Abn logo
Sep 22 2021 @ 23:29PM

పాడిని నమ్ముకుంటే రైతులకు లాభం

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 

జమ్మికుంట, సెప్టెంబరు 22: రాష్ట్రంలో పాల ఉత్పత్తి తక్కువగా ఉందని, రైతులు పాడిని నమ్ముకుంటే లాభం చేకూరుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం జమ్మికుంట దుబ్బ మల్లికార్జున స్వా మి ఆలయ సమీపంలో విజయ డెయురీ మినీ పాల శీతలీకరణ కేంద్రం నిర్మాణా నికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రంలో పాడి రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెలంగాణకు పాలు వస్తున్నాయన్నారు.  పాడి రైతులను ప్రోత్సహించడానికే రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ, లీటర్‌ పాలకు ఐదు రూపాయల ఇన్సెంటివ్‌ ఇస్తోందన్నారు. జమ్మికుంటకు 30 లక్షలతో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. 2014కంటే ముందు పాడి పశువులకు నీళ్లు పెట్టాలంటే కూడా వ్యవసాయ బావుల వద్ద కరెంట్‌ ఉండేది కాదన్నారు. దొంగ రాత్రి కరెంట్‌ కోసం చూసి పశువులకు నీళ్లు పెట్టే దుస్థితి ఉండేదని గుర్తు చేశా రు. ఇప్పుడు 24 గంటల కరెంట్‌ ఉంటుందని, ఎప్పుడు స్టార్టర్‌ నొక్కినా పుష్కలంగా నీళ్లు వస్తున్నాయన్నారు. అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని, సొంత స్థలాలు ఉన్న వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. మందు సీసాలు, బొట్టు బిళ్లలు, గ్రైండర్లు, గోడ గడియారాలు పంచే వాళ్లను చూసి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, డీసీఎమ్‌ఎస్‌ వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌, జడ్పీటీసీ శ్రీరామ్‌ శ్యామ్‌, రాష్ట్ర నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. 

రంది పడకండి సార్‌.. కారుకే ఓటేస్తాం

జమ్మికుంట రూరల్‌: రంది పడకండి సార్‌.. అందరం కారు గుర్తుకే ఓటు వేస్తాం అని మహిళలు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు హామీ ఇచ్చారు. బుధవరాం మంత్రి హరీష్‌రావు జమ్మికుంట ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రానికి వెళుతుండగా రోడ్డుపై ఉన్న మహిళలతో మాట్లాడారు. మీరు టీఆర్‌ ఎస్‌కు ఓటు వేస్తారని నాకు తెలుసు కాని.. మరో పది మందికి మీరు చెప్పాలి. సహాయం చేసిన చెయ్యిని ఓడగొట్టుకోవద్దు అని మంత్రి అన్నారు. దీనికి మహిళలు సార్‌ మేం మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పారు.