదు. నేను మా చెల్లె పెండ్లి ఉందని మా అమ్మ ఊరికిపోయిన. అప్పులోళ్లు కొట్టనీకొచ్చిండ్రట. ఇస్తే ఇయ్యి లేకపోతే నీ పెండ్లాన్ని మాదగ్గర పండబెట్టు అన్నరట. ఆ బాధతోనే ఉరేసుకున్నడు.


ఆర్కే : చెప్పిండా నీకు ఇట్లా అన్నారని?

అనిత : చెప్పిండు


ఆర్కే : అప్పు ఇచ్చిందెవరు?

అనిత : ఇచ్చిందెవరో తెలియదు. తెచ్చినా అని చెప్పిండు గనీ వీళ్లతానా అని చెప్పలే.


ఆర్కే : ఆయన చనిపోయిన రోజు నువ్వు ఎక్కడున్నావు?

అనిత : మా అమ్మోళ్ల ఇంటికిపోయినం. ఆయన ఇంటికి పోయస్తా అని వచ్చిండు. నేను వచ్చేసరికే ఉరేసుకుని చనిపోయిండు.


ఆర్కే : అంతకు ముందెప్పుడన్నా చనిపోవాలని అనిపిస్తుందని అన్నాడా?

అనిత : లేదు సార్‌. చనిపోవాలని ఉందని అనలేదు. పైసలియ్యకపోతే నిన్ను రమ్మంటున్నరు అని అన్నడు.


ఆర్కే : అప్పు ఎంత ఉంది?

అనిత : రెండు లక్షల యాభైవేలు ఉంది.


ఆర్కే : గవర్నమెంట్‌ రుణాలు మాఫీ చేసింది కదా? మీది కాలేదా?

అనిత : మాకు ఏం చేయలేదు.


ఆర్కే : మీరు బ్యాంకులో తీసుకోలేదా?

అనిత : బ్యాంకులో యాభైవేలు ఉంది. బయట రెండు లక్షలు ఉంది.


ఆర్కే : బ్యాంకులో తీసుకున్నది మాఫీ కాలేదా?

అనిత : కాలేదు సార్‌.


ఆర్కే : మీ ఊర్లో లీడర్లను అడిగారా?

అనిత: అడిగినం. మీరు అనుకన్నంతనే మాఫయితదా అన్నరు. గవర్నమెంటు పనులు లేటయితది అన్నరు.


ఆర్కే : ఎంత మంది పిల్లలు?

అనిత : ముగ్గురు ఆడవిల్లలు. ఒక అబ్బాయి. పిలగాన్ని తీసుకుని పనికిపోతే, ఏందే, నీకు కూసుండవెట్టి కూలియ్యాల్నా అంటున్నారు. మా అత్త ముసలిదయింది, చాతనయితలేదు. పించను కూడా వస్తలేదు.


ఆర్కే : పించను వస్తలేదా?

అనిత : వస్తలేదు.


ఆర్కే : దరఖాస్తు చేసుకున్నావా?

అనిత : చేసినం. నాలుగు నెలలయితాంది. సర్పంచ్‌కు కూడా చెప్పినా.


ఆర్కే : మరి ఇప్పుడు ఎట్లా బతుకుతున్నవు?

అనిత : మా అమ్మానాయినా ఉన్నరు. వాళ్లే తెచ్చిపెడుతుండ్రు.


ఆర్కే : మీ ఆయనకు అన్నదమ్ములు లేరా?

అనిత : బావున్నడు.


ఆర్కే : మీ అత్తను వాళ్లింట్లో ఉంచుకోరా?

మా బావ ఎడ్డోడు. మా యారాలు కుంటిది.


ఆర్కే : వాళ్లకు కూడా మంచిగలేదు?

అనిత : మంచిగలేదు. పిల్లలను మా అత్త చూసుకుంటే పనికిపోదామంటే ఈ పిలగాడు పాలకుండడు. నేను వీళ్లని పట్టుకుని ఉంటున్న. మా అమ్మకు, నాయినకు కూడా చాతకాదు. మేం ముగ్గురం కూడా ఆడపిల్లలమే. ఒక చెల్లె పెండ్లికుంది.


అప్పు తీసుకున్నవు తిడితే వడాలే, కొడితే వడాలే అన్నరు


ఆర్కే : వాళ్లకేమన్న రుణం మాఫీ అయిందా?

అనిత : ఏమో నాకు తెల్వదు సారు.


ఆర్కే : గవర్నమెంట్‌ ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నావు?

అనిత : నా పిల్లలను చూసి ఏదన్నా సాయం చేయాలి.


అప్పులోళ్లు వచ్చి నా మొఖం మీద ఊంచి పోయిండ్రు. చీర ఇట్ల వట్టి గుంజుకపోయిండ్రు నన్ను. నీ మొగడు సచ్చిపోతే నువ్వు సచ్చిపోలే కదా అన్నరు. ఇంట్ల ఉండటానికి కూడా తావు లేదు. వానకు ఇల్లు కూడా కూలిపోయింది. పోతే ఉండటానికి కూడా రాదు. అందుకే మా అమ్మ వాళ్ల దగ్గర్నే ఉంటన్న.


ఆర్కే : చీరపట్టి గుంజినపుడు పోలీసులకు కంప్లయిట్‌ చేయలేదా?

అనిత : చేయలే. అప్పు తీసుకున్నవు తిడితే వడాలే, కొడితే వడాలే అని మందందరు అన్నరు. సరే అని సప్పుడుజేకనే ఊకున్న.


ఆర్కే : ఇప్పుడు వాళ్లను గుర్తుపడతావా?

అనిత : ఆ.. గుర్తుపడతా.


ఆర్కే : వాళ్ల పేర్లు చెబుతావా?

అనిత : సోమారం పెంటయ్య. మా ఆయనని గల్లవట్టి కొట్టంగ కూడా చూసిన.


ఆర్కే : ఆయనొక్కడేనా?

అనిత : ఆయనొక్కడే. తతిమోళ్లు తిట్టిండ్రు కనీ ఏమండ్లే.


ఆర్కే : పెంటయ్య దగ్గర ఎంత తీసుకున్నారు?

అనిత: ఆయన దగ్గర పదివేలు తీస్కున్నాని చెప్పిండు.


ఆర్కే : ఇప్పుడు పెంటయ్య ఏమంటున్నడు?

అనిత : మిత్తితోని ముప్ఫైవేలు కట్టాలే అంటండు.


ఆర్కే : ఎప్పుడు తీసుకున్నడట పదివేలు

అనిత : రెండు సంవత్సరాలాయే అంటున్నడు.


ఆర్కే : నీకేం తెలియదు?

అనిత : నాకేం తెలియదు. అప్పు తెచ్చినా అని చెప్పిండు గనీ గిట్లా అన్ని చెప్పలే.


ఆర్కే : మీ ఆయనకు తాగుడు అలవాటుండెనా?

అనిత : ఏం అలవాట్లు లేకుండే. ఎప్పుడన్నా అలసిపోయినపుడు తాగుతుండే. వచ్చి పండుకుంటుండే.


ఆర్కే : రోజూ తాగుడు లేకుండెనా?

అనిత : లేదు


ఆర్కే : వేరే కౌలుకు కూడా చేశాడా?

అనిత : బయట చేసినం. మా ఊళ్ల నర్సింహరెడ్డి అని ఉంటడు. వాళ్ల దగ్గర పనికిపోయి వాళ్ల దగ్గర్నే బతుకుతుంటిమి. వాళ్లకు ఇదయితలేదని హైదరాబాద్‌ పోయినం. అక్కడ కూడా ఆదెరువు దొరకక మల్లొచ్చినం. ఈడికొచ్చినాక పెండ్లాన్ని అమ్మి అప్పుకట్టు అన్నరట. ఆ బాధతోటే ఉరేసుకున్నడు.


ఆర్కే : పించను వస్తుందా?

అనిత : లేదు సార్‌


ఆర్కే : బియ్యం కార్డు ఉందా?

అనిత : ఉంది. పద్దెనిమిది కిలోలు ఇస్తుండ్రు.


ఆర్కే : భూమి కౌలుకు ఇవ్వలేదా?

అనిత : ఎవ్వలు తీసుకుంటరు సార్‌. తీసుకుంటే అప్పు కట్టమని మమ్మల్ని అడగతరు అని ఎవ్వలు తీసుకోవట్లేదు.


ఆర్కే : నువ్వే వ్యవసాయం చేసుకుంటావా?

అనిత : పిల్లలు చిన్నోళ్లు కదా నాతోని ఎక్కడయితది. పిల్లలు జర పెద్దోళ్లయితే చేసుకోగలుగుతా.

కష్టం చేసినా పొట్ట గడుస్తలేదు


ఆర్కే : నీ పేరేంటమ్మ?

శాలమ్మ సార్‌.


ఆర్కే : మీకు కూడా అప్పులున్నాయా?

శాలమ్మ : అప్పులే సార్‌.


ఆర్కే : ఎంత?

శాలమ్మ : మూడు లక్షల దాకా చేసిండు..


ఆర్కే : అప్పులిచ్చినోళ్లు ఏం చేస్తున్నరు?

శాలమ్మ : కట్టమంటున్నరు. కట్టే పరిస్థితుల లేము. నాకు ముగ్గురు బిడ్డలు. ఇద్దరు పిల్లలు పెండ్లికొచ్చిండ్రు. మూడు లక్షల అప్పు చేసిండు. మందు తాగి సచ్చిపోయిండు. కష్టం చేసినా పొట్ట గడుస్తలేదు. ఎట్ల బతకాలా? పిల్లలు అమ్మా బుక్కు, అమ్మా పెన్ను అంటరు. పొట్టకేం తినాలె, పిల్లల సదువులకెక్కడ్నించి తేవాలె.


ఆర్కే : ఎక్కడ పొలంలోనా?

శాలమ్మ : ఇంటికాన్నె.


ఆర్కే : కూలికెళుతున్నవా?

శాలమ్మ : ఈళ్లు ముగ్గురు ఇస్కూల్‌కు వోతె నేను కూలికి వోతున్న.


ఆర్కే : నీకెంతుంది భూమి?

శాలమ్మ : ఎకరం సార్‌.


ఆర్కే : నీకు కూడా గవర్నమెంట్‌ నుంచి అప్పు మాఫీ కాలేదా?

శాలమ్మ : కాలే.


ఆర్కే : బ్యాంకులో ఎంతుంది?

శాలమ్మ : డెబ్బై వేలు. కాయితాల మీద ఇరవై ఉన్నయి, బంగారం, పుస్తెలతాడు పెట్టి యాభై వేలు తెచ్చిండు. ఒక్కపైసా మాఫీ కాలే.


ఆర్కే : బయట ఎంత మిత్తికి తీసుకున్నరు?

శాలమ్మ : మూడు రూపాయలు


ఆర్కే : వాళ్లకు భూమి కాగితాలు ఇచ్చారా?

శాలమ్మ : మాది లావణి పట్టా. ఎకరం ఉంది. ఐదెకరాలు కౌలుకు తీసుకుని చేసినం.


ఆర్కే : ఏం పండించారు?

శాలమ్మ : అంతా పత్తే ఏసినం. అప్పులెక్కువైనయి.


ఆర్కే : ఎందుకని పత్తి పండలేదు?

శాలమ్మ : కాలంగాక, విత్తనం మంచిదిగాక


ఆర్కే : కాయలు కాయలేదా?

శాలమ్మ : అవును సారు, చెట్టు పెరిగింది గనీ కాయలు కాయలే.


ఆర్కే : అప్పులోళ్లు వెంటపడుతున్నప్పుడు చావాలనిపిస్తుంది అనీ అనే వాడా?

శాలమ్మ : కష్టం చేసుకుని కడతం అనుకున్నం. రోజొచ్చి అప్పులోళ్లు పీక్కుతినే సరికి మందు తాగిండు.


ఆర్కే : మీ ఆయన, నువ్వు అప్పుల గురించి మాట్లాడుకునే వాళ్లా?

శాలమ్మ : మాయిద్దరికీ తెలిసిన అప్పులే సారు.


ఆర్కే : వాళ్లు వేరే వాళ్లకి కూడా అప్పులు ఇస్తుంటారా?

శాలమ్మ : ఇస్తరు.


ఆర్కే : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆరు లక్షలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కదా? ఆ డబ్బులు రాలేదా?

శాలమ్మ : ఒక్క పైసా కూడా ఇయ్యలేదు. ఇంత సాయం కూడా చేయలే.


ఆర్కే : మీ ఆయన ఎప్పుడు చనిపోయిండు?

శాలమ్మ : డేట్లు తెలవది సారు. గీ పోటువ మీదుంది.


ఆర్కే : డిసెంబర్‌ 20వ తేదీన చనిపోయిండు. పది నెలలవుతోంది. మీ ఆయన చనిపోయింది రాసుకోవడానికి అధికారులు రాలేదా?

శాలమ్మ : వచ్చిండ్రుసార్‌. టీవీలకిస్తరు కదా వాళ్లొచ్చి రాసుకపోయిండ్రు.


ఆర్కే : వాళ్లు కాదమ్మా, సర్కారోళ్లు, తహసీల్దారు ఆఫీసోళ్లు?

శాలమ్మ : ఎవ్వరు రాలేదు సారు.


ఆర్కే : ఇల్లుందా?

శాలమ్మ : ఉంది సారు, రెండు అర్రలు.


ఆర్కే : తెల్లకార్డు ఉందా?

శాలమ్మ : బియ్యం కార్డు ఉంది.


ఆర్కే : బియ్యం ఇస్తున్నారా?

శాలమ్మ : ఇస్తుండ్రు.


ఆర్కే : పించను వస్తుందా?

శాలమ్మ : వస్తంది


ఆర్కే : ఎంత?

శాలమ్మ : వెయ్యిరూపాయలు


ఆర్కే : ఊళ్లో సర్పంచ్‌ను కలవలేదా?

శాలమ్మ : కలిసినం. చేస్తున్నం, చేస్తున్నం అంటరు.


ఆర్కే : పోయినసారి ఓట్లు ఎవరికేశారు?

శాలమ్మ : దేనికేసినమో యాదుందా సారు.


ఆర్కే : ఎవరికి ఏస్తున్నామో తెలియకుండానే ఓటేస్తున్నారా? నువ్వు కూడా అంతేనా?

అనిత : నేను చెయ్యి గుర్తుకేశిన. గెలిసిన తరువాత పోయి తాతా నాకిట్లా పించను వస్తలేదని అడిగితే గద్దన్న బెదిరిచ్చిండు.


ఆర్కే : ఎవరూ? మీ ఎమ్మెల్యేనా?

అనిత : కాదు సర్పంచ్‌. ఎమ్మెల్యే దగ్గరకు కూడా పోయిన. వికారాబాద్‌ పోయి కలిసి ఏమన్నా సాయం చేయిండ్రి సారూ అని అడిగితే ఇంత మంది పిల్లలను ఎందుకు కన్నవని అన్నడు. మెడవట్టి బయటకు గెంటేపిచ్చిండ్రు సారు.


ఆర్కే : మిమ్మల్ని ఓట్లడిగింది ఎవరు?

అనిత : ఊరి సర్పంచ్‌ అడిగిండు.


ఆర్కే : మరి ఆయన దగ్గరకు వెళ్లి అడగలేదా?

అనిత : అడిగినం సారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నరు, ఏడికి వోనికి లేదు. నాకు పది కిలోల బియ్యమన్నా చేయమని అడిగితే గద్దన్న బెదిరిచ్చిండు. ఎవ్వరు పట్టించుకోలేదు సార్‌.


మమ్మల్ని ఆగం చేసి పోయిండు


ఆర్కే : నీది ఏ వూరమ్మా?

మెదక్‌ జిల్లా పీలపల్లి. నా పేరు రేణుక సార్‌.


ఆర్కే : మీకు భూముందా?

రేణుక : ప్రైవేటు జాగ కొనుక్కున్నం సార్‌.


ఆర్కే : ఎన్ని ఎకరాలు కొన్నరు?

రేణుక : ఇద్దరన్నదమ్ములు రెండెకరాలు కొన్నరు. యాభై వేలకు ఎకరం. దాండ్ల రెండు బోర్లేసినం. బాయి తోడినం. నీళ్లు వళ్లే. అక్కడ ప్రాజెక్టు వడ్డది కదా సారు. ఆ ప్రాజెక్టు నిండితేనే నీళ్లు. నీళ్లు లేక పంట పండక అప్పులయినయి.


ఆర్కే : మీకెంతుంది అప్పు?

రేణుక : మూడు లక్షలపైనే ఉంది.


ఆర్కే : బ్యాంకులో?

రేణుక : నలభై వేలు ఉంది.


ఆర్కే : అది మాఫీ కాలేదా?

రేణుక : నాకు తెలువది సార్‌, అన్నీ ఆయనకే తెలుసు.


ఆర్కే : బ్యాంకోళ్లు ఇంటికొచ్చిండ్రా?

రేణుక : రాలేదు. బయట నాలుగు రూపాయలకు తె స్తే మిత్తి పెరిగి కట్టలేకపోయినం. ఉన్న ఎకరం కూడా తీసేద్దామని అనుకున్నం. తెచ్చేటప్పుడు ఇద్దరం కలిసే తెచ్చినం. పంచాయతీ ఆపీసుల పనిచేస్తే వెయ్యిరూపాయలు ఇస్తరు. జాగ వల్ల నిండ మునిగిపోయినం సారు.


ఆర్కే : అప్పులోళ్లు తిట్టారా?

రేణుక : ఈయనను తిట్టిండ్రట గనీ చెప్పలే. ఆయనది ఆయనే మనసుల పెట్టుకుని ఉరేసుకున్నడు. మమ్మల్ని ఆగం చేసి పోయిండు. నా పెద్ద బిడ్డ ఆరోగ్యం బాగుండదు. బాబుది కూడా ఆరోగ్యం బాగుండదు. ఏం చేయాలో అర్థమయితలేదు. ఇల్లు కూడా లేదు సారు. గుడిసేసుకుని ఉంటున్నం.


ఆర్కే : మీ ఎమ్మెల్యే కేసీఆర్‌ అనే సంగతి తెలుసా?

రేణుక : తెలుసు సార్‌. ఏం చేస్తడో సార్‌. ముంచేది తెలువది, గడ్డకేసేది తెలువది. ఎట్ల చేసేది తెలువది. మా తలాపుకున్నట్టే ఉన్నడు గనీ మమ్ములను తొంగి చూసే పరిస్థితి లేదు. ఇట్లాంటోళ్లు పోయి ఆగం చేసినా ఆయనకు మేం ఇంకా కనిపిస్తలేం సార్‌.


ఆర్కే : మీ ఆయన పోయిన నెలలో చనిపోయిండు కదా?

రేణుక : అవును సార్‌


ఆర్కే : ఆ తరువాత సర్కారోళ్లు వచ్చారా?

రేణుక : మస్తుగ... ఆ రోజే వచ్చి రాసుకపోయిండ్రు గనీ ఈ మధ్యల ఎవ్వలు రాలేదు సార్‌.


ఆర్కే : నువ్వు కూలి పనికి వెళుతున్నవా?

రేణుక : జాడు పనిచేస్తా సార్‌.


ఆర్కే : జాడు పనిచేస్తే వెయ్యి రూపాయలే వస్తాయి, అదే కూలీకెళ్తే ఎక్కువొస్తాయి కదా?

రేణుక : గ్రామపంచాయతీ తరుపున ఏమన్నా వస్తయని చేస్తున్నా. నేను చేసేది ఇంత కూలీ, ఆమె చేసేది ఇంత పని ఎట్ల బతకాలే అనుకుని మమ్మల్ని ఆగం చేసి పోయిండు.


ఆర్కే : నీ దగ్గర కష్టాలు చెప్పుకునేటోడా?

రేణుక : లేదు సార్‌. నేను ఏడిసినా ఆయన దైర్నంగుండెటోడు. ఎట్లన్న చేసి కట్టుకుందాం అన్నడు నన్ను మోస పుచ్చిండు.


ఆర్కే : పిల్లలను చదివిస్తున్నావా?

రేణుక : చదివిస్తున్న సార్‌ గనీ మీ సాయం గావాలే సార్‌, ప్రభుత్వ సాయం గావాలే.


ఆర్కే : ఎలక్షన్లప్పుడు మీ దగ్గరకు వచ్చినోళ్లను కలవలేదా?

రేణుక : అప్పుడు మస్తుగ వచ్చిండ్రుసార్‌, ఇప్పుడు కింద వడ్డంగ ఎవ్వరొస్తరు.


ఆర్కే : బోర్‌ల నీళ్లు లేవా?

రేణుక : లేవు సార్‌.


ఆర్కే : కరెంటు ఉంటుందా?

రేణుక : కరెంటు ఉంటుంది గనీ నీళ్లు లేవు.


ఆర్కే : ప్రభుత్వం ఆరు లక్షలు ఇస్తే మీ సమస్యలు తీరిపోతాయా?

రేణుక : కొన్ని కొన్నన్నా పోతయి కదా. ఎట్లనన్న బతకగలుగుతం. మాకు అ,ఆలు రావు గనీ పిల్లలను చదివించుకుంటం.


వానొస్తేనే పంట, లేకపోతే లేదు


ఆర్కే : మీ పేరేంటమ్మా ?

తిరుపతమ్మ సారు


ఆర్కే : ఎక్కడ మీది అనంతపురమా?

తిరుపతమ్మ : అవును సారు.


ఆర్కే : మీకు భూమి ఎంతుంది?

తిరుపతమ్మ : మూడెకరాలుంది.


ఆర్కే : ఏం పంట పండిస్తారు?

తిరుపతమ్మ : శనక్కాయలే సారు


ఆర్కే: బోర్లపైనేనా?

తిరుపతమ్మ : లేదు సార్‌, వానొస్తేనే పంట, లేకపోతే లేదు. పెద్ద కూతురు పెండ్లి చేసినంక అప్పయింది. ఆ అప్పు తీర్చనీకి తాండూరుకు పనికిపోయినం. పాలిష్‌ బండ పని. అక్కడి నుంచి మళ్ల ఇంటికి వచ్చేసినం. గుత్తకు చేద్దామని ఎనిమిది ఎకరాలు తీసుకున్నం. దాంట్లో కూడా ఏం రాలేదు. బిడ్డల పెండ్లి చేసిన అప్పు, ఈ అప్పుపెరిగిపోయినయి.


ఆర్కే : అప్పు ఎంతుంటుంది తిరుపతమ్మ

తిరుపతమ్మ : అంతా ఏడున్నర లక్ష ఉంది.


ఆర్కే : బ్యాంకులో?

తిరుపతమ్మ : నలభైఏడు వేలు ఉంది.


ఆర్కే : మాఫీ అయిందా?

తిరుపతమ్మ : అయింది సారు. వడ్డీ ఒక్కటే కట్టినం. మళ్ల బ్యాంకుల డబ్బులు తెచ్చి అప్పు కట్టినం. మళ్ల పంటేయన్నాంటే దుడ్లు కావాలే కదా అని రెండు రూపాయల వడ్డీకి 70 వేలు తెచ్చిండు. ఈ సారి పన్నెండెకరాలల్ల శనక్కాయ వేసినం. వానలు పడకపాయె. పొలంకు పోయి చూసొచ్చిండు. ఎట్ల చేయాలె, ఎట్ల అప్పు కట్టాలే అని బాధపడకుంట కూసుండు. దేవుడున్నాడయ్యా ఎట్లయితే అట్లయితది అన్న.


ఆర్కే : ఎంత మంది పిల్లలు?

తిరుపతమ్మ : ఐదుమంది పిల్లలు.


ఆర్కే : బియ్యం కార్డు ఉందా?

తిరుపతమ్మ : ఉంది సారు.


ఆర్కే : పించను ఉందా.

తిరుపతమ్మ : లేదు సారు.


ఆర్కే : పంట పోయినసారి కూడా పండలేదా? ఈ సారేనా?

తిరుపతమ్మ : పోయినసారి కూడా లేదు సారు. పోయినసారి తల్లీపిల్ల అందరం గుంటూరుకు పత్తితీయడానికి పోయినం. నలభైవేలు తెచ్చినం. అవి మిత్తిలు కట్టడానికే సరిపోయింది.


ఆర్కే : మీ ఆయన చనిపోయి ఎంత కాలం అయింది?

తిరుపతమ్మ : రెండు నెలలయింది.


ఆర్కే : గవర్నమెంటు వాళ్లు రాలేదా?

తిరుపతమ్మ : వచ్చి రాసుకుపోయిండ్రు.


ఆర్కే : మరి ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్లు ఉంటారు కదా. వాళ్లను అడగలేదా?

తిరుపతమ్మ : మా ఊరి మల్లయ్యను అడిగాం. వస్తాయి అంత బేగ రావాల్నంటే ఎట్లా అన్నాడు.


ఆర్కే : పోయిన సారి ఎవరికి ఓటేశావు?

తిరుపతమ్మ : ఐదేండ్ల కింద కాంగ్రెస్‌కు ఏశా.


ఆర్కే : మొన్నటి ఎలక్షన్లలో?

తిరుపతమ్మ : తెలుగుదేశంకు వేశినం.


ఆర్కే : అప్పులోళ్లు ఏమంటున్నారు?

తిరుపతమ్మ : భూమి రాసిస్తావా. అప్పు కడతావా అంటున్నారు.


ఆర్కే : ఇల్లుందా?

తిరుపతమ్మ : ఉంది సార్‌,


ఆర్కే : వ్యవసాయం బాగుండాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటారు?

తిరుపతమ్మ : నీళ్లు కావాలే సార్‌. చెరువులకు నీళ్లిడిస్తే పంటలు పండుతాయి. బతకగలుగుతాం.


ఆర్కే : మీ ఎమ్మెల్యే ఎవరు?

తిరుపతమ్మ : గుంతకల్లు సార్‌. ఆయన పేరు తెలువది.


ఆర్కే : మీకు ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తే సమస్యలు తీరిపోతాయా?

తిరుపతమ్మ : అప్పు తీర్చేసి ఎట్లాగొట్లా బతుకుతాం. నాకు సహాయం చేసే వాళ్లు కూడా ఎవ్వరూ లేరు సార్‌. మా నాయిన చనిపోయిండు. మా అమ్మ నా దగ్గరే ఉంటోంది. నాకు పుట్టింటోళ్లు ఎవరూ లేరు.


చదువు ఆపేసినా సారు...


ఆర్కే : నీ పేరేంటి?

శంకర్‌


ఆర్కే : మీ ఇంట్లో ఎవరు చనిపోయారు?

శంకర్‌ : మా నాన్న.


ఆర్కే : భూమి ఎంతుంది?

శంకర్‌ : ఐదెకరాలుంది.


ఆర్కే : నువ్వు చదువుకుంటున్నావా?

శంకర్‌ : ఆపేసిన సార్‌.


ఆర్కే : పొలంలో ఏం పండుతుంది?

శంకర్‌ : పత్తేసినం. ఐదెకరాలు మాది, ఐదెకరాలు కౌలుకు తీసుకుని ఏశినం. పంట బాగరాలే.


ఆర్కే : పోయిన సంవత్సరం కూడా రాలేదా?

శంకర్‌ : రాలేదు. పోయిన ఏడాది అప్పు మీద పడ్డది. ఈ ఏడాది అప్పు మీద పడ్డది.


ఆర్కే : ఏ ఊరు మీది?

శంకర్‌ : నల్గ్గొండ జిల్లా దూళ్‌పాల. ముగ్గురు అక్కలు. పెద్ద బావ చనిపోతే ఆ అక్క కూడా మాఇంటికాన్నే ఉంటంది. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు. పోయినసారి అప్పు తెచ్చిండు, ఈ సారి అప్పు తెచ్చిండు. అప్పులు పెరిగిపోయినయి. ఇవన్నీ చూడలేక మందుతాగి చనిపోయిండు. పొలం దగ్గర్నే మందు తాగి ఇంటికొచ్చి ఏడుస్తుండు. ఏమైందని మేం అడిగితే ఏంకాలే ఏంకాలే అన్నడు. అప్పటికే వాసనొస్తంది. సర్ఫ్‌నీళ్లు గిట్ట తాపి 108కి ఫోన్‌ చేసినం. నల్గొండకు ఏసుకుని పోతుంటే మధ్యల్నే చనిపోయిండు.


ఆర్కే : ఎప్పుడు చనిపోయారు?

శంకర్‌ : సెప్టెంబర్‌ 30


ఆర్కే : ఇల్లు ఉందా?

శంకర్‌ : ఇల్లు లేదు, గుడిసె ఏసుకుని ఉంటున్నం.


ఆర్కే : ఎంత వడ్డీకి తీసుకున్నారు?

శంకర్‌ : మూడు రూపాయలు


ఆర్కే : అప్పులు ఎంతున్నయి?

శంకర్‌ : ఆరు లక్షల వరకు ఉన్నాయి.


ఆర్కే : బ్యాంకులో?

శంకర్‌ : ఈ సంవత్సరమే తీసుకొచ్చినం.


ఆర్కే: ఐదెకరాలు ఉన్నప్పుడు బ్యాంకులో తీసుకుంటే మాఫీ అన్నా అయ్యేది కదా?

శంకర్‌ : భూమి మా తాత పేరు మీదుంది. మానాయిన పేరుమీదికి కాలే.


ఆర్కే : అప్పులోళ్లు ఏమంటున్నారు?

శంకర్‌ : అడుగుతుండ్రు. ఐదెకరాలు ఉంది కదా అమ్మి తలింత కట్టు అంటుండ్రు. అప్పు తీసుకొచ్చినప్పుడు నన్ను కూడా తీసుకుపోయిండు. నేను కూడా సంతకం పెట్టినా. శనివారం దినాలు. ఆ రోజు పెద్దమనుషులను తీసుకొచ్చి పంచాయితీ పెడతమన్నరు.


ఆర్కే : ఎంత మంది దగ్గర తీసుకున్నారు?

శంకర్‌ : ఐదారుగురి దగ్గర తెచ్చిండు. రెండు బ్యాంకుల ఎనభై, ఎనభై వేలు ఉన్నయి.


ఆర్కే : బ్యాంకులోళ్లు ఇంటికొచ్చారా?

శంకర్‌ : రాలేదు.


ఆర్కే : బియ్యం కార్డు ఉందా.

శంకర్‌ : ఉంది. 12 కిలోలు వస్తయి.


ఆర్కే: పించన్‌ ఉందా?

శంకర్‌ : లేదు.


ఆర్కే : పెద్దకర్మ చేయడానికి డబ్బులున్నాయా?

శంకర్‌ : గవర్నమెంటు నుంచి పదివేలు వస్తాయన్నరు. కాని రాలేదు. ఆ డబ్బులు మేం వచ్చేటట్టు చేస్తమని ఊర్లో లీడర్లు ఉన్న డబ్బులు తీసుకుండ్రు. దినం ఖర్చు మా ఆమ్మోళ్లు పెట్టుకుంటుండ్రు. మా అమ్మ తరుపునోళ్లు అందరు తలింత ఏసుకుని చేస్తుండ్రు.


ఆర్కే : కూలీ పనికి వెళతావా?

శంకర్‌ : ఉప్పర పనికి వెళతాను.


ఆర్కే : ఎంతొస్తుంది?

శంకర్‌ : మూడొందల యాభై ఇస్తరు.


ఇంట్లనే మందు తాగిండు


ఆర్కే : నీ పేరేంటమ్మ?

రాధమ్మ


ఆర్కే: ఏ ఊరు?

రాధమ్మ : మహబూబ్‌నగర్‌ జిల్లా పోతులమడుగు.


మాకు రెండెకరాల భూమి ఉంది. అందులో పత్తి పెట్టినం. బోర్లు వేస్తే పడ్లే. ఫైనాన్స్‌ తెచ్చి ట్రాక్టర్‌ కొన్నడు. పదెకరాలు కౌలుకు తీసి చేసిండు. ఫైనాన్స్‌ డబ్బులు ఎల్లలేదు. పిల్లలను తోలుకుని కూలి పనికిపోయిన. ఆయన గుంటుక కొట్ట పోయి వచ్చిండు. ఇంట్లనే మందు తాగిండు. ఆసుపత్రికి తీసుకపోయినం. తెల్లారి చనిపోయిండు.


ఆర్కే : మీ ఆయన చనిపోయాక గవర్నమెంటు వాళ్లు సహాయం చేయలేదా?

రాధమ్మ : మొన్ననే రెండు తారీఖున చనిపోయిండు.


ఆర్కే : అప్పులోళ్లు ఏమంటున్నారు?

రాధమ్మ : పంచాయతీ ఆఫీసుకు పిలిపించిండ్రు. అప్పు కట్టాలే కదా అన్నరు. మా ఆయన లేకుంటే నన్ను పిలిచిండ్రు. కడతమని చెప్పినం.


ఆర్కే : పిల్లలెంతమంది?

రాధమ్మ : ముగ్గురు. పెద్దమ్మాయి 21 ఏళ్లు. ఇంకా పెళ్లికాలేదు. బాబు చిన్నోడు.


ఆర్కే : అప్పు ఎంత ఉంది?

రాధమ్మ : ఆరు లక్షల వరకు ఉంది.


ఆర్కే : బియ్యం కార్డుందా?

రాధమ్మ : ఉంది సారు.


ముంచేది తెలువది, గడ్డకేసేది తెలువది. ఎట్ల చేసేది తెలువది. మా తలాపుకున్నట్టే ఉన్నడు గనీ మమ్ములను తొంగి చూసే పరిస్థితి లేదు. ఇట్లాంటోళ్లు పోయి ఆగం చేసినా ఆయనకు మేం ఇంకా కనిపిస్తలేం

- రేణుక, పీలపల్లి, మెదక్‌


వానొస్తేనే పంట, లేకపోతే లేదు. పెద్ద కూతురు పెండ్లి చేసినంక అప్పయింది. ఆ అప్పు తీర్చనీకి తాండూరుకు పనికిపోయినం. పాలిష్‌ బండ పని. అక్కడి నుంచి మళ్ల ఇంటికి వచ్చేసినం. గుత్తకు చేద్దామని ఎనిమిది ఎకరాలు తీసుకున్నం. దాంట్ల కూడా ఏం రాలే. బిడ్డల పెండ్లి చేసిన అప్పు, ఈ అప్పుపెరిగిపోయినయి.

- తిరుపతమ్మ, అనంతపురం


గవర్నమెంటు నుంచి పదివేలు వస్తాయన్నరు. కాని రాలేదు. ఆ డబ్బులు మేం వచ్చేటట్టు చేస్తమని ఊర్లో లీడర్లు ఉన్న డబ్బులు తీసుకుండ్రు. దినం ఖర్చు మా ఆమ్మోళ్లు పెట్టుకుంటుండ్రు. మా అమ్మ తరుపునోళ్లు అందరు తలింత ఏసుకుని చేస్తుండ్రు.

- శంకర్‌, దూళ్‌పాల, నల్గ్గొండ


మాది మహబూబ్‌నగర్‌ జిల్లా పోతులమడుగు. మాకు రెండెకరాల భూమి ఉంది. అందులో పత్తి పెట్టినం. బోర్లు వేస్తే పడ్లే. ఫైనాన్స్‌ తెచ్చి ట్రాక్టర్‌ కొన్నడు. పదెకరాలు కౌలుకు తీసి చేసిండు. ఫైనాన్స్‌ డబ్బులు ఎల్లలేదు. పిల్లలను తోలుకుని కూలి పనికిపోయిన. ఆయన గుంటుక కొట్ట పోయి వచ్చిండు. ఇంట్లనే మందు తాగిండు. ఆసుపత్రికి తీసుకపోయినం. తెల్లారి చనిపోయిండు.

- రాధమ్మ, మహబూబ్‌నగర్‌ జిల్లా

 

ఆర్కే : మేం కొంత సాయం చేస్తాం. ప్రభుత్వం నుంచి కూడా మీకు సహాయం అందేందుకు ప్రయత్నం చేస్తాం. అయితే మీరందరూ ధైర్యంగా ఉండాలి. పిల్లలను బాగా చదివించుకోవాలి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.