రూ.70 లక్షల భూమికి 13 లక్షలు ఇస్తామంటారా?

ABN , First Publish Date - 2021-06-15T05:35:53+05:30 IST

తక్కువ పరిహారం ఇవ్వడంపై మూలనత్తం, అనుప్పల్లె రైతుల ఆందోళన

రూ.70 లక్షల భూమికి 13 లక్షలు ఇస్తామంటారా?
అనుప్పల్లె వద్ద ధర్నా చేస్తున్న రైతులు

చిత్తూరు, జూన్‌ 14: బహిరంగ మార్కెట్‌లో రూ. 70 లక్షలు పలుకుతున్న ఎకరా భూమికి కేవలం రూ. 13 లక్షలు ఇస్తామంటారా అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారి పనుల్లో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూములకు చెందిన రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.చిత్తూరు సమీపంలోని అనుప్పల్లె వద్ద పలువురు రైతులు ధర్నా చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు-తచ్చూరు రోడ్డు(ఎన్‌హెచ్‌716బి) నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు తమకేమీ అభ్యంతరం లేదని, అయితే  గతంలో రోడ్డు నిర్మాణాలకు సేకరించిన భూములకు ఎకరాకు రూ. 40 లక్షల వరకు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం రూ. 13 లక్షలే ఎందుకు ఇస్తామంటున్నారని ప్రశ్నించారు. ఇదే రోడ్డుకు నగరి మండలం మూలనత్తంలో భూములిచ్చిన రైతులు కూడా సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం చాలదని, ఎకరా భూమికి రూ. 30 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.ఫ టమోటా, మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి. జనార్దన్‌, ప్రధాన కార్యదర్శి పీఎల్‌ నరసింహులు తదితరులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెరగడం వల్ల వ్యవసాయ ఖర్చులన్నీ పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం స్కేల్‌ ఆప్‌ ఫైనాన్స్‌ను పెంచి రుణసాయం అందేలా చూడాలన్నారు.ఫకరోనా మూడోవేవ్‌ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు కోరారు.  కరోనాతో మృతి  చెందిన వారికి ఆస్పత్రుల్లో ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలని   కోరుతూ సోమవారం కలెక్టర్‌ హరినారాయణన్‌కు, డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీహరికి వినపతిపత్రాలందజేశారు.ఫ కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్‌. నాగరాజన్‌ డిమాండ్‌ చేశారు.  భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సోమవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Updated Date - 2021-06-15T05:35:53+05:30 IST