తప్పు చేయలేదన్నా వినలేదు

ABN , First Publish Date - 2020-05-26T08:53:41+05:30 IST

‘ఇప్పటికి పెద్దల్లో కాని చిన్నల్లోకాని తప్పు చేసినట్లు నిరూపించిందిలేదు..

తప్పు చేయలేదన్నా వినలేదు

చోరీ కేసు ఒప్పించడానికి బలవంతం

9 రోజులుగా పోలీస్‌స్టేషన్‌ చూట్టూ తిప్పారు

సూసైడ్‌ లేఖ రాసి భార్య, కుమార్తెతో కలిసి రైతు కూలీ ఆత్మహత్య

  

బాపట్ల(గుంటూరు): ‘ఇప్పటికి పెద్దల్లో కాని చిన్నల్లోకాని తప్పు చేసినట్లు నిరూపించిందిలేదు. మోటార్లు పోయాయని చెయ్యని తప్పుకి నామీద కేసు పెట్టారు. 9 రోజులుగా పోలీస్‌స్టేషన్‌ చూట్టూ తిరుగుతున్నాను. ఎవరైనా నేను మోటార్లు తేవటం చూసి గాని.. నేను తీయడం చూసి గాని ఎవరైనా ఉంటే శిక్షకు అర్హుడ్ని. ఎంత చెప్పినా వినిపించుకోలేదు..’ అంటూ ఓ రైతు కూలీ భార్య, కుమార్తెతో కలిసి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయ విదారకర ఘటన బాపట్ల మండల పరిధిలోని మరుప్రోలువారిపాలెంలో సోమవారం కలకలం సృష్టించింది. గ్రామంలో కూరగాయ పంటలను మరుప్రోలు వీరాస్వామిరెడ్డి(41) సాగు చేస్తుండేవాడు. అయితే ఇటీవల గ్రామంలో కూరగాయల తోటల్లో ఉపయోగించే మోటర్లు చోరీకి గురయ్యాయి. వీటిని వీరాస్వామిరెడ్డి అపహరించాడని గ్రామానికి చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత ఆదివారం నుంచి ఈ కేసులకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి అతడ్ని స్టేషన్‌కు పిలుస్తున్నారు.


అయితే తనకు మోటర్ల చోరీకి ఎటువంటి సంబంధం లేదని అటు పోలీసులకు, ఇటు గ్రామస్థులకు చెప్తున్నా ఎవరూ పట్టించుకోలేదని.. తన కుటుంబానికి తీరని మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ సోమవారం భార్య వెంకటరమణ(38) కుమార్తె పోలేరమ్మ(8)లతో కలిసి వీరాస్వామిరెడ్డి పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి ఏరియా వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి వెంకటరమణ, పోలేరమ్మలు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కొనఊపిరితో ఉన్న వీరాస్వామిరెడ్డిని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ క్రమంలో అతడు రాసిన సూసైడ్‌ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ లేఖలో తాను పడిన మానసిక క్షోభ గురించి వివరించాడు. చెయ్యని తప్పుకి తనను మంచాల పోలిరెడ్డి, మంచాల నాగరాజు, పిట్టు శ్రీనివాసరెడ్డి, కోకి వెంకటేశ్వర్లరెడ్డి, తమ్ముడి కొడుకు రఘు రామిరెడ్డి, పిట్టు శ్రీనివాసరెడ్డి, తండ్రి లేటు పిట్టు కృష్ణారెడ్డి, మున్న పెద్ద వెంకటేశ్లర్ల కొడుకు కొండలురెడ్డి కావూరి పెదకోటయ్య కొడుకు శ్రీనివాసరెడ్డిలు కేసు పెట్టారని తెలిపారు. ‘కానిస్టేబుల్‌ శ్రీనివాసు తాను చెయ్యని తప్పును ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడని వాపోయారు. ఇది ఎంత వరకు న్యాయం.. దయచేసి మాకు మా కుటుంబాలకి న్యాయం చేయ్యమని పదేపదే వేడుకుంటున్నాను..’ అంటూ లేఖలో కోరారు.  


ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవాలి : వేగేశన 

భార్య, బిడ్డతో కలిసి మరుప్రోలు వీరాస్వామిరెడ్డి ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన వీరాస్వామిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం స్థానిక వేగేశన ఫౌండేషన్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పోలీసులతోపాటు వైసీపీ నాయకులు బెదిరించటం వల్లే  కుటుంబం ప్రాణాలు తీసుకుందని ఆరోపించారు. 


ఎఫ్‌ఐఆర్‌ లేకుండా విచారణ పేరుతో వేధించటం దారుణమన్నారు. మోటర్లు దొంగతనం చేసినట్లు నిందితులను గుర్తించి మోటర్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పే పోలీసులు కోర్టులో ఎందుకు హాజరు పర్చలేదని ప్రశ్నించారు. దీనిలో మరుప్రోలువారిపాలెం గ్రామపెద్దలతో పాటు వైసీపీ మండల నాయకుడి పాత్ర ఏ మేరకు ఉందో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. దొంగతనం చేశాడు కాబట్టి గ్రామంలో పరువుపోతుందని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనడం కేసును తప్పుదోవ పట్టించటమేనన్నారు.  

Updated Date - 2020-05-26T08:53:41+05:30 IST