సాగుపై రైతన్న ‘వర్రీ’

ABN , First Publish Date - 2022-07-04T05:59:59+05:30 IST

తరతరాలుగా వ్యవసాయం నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతన్నకు సాగు భారంగా మారింది. విధిలేని పరిస్థితుల్లో హలం విడిచి పొలం దున్ని జీవన విధానానికి ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూడాల్సిన దుస్థితి కనిపిస్తోంది. జిల్లాలో వరి పంట వర్షాధారంగా రైతాంగం సాగు చేస్తోంది. 1874 చెరువులు, 14,673 బోర్లు, 40 వేల ఫిల్టర్ల కింద ఉమ్మడి జిల్లాల్లో రైతాంగం వరి సాగు చేస్తున్నారు.

సాగుపై రైతన్న ‘వర్రీ’
ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధమవుతున్న రైతన్న

క్రాప్‌ హాల్‌డేకు సిద్ధమవుతున్న రైతన్నలు 

గిట్టుబాటుకాని సాగు 

బీళ్లుగా మారుతున్న పొలాలు

రాజుపాళెం, జూలై 3: తరతరాలుగా వ్యవసాయం నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతన్నకు సాగు భారంగా మారింది. విధిలేని పరిస్థితుల్లో హలం విడిచి పొలం దున్ని జీవన విధానానికి ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూడాల్సిన దుస్థితి కనిపిస్తోంది. జిల్లాలో వరి పంట వర్షాధారంగా రైతాంగం సాగు చేస్తోంది. 1874 చెరువులు, 14,673 బోర్లు, 40 వేల ఫిల్టర్ల కింద ఉమ్మడి జిల్లాల్లో రైతాంగం వరి సాగు చేస్తున్నారు. క్రమేపి కరవు కాటకాలు, సకాలంలో ప్రకృతి సహకరించకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వం సహకారం కొరవడటంతో క్రమంగా వరి పంట సాగు సన్నగిల్లుతోంది. 


క్రాప్‌ హాలిడేకు సన్నద్ధం

ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు సన్నద్ధం కావాల్సిన రైతన్నలు వరి సాగుకు వెనుకడుగు వేస్తూ క్రాప్‌ హాలిడేకు సన్నద్ధమవుతున్నారు. ఎరువుల ధరలు ఎప్పటికప్పుడు పెరగడం, పంట దిగుబడి తగినంత రాకపోవడంతోపాటు సరైన గిట్టుబాటు ధర లేక నష్టాలు వస్తుండటంతో రైతులు వరి సాగుపై ఆసక్తి కనబరచడం లేదు. ఈ క్రమంలో సాయం అందించాల్సిన ప్రభుత్వం కూడా ఆశించిన స్థాయిలో ఆదుకోవడం లేదం టూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజుపాళెం మండలంలో కుందూ నది, చాపాడు కెనాల్‌ కింద గతంలో ఆరు వేల ఎకరాలు పైబడి పంట సాగు చేస్తున్న రైతన్నలు నేడు వరిపై ఆసక్తి చూపడం లేదు. ఒక్క తొండలదిన్నె గ్రామంలోనే 1500 ఎకరాలు ప్రధాన పంటగా వరి సాగు చేసేవారు. అయితే ఎకరాకు ఎకరాకు రూ.40 వేలు ఖర్చులు వస్తుండడం.. 12 నుంచి 15 బస్తాలకు దిగుబడి పడిపోవడంతో  సగం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు పంట పొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో కొంతమేర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. మిగతా భూములను బీళ్లుగానే వదిలేస్తున్నారు. కౌలు రైతు కూడా రెండు బస్తాలకు కౌలుకిస్తామన్నా ముందుకు రావడం లేదని ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలూరు, దద్దనాల, టంగుటూరు, వెలువలి గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. వేలాది ఎకరాలు సాగు చేస్తున్న రైతన్నలు వంద ల ఎకరాల్లో వరి సాగు చేయడానికి ఆసక్తి కనబరచడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఏది ఏమైనా వరి సాగు చేస్తే మాకు ఉరి  వేసుకోవడం తప్ప గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వరికి గిట్టుబాటు ధర లేదు 

- చెమికల కొండారెడ్డి,  రైతు, తొండలదిన్నె

గత పది సంవత్సరాల నుంచి నా సొంత పొలం 40 ఎకరాల్లో వరి పండిస్తున్నా. గత ఏడాది పండించిన పంట పూర్తిగా దెబ్బతిని నష్టం వాటిల్లింది. వరి సాగు చేసినా దిగుబడి రావడం లేదు. ఒకవేళ పంట పండినా ధరల్లేక గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. దీంతో కొంత పొలాన్ని బీడుగా వదిలి.. మరికొంత పొలాన్ని ప్రత్యామ్నాయ పంటలు అయిన మినుము, జొన్న సాగు చేస్తున్నా. 


పెట్టుబడి కూడా రాలేదు 

- మహమ్మద్‌ హుస్సేన్‌, రైతు, వెలువలి

గత ఏడాది 12 ఎకరాలు వరి సాగు చేస్తే పెట్టుబడి కూడా రాలేదు. ఈ ఏడాది మినుము, పత్తి, జొన్న పైర్లు వేసేందుకు సిద్ధమవుతున్నా. వరి పంటకు సరైన గిట్టుబాటు ధర వచ్చేంతవరకు సాగు చేసే ప్రసక్తి లేదు. పొలాన్ని బీడుగానైనా పెడతా కానీ వరి మాత్రం సాగు చేయను. 

Updated Date - 2022-07-04T05:59:59+05:30 IST