రైతులకు కుచ్చుటోపీ

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

సహకార సంఘంలో డిపాజిట్‌దారుల సొమ్ముకు భరోసా ఇవ్వాల్సిన అధికారులు రాబందులయ్యారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా

రైతులకు కుచ్చుటోపీ

బ్రాహ్మణపల్లి సొసైటీలో నకిలీ బాండ్‌పేపర్ల వ్యవహారం

రికార్డుల్లో నమోదు చేయకుండా రూ. లక్షలు స్వాహా

డిపాజిట్‌దారులు నిలదీయంతో సుమారు రూ. 15లక్షల రికవరీ

సీఈవో ,కంప్యూటర్‌ ఆపరేటర్‌ సూత్రధారులు

డీసీసీబీ మేనేజర్‌ విచారణతో వెలుగులోకి వాస్తవాలు


బోనకల్‌, సెప్టెంబరు 18: సహకార సంఘంలో డిపాజిట్‌దారుల సొమ్ముకు భరోసా ఇవ్వాల్సిన అధికారులు రాబందులయ్యారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రూ. లక్షలు దిగమింగారు. నకిలీ బాండ్‌పేపర్లతో కుచ్చుటోపీ పెట్టారు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనకు బోనకల్‌ మండలం బ్రాహ్మణపల్లి సొసైటీ వేదికైంది. తమ డబ్బులు గల్లంతైన విషయంపై రైతులు ఆందోళన నిర్వహించారు. డీసీసీబీ మేనేజర్‌ మధులిక సొసైటీని సందర్శించి విచారణ నిర్వంహించగా విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి. 


నకిలీ బాండ్‌ పేపర్లు

సొసైటీలో బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు చెందిన 800 మంది రైతులకు సభ్యత్వం ఉండగా, రూ.3.65 కోట్ల టర్నోవర్‌తో నడుస్తోంది. ఆ కార్యాలయంలో పనిచేసే ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌, సీఈవో రైతుల డిపాజిట్లపై కన్నేశారు. డబ్బులు జమచేసిన రైతుల్లో చాలా మందికి సంతకాలు లేకుండా, నకిలీ బాండ్లను జారీచేశారు. వివరాలను రికార్డుల్లో నమోదు చేయలేదు. ఈ తతంగం   కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది. సీఈవో నిర్లక్ష్యం వహించడంతో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల క్రితం పూర్తి కావాల్సిన ఆడిట్‌ కూడా ఆలస్యమయింది. బ్యాంకు అధికారులకు తక్కువగా కనిపించిన రూ.3.59 లక్షలను సీఈవో నుంచి రికవరీ చేశారు.


రెండేళ్లుగా రైతులు నిలదీస్తుండటంతో సీఈవో, కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాదాపు రూ.15 లక్షలను రైతులకు రికవరీ చేశారు. ఇంకా లక్షలాది రూపాయల సొమ్ము రైతులకు ఇవ్వాల్సి ఉండటంతో బాధితులు సొసైటీ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. యాదాల అన్నమ్మ 2.40లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయగా రికార్డులో నమోదు చేయలేదు. గుజ్జు కోటమ్మ, దాసు, అర్లప్ప, కోటమ్మ, లలితమ్మ, చారి, కృష్ణయ్య, రఘపతి, సుబ్బమ్మ తదితర రైతులు తమకు బాండ్లు ఇచ్చినా వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


డిపాజిట్ల విషయమే తెలియదట !

డీసీసీబీ మేనేజర్‌ విచారణలో ప్రధానంగా నిబంధనలు పాటించకుండా రైతుల నుంచి సొమ్ము తీసుకొని, వాటికి నకిలీ బాండ్‌ పత్రాలను ఇచ్చినట్లు తేలింది. అసలు రైతులు డిపాజిట్లు చేసిన సంగతి తనకు తెలియదని సీఈవో చెప్పడం విస్మయాన్ని కలిగిస్తోంది. కొన్ని పత్రాలపై తన సంతకాలు లేకుండా కంప్యూటర్‌ ఆపరేటర్‌ మాత్రమే సంతకం పెట్టి ఇచ్చారని, మరికొన్నింటిపై ఉన్న సంతకాలు తనవి కావని తెలిపారు. కోర్టువివాదం వల్ల గత ఏడాది వరకు ఈ సొసైటీ సీఈవోల పాలనలోనే ఉంది. పాలకవర్గంలేనందు వలనే ఇలాంటి అక్రమాలు జరిగాయని బాధ్యులపై చర్యలు తీసుకొని రైతుల సొమ్ముకు భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST