సాగు రెట్టింపు..

ABN , First Publish Date - 2021-01-25T05:46:46+05:30 IST

సాగు రెట్టింపు..

సాగు రెట్టింపు..
వరినాట్లు వేస్తున్న మహిళలు

  • గతంకన్నా యాసంగిలో పెరగనున్న సాగు విస్తీర్ణం
  • భారీ వర్షాలతో చెరువులు, కుంటల్లో జలకళ
  • గణనీయంగా పెరిగిన భూగర్భ జలమట్టం
  • బీడు భూములు సైతం సాగులోకి..

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో యాసంగిలో రెట్టింపు స్థాయిలో సాగువిస్తీర్ణం పెరిగింది.   15 ఏళ్లుగా కరువును ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో ఈసారి  భారీగా వర్షాలు  కురవడంతో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. బోరుబావుల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వరిని ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వరినాట్లు వేశారు. ఈ ప్రాంతంలో యాసంగిలో కూరగాయల సాగును ఎక్కువగా ప్రోత్సహించాలనేది ప్రభుత్వ నిర్ణయంకాగా అధికార యంత్రాంగం ఆ దిశగా కృషి చేస్తోంది. గత యాసంగిలో డివిజన్‌లో వరి 7,754 ఎకరాలు సాగవగా, ఈ ఏడాది సుమారుగా 14 వేల ఎకరాల్లో వరి సాగుకావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అలాగే గతంలో కూరగాయలసాగు 6,201 ఎకరాలు కాగా, 8వేల ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా. అలాగే ఇతర పంటలు గతంలో 1,088 ఎకరాలు కాగా ఈ ఏడాది 1,200 ఎకరాల విస్తీర్ణంలో సాగు కానున్నట్లు అంచనాగా ఉంది. మొత్తానికి ఏళ్ల తరబడి పడావుగా ఉన్న భూములను చదునుచేసి సాగు చేస్తున్నారు. ఇటీవలి వరకు చుక్కనీరులేని వ్యవసాయ బావులు పలుచోట్ల కోలఎల్తున్నాయి. ఒంపుసాలు భూములు జాలువారుతుండడంతో అదే నీటితో సాగవుతోంది. పల్లెల్లో ఎక్కడచూసినా పచ్చని పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. 


సస్యరక్షణ చర్యలు 

వ్యవసాయాధికారి సందీ్‌పకుమార్‌ 

యాచారం : వరి నాట్లు వేసే సమయంలో తగన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి సందీ్‌పకుమార్‌ తెలిపారు. నాలుగు ఆకులున్న మొక్కను నాటుకోవాలన్నారు. భూసారాన్ని అనుసరించి చదరపు మీటర్‌కు 44 మొక్కలు నాటుకోవాలన్నారు.  ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ కాలిబాట ఉండేట్లు చూడాలన్నారు. ముదురు నారునాటు సమయంలో మొక్కల మధ్య సంఖ్యను పెంచుకోవాలన్నారు. వరి నాట్లు వేసే రైతులు పొలంలో ముందుగా  పచ్చిరొట్ట, అపరాలు, జీలుగ, పిల్లిపెసర లాంటి పైర్లను వేసుకోవాలని కోరారు. పైరును బాగా కలియదున్నుకోవాలన్నారు. భూసారం పెరగడం కోసం 20 నుంచి 25 శాతం నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఆదా అవుతుందన్నారు. పొలంలో కోడిఎరువు, పశువుల ఎరువు వాడితే 25శాతం నత్రజని పెరుగుతుందని పేర్కొన్నారు. 


సమగ్రపోషక  యాజమాన్యం

భూసార పరిరక్షణకు ఉత్పత్తిని పెంచుకోవడం కోసం రసాయన  ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వాడుకోవాలన్నారు. కోళ్ల ఎరువు, కంపోస్టు ఎరువు రసాయన ఎరువులతో కలిపి వాడితే పంటకు మేలు కలుగుతుందన్నారు. నీలిపచ్చనారు, అజోల్లా,  ఆజోస్వైరిల్లమ్‌, పోసోఎబాక్లీరియా వాడితే పొలంలో నత్రజని, భాస్వరం 10 నుంచి 20శాతం పెరుగుతుందన్నారు. 

Updated Date - 2021-01-25T05:46:46+05:30 IST