రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-06-06T10:01:58+05:30 IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పష్టం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి

తోటపల్లి కుడి కాలువ ద్వారా నీరు విడుదల


గరుగుబిల్లి, జూన్‌ 5 :  రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. శుక్రవారం తోటపల్లి ప్రాజెక్టు ప్రధాన కుడి కాలువ ద్వారా ఖరీఫ్‌నకు సాగునీరును మంత్రి విడుదల చేశారు. మంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్నారు. వారి కళ్లల్లో ఆనందం నింపేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. విత్తనాల సరఫరా నుంచి పంటల కొనుగోలు వరకూ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అందులో భాగమేనని ఆమె తెలిపారు. ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులను రైతులకు అందుబాటులోకి తేవడంతో పాటు సాగు సలహాలు అందించేందుకు అధికారులు ఈ కేంద్రాల్లో ఉంటారని చెప్పారు.


తోటపల్లి ప్రాజెక్టు ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1.99 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు తెలిపారు. తోటపల్లి ఎడమ కాలువ ద్వారా 64 వేల ఎకరాలకు, కుడి కాలువ ద్వారా 1.35 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నట్టు వివరించారు. ఖరీఫ్‌ అవసరాలకుగాను ముందస్తుగానే నీటిని విడిచిపెట్టామన్నారు.  శివారు ఆయకట్టుకు సైతం సాగునీరు అందిస్తామని వివరించారు. రూ.114 కోట్లతో తోటపల్లి ఆధునీకరణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయన్నారు.


మిగిలిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడతామని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, అరకు పార్లమెంటరీ వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు ఎస్‌ఈ కె.పోలేశ్వరరావు, ఈఈ డి.లక్ష్మీనరసింహం, డీఈఈలు బి.శ్రీహరి, డి.వేణుగోపాలనాయుడు, తహసీల్దార్‌ వీవీ సన్యాశిశర్మ, ఎంపీడీవో జి.గిరిబాల, ప్రాజెక్టు జేఈలు కె.శ్రీనివాసరావు, మధుసూదనరావు, రాకేష్‌, పార్వతీపురం సీఐ దాశరఽథి, ఎస్‌ఐ వై.సింహాచలం పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T10:01:58+05:30 IST