రైతుకోసం తెలుగుదేశం.. ఉద్రిక్తం

ABN , First Publish Date - 2021-09-17T06:35:49+05:30 IST

రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని కడియంలో గురువారం ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో రైతుకోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.

రైతుకోసం తెలుగుదేశం.. ఉద్రిక్తం
కడియం తహశీల్దారు కార్యాలయం వద్ద పోలీసులతో టీడీపీ శ్రేణుల వాగ్వాదం

కడియం, సెప్టెంబరు 16: రాజమహేంద్రవరం రూరల్‌  నియోజకవర్గంలోని కడియంలో గురువారం ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో రైతుకోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్లతో పాటు, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, రూరల్‌ కడియం మండలాల టీడీపీ శ్రేణులను, పార్టీ నేత లను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును తప్పుపడుతూ ఎమ్మెల్యే గోరంట్ల ప్రభుత్వంపైనా, పోలీసులపైనా విరుచుకుపడ్డారు. దగాకోరు అధికార పార్టీ చేతుల్లో పోలీసులు కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారన్నారు.  రైతుల కోసం, వారి హక్కుల కోసం పోరాడుతుంటే తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. తొలుత కడియం వెలుగుబంటి ప్రసాద్‌ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ కేడర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత రాజమహేంద్రవరం సిటీ నుంచి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల కేడర్‌తో కలిసి ట్రాక్టర్లతో, మోటారుసైకిళ్లతో ర్యాలీగా కడియం రాగా గ్రామం మొదట్లోనే పోలీసులు నిలిపివేశారు. రాజమహేంద్రవరం దక్షిణమండల డీఎస్పీ ఎం.శ్రీలత ఆధ్వర్యంలో కడియం, ధవళేశ్వరం సీఐలు కె శ్రీధర్‌కుమార్‌, అడబాల శ్రీను, పోలీసు సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఎమ్మెల్యే గోరంట్లను, మాజీ మంత్రి జవహర్‌ను అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, టీడీపీ కేడర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. కేడర్‌ నినాదాలు చేస్తూ తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు జి.భీమారావుకు వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - 2021-09-17T06:35:49+05:30 IST