అన్నదాతకు గుండెకోత

ABN , First Publish Date - 2020-09-27T07:48:57+05:30 IST

ఆరుగాలం కష్టించి వేసిన వరి పంట ఏపుగా ఎదుగుతుంటే కన్నబిడ్డ ఎదుగుదల చూసినట్లే ఆ రైతులు సంబరపడ్డారు. ఆకుపచ్చని వన్నెతో మెరిసిపోతున్న పైరును...

అన్నదాతకు గుండెకోత

పంట పొలాల్లో కన్నీటి వరద

యనమదుర్రు వరదల్లో కుళిన వరి చేలు

నష్టాలు అంచనాలో అధికారులు


గణపవరం, సెప్టెంబరు 26 : ఆరుగాలం కష్టించి వేసిన వరి పంట ఏపుగా ఎదుగుతుంటే కన్నబిడ్డ ఎదుగుదల చూసినట్లే ఆ రైతులు సంబరపడ్డారు. ఆకుపచ్చని వన్నెతో మెరిసిపోతున్న పైరును చూసి ఆనందపడ్డారు. అయితే కళ్లముందే యనమదుర్రు వరద వరి పంటను తుడిచిపెట్టేయడంతో రైతుల కన్నీరు మున్నీరవుతున్నారు. యనమదుర్రు డ్రైన్‌ వరదలతో సార్వా వరి పంట 12 రోజులుగా నీటి ముంపులోనే నాను తున్నాయి. మండలంలో పిప్పర, కేశవరం, ఎస్‌కొందేపాడు, కోమర్రు, మొయ్యేరు, ముప్పర్తిపాడు, వెంకటరాజపురం గ్రామాల్లో వందలాది ఎక రాల్లోని సార్వా పంట నీటి ముంపునకు గురైంది.


ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెట్టగా అదంతా  గంగపాలైందని అన్నదాతలు ఆవేదన చెందు తున్నారు. వరద తగ్గిన మొయ్యేరు, పిప్పరల్లోని చెందిన పెదబాడన, చిన్న బాడవతో పాటు పైగ్రామాల్లోని వరి పైరు కుళ్ళిపోయి పూర్తిగా నష్టపోయా మని రైతులు వాపోతున్నారు.  కేశవరంలోని 70 ఎకరాల పంట నీటి ముంపు నుంచి ఇప్పటికి తేరుకోలేదు. చేపల చెరువులు, మరో యనమదుర్రు డ్రైన్‌ గట్టు వల్ల నీరు స్తంభించిపోయి పైరు పూర్తిగా కుళ్లిపోయిం దని రైతులు విలపిస్తున్నారు. అధికారులు నష్టాల అంచనా వేస్తున్నారు. ఇప్పటికి 400 ఎకరాల్లో వరి చేలు దెబ్బతిన్నాయని, మరో రెండు రోజుల్లో నష్టాల అంచనాలు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.


ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి

ఐదు ఎకరాలు కౌలికి ప్రతీ ఏటా మాదిరిగా ఈ ఏడాది వరి సాగు చేశాను. ఎకరానికి రూ.20 వేలు చొప్పున ఖర్చు చేశాను. పైరు బాగుందన్న దశలో యనమదుర్రు డ్రైన్‌ వరద మా కొంప ముంచింది. గత 12 రోజులుగా నీటిలోనే పైరు నాని కుళ్లి పోయింది. అప్పులు చేసి వడ్డీలకు డబ్బులు తెచ్చి పెట్టిన పెట్టుబడులు నీటిలో కలిసిపోపోయాయి. ప్రభుత్వం వెంటనే ఆదుకోక పోతే మా బతుకులు అదోగతి పాలవక తప్పదు.

- విప్పర్తి ప్రభాకరరావు, కౌలు రైతు, కేశవరం


రెండురోజుల్లో పంట నష్టం నివేదిక

మండలంలోని యనమదుర్రు పరివాహక గ్రామాల్లోని వరి చేలు నీటి ముంపుకు గుర య్యాయి. వ్యవసాయ, రెవెన్యూ బృందాలు ఏర్పాటు చేశాం. ఈ బృందాలు ఐదు రోజులుగా ఆయా గ్రామాల్లో పంటలను పరిశీలించి ఎంత నష్టం వాటిల్లిందనే వివరాలు అందజేస్తారు. శనివారం నాటికి 400 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని అంచనాలు వేశారు. రెండు రోజుల్లో నివేదిక వస్తుంది. 

-వైవీఎస్‌ ప్రసాద్‌, మండల వ్యవసాయ అధికారి, గణపవరం

Updated Date - 2020-09-27T07:48:57+05:30 IST