Abn logo
Jun 3 2020 @ 04:19AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం

సీఎం ఆలోచనలకు ప్రతిరూపాలే రైతు బంధు, రైతు బీమా

చరితల్రో లిఖించదగిన పథకాలను అమలు చేస్తున్నాం

ఉద్యమ నాయకుడు సీఎంగా ఉండటం గర్వకారణం

పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి/ మెదక్‌/ మెదక్‌ రూరల్‌, జూన్‌ 2: వినూత్న పథకాలతో ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్‌ తెలంగాణ చరిత్రలో గాంధీ, నెహ్రూ, సుభా్‌షచంద్రబో్‌సలా నిలిచిపోతారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం ఆయన మెదక్‌ కలెక్టరేట్‌లో తెలంగాణ ఆవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతీ రైతును లక్షాధికారిని చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పథకాలకు శ్రీకారం చుడుతున్నారన్నారు. గ్రామాలు, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో సీఎం ఉన్నారన్నారు. సబ్బండ వర్గాలవారికి అడగకుండానే అన్నీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.


తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు అనుసరించడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే మోడల్‌లా నిలుస్తున్నాయన్నారు. గతంలో పరిపాలన చేతకాక ప్రగల్భాలతో కాలం గడిపినవారు ఇప్పుడు తమ ప్రభుత్వం చేపడుతున్న పనులను చూసి నివ్వెరపోతున్నారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కరెంటు, నీళ్లు రావని చెప్పారని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం 24 గంటల కరెంటు సరఫరా చేయడంతో పాటు రైతులకు కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నామని స్పష్టం చేశారు.  కరోనా వల్ల ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా రైతులకు రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు అందించి వారికి ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు రాకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.


దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పంట దిగుబడి వచ్చిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 12వేల కోట్ల రుణ మాఫీతో 53 వేల మంది రైతులకు మేలు జరిగిందన్నారు. ప్రతిపక్ష నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వారంతా కొండపొచమ్మసాగర్‌ను చూసి వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. మెదక్‌ జిల్లా, మెదక్‌ నియోజకవర్గానికి నెల రోజుల్లో నీళ్లు వస్తాయని వివరించారు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసమే ఆయన నిరంతరం ఆలోచిస్తారని అన్నారు. ఆరేళ్ల పాలనలో ఈ విషయం ఎన్నోసార్లు రుజువైందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఆలయాల గురించి పట్టించుకోలేదని, కానీ సీఎం కేసీఆర్‌ యాదాద్రి పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడంతో పాటు భద్రాచలం, వేములవాగను కూడా అభివృద్ధి చేస్తున్నారన్నారు.


సమావేశంలో  జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలశేఖర్‌గౌడ్‌, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి,  మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి,  అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, ఎస్పీ చందనా దీప్తి, ఏఎస్పీ నాగరాజు, గ్రంథాలయ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, ఇఫ్కోడైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement