ప్రకటనల్లోనే రైతు సంక్షేమం!

ABN , First Publish Date - 2021-10-09T06:22:43+05:30 IST

చీడ,పీడలు గాయపరిచినా, తుఫానులు వణికించినా, అకాల వర్షాలు కన్నీటి మడుగులై కలవరపరిచినా, దళారీలు మిడతల దండై దాడి చేసినా దేశానికి ఇంత ముద్ద అన్నం పెట్టేది అన్నదాతే...

ప్రకటనల్లోనే రైతు సంక్షేమం!

చీడ,పీడలు గాయపరిచినా, తుఫానులు వణికించినా, అకాల వర్షాలు కన్నీటి మడుగులై కలవరపరిచినా, దళారీలు మిడతల దండై దాడి చేసినా దేశానికి ఇంత ముద్ద అన్నం పెట్టేది అన్నదాతే. అటువంటి అన్నదాత అప్పులు ఊబిలో కూరుకుపోయి దిక్కులు చూస్తున్నాడు నేడు. దశాబ్దాల నుంచి వ్యవసాయం చేస్తున్నా అప్పు చేస్తే తప్ప సొంతంగా పెట్టుబడి పెట్టుకోలేని పరిస్థితిలో 90 శాతంపైగా రైతులున్నారు. రైతుల కడగండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం తూతూ.. మంత్ర చర్యలతో సరిపుచ్చడంతో కర్షకుల బతుకులకు చితి పేర్చే దురావస్థ దాపురించింది. విత్తనం వేసిన దగ్గర నుంచి ఉత్పత్తులు మార్కెట్‌లో అమ్ముకునేదాకా ప్రతి దశలోనూ రైతులను చెయ్యి పట్టినడిపిస్తానని నమ్మబలికి 2019లో అధికారంలోకి వచ్చినజగన్ జమానా రెండున్నరేళ్లలో రైతులకు చేసిన సాయం కంటే చేసిన ఘనమోసాలే ఎక్కువని చెప్పాలి. అంకెలగారడీలతో, అబద్ధాలతో రైతులను దారుణంగా దగా చేస్తున్నారు. వ్యవసాయ పురోభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోకుండా నిస్సిగ్గుగా రైతులను వంచన చేశారు. జగన్ అమలు చేస్తున్న పథకాలు రైతులను మభ్యపెట్టడానికే తప్ప ఆదుకోవటానికి కాదు. 


రాష్ట్రప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రైతుభరోసా పథకం కార్యాచరణలో పూర్తిగా చతికిలపడింది. రాష్ట్రంలో మొత్తం 79,50,844 మంది రైతు ఖాతాలు ఉండగా, 45 లక్షల మందినే రైతుభరోసాకు అర్హులుగా చూపించారు. రైతుభరోసా కింద మొత్తం రాష్ట్రప్రభుత్వం నిధుల నుంచే రూ.12,500 ఒకేసారి మే నెలలో ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. దీనికి కేంద్రం ఇస్తానన్న రూ.6000 కలిపి రూ.18,500 రైతుకి ఇవ్వాలి. కానీ కేంద్రం ఇచ్చే రూ.6000లకు రాష్ట్రప్రభుత్వం రూ.7,500 కలిపి రూ.13,500 ఇస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చే రూ.7,500 కూడా మూడు విడతల్లో విదిలిస్తూ రైతులను ఉద్ధరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం ‘భరోసా’ భారాన్ని వీలున్నంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేసింది. అనేక చిక్కుముడులతో లబ్ధిదారుల సంఖ్యను కుదించింది. 15లక్షల మంది కౌలురైతులకు రైతుభరోసా అమలుచేస్తామని చివరకు 1.40లక్షల మందికి ఇచ్చారు. ఏ రైతు పేరు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ రైతుకే జగన్ ఉరి బిగిస్తున్నారు.


పంట వేసిన రైతుల గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధి పేరుతో రూ.3000కోట్లు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవడానికి రూ.4000కోట్లు కేటాయిస్తానని జగన్ మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు వాటి ప్రస్తావనే లేదు. ఎన్నికల ముందు సుబాబుల్‌, జామాయిల్, సర్వి రైతులను ఆదుకుంటామని, టన్నుకు రూ.5,000 వేలు ధర పెంచుతామని హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయినా ఇవేమీ నెరవేరలేదు. కేంద్రం ఇచ్చే అప్పుల్లో రెండు శాతం అదనం కోసం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తును ఎత్తివేసేందుకు జీఓ నెంబర్‌ 22 తీసుకొచ్చి రైతుల మెడకు ఉరి బిగించారు. రెండున్నరేళ్లలో 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో నిలిచింది. కౌలురైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. 


వ్యవసాయరంగం పూర్తిగా యంత్రీకరణపై ఆధార పడి ఉంది. గత ప్రభుత్వం సాగులో సమూల మార్పులు చేయాలని పెద్దఎత్తున యంత్రీకరణకు శ్రీకారం చుట్టారు. రైతురథం పథకం ద్వారా 17,949 టాక్టర్లను, వ్యవసాయ పరికరాలు గోర్రు, నాగలి, రోటోవేటర్ తదితర వ్యవసాయ పరికరాలను అందించింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక రైతురథం పథకానికి, యంత్రీకరణకు మంగళం పాడారు. గత ప్రభుత్వం హయాంలో 35 వేల వ్యవసాయ బోర్లు వేయించి వాటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేశారు. జగన్ ఆర్భాటంగా ప్రారంభించిన వైఎస్సార్ జలకళను అటకెక్కించారు. గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు 90శాతం రాయితీ, ఎస్సీ ఎస్టీ రైతులకు 100శాతం రాయితీ అందించారు. జగన్ ఈ డ్రిప్ ఇరిగేషన్‌ను పూర్తిగా రద్దు చేశారు. ఉచితంగా అందించే సూక్ష్మపోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఎరువుల పంపిణీని సైతం నిలిపేశారు. గత ప్రభుత్వం 58.29లక్షల మంది రైతులకు రూ.15,279 కోట్లు ఋణమాఫీ చేసి ఆదుకుంది. జగన్ అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం చెల్లించాల్సిన, 4–5 విడతల రైతు ఋణమాఫీ పథకాన్ని రద్దు చేశారు. గత ప్రభుత్వం హయాంలో పంట నష్టపోయిన వరి రైతులకు హెక్టారుకి రూ.20 వేల ఇన్‍పుట్ సబ్సిడీ చెల్లించగా, జగన్ ప్రభుత్వం దాన్ని రూ.15 వేలకు తగ్గించింది. గత ఏడాది వరుస తుఫానులతో 37 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే కేవలం 11 లక్షల ఎకరాలకే ఇన్‍పుట్ సబ్సిడీ అందించారు. పంటలకు గిట్టుబాటు ధర, సున్నా వడ్డీకి ఋణాలు, పంటల బీమా, ఇన్‍పుట్ సబ్సిడీ వంటి పథకాల అమలులో చిత్తశుద్ధి లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు దాదాపు రూ.22వేల కోట్లు నష్టపోయారు. అంటే ఒక్కొక్క రైతు రూ.1.80 లక్షలు కోల్పోయారు. 


అన్నపూర్ణగా పేరొందిన ఆంద్రప్రదేశ్‌‍లో అధిక శాతం రైతులు అప్పుల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నట్లు నేషనల్ సర్వే వెల్లడించడం ఆందోళనకరం. సాగు వ్యయం ఏడాదికేడాది ఆకాశాన్ని అంటడంతో అంచనాలకు మించి పంట దిగుబడులు వచ్చినప్పటికీ నికరంగా నష్టాలే మిగులుతున్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌‍లో 93.2శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయని, ఒక్కో కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు ఉందని ఇటీవల ఒక నివేదిక వెలువడింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో వ్యవసాయం బ్రహ్మాండమంటూ పత్రికల్లో ప్రకటనలిస్తూ రైతుల్ని మభ్యపెడుతోంది.


తెలుగుదేశం ప్రభుత్వం సాగు బాగే లక్ష్యంగా సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అయిదేళ్లలో సాగు నీటి రంగానికి రూ.70 వేలకోట్లు ఖర్చు చేసింది. వ్యవసాయానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డింది. కానీ రెండున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం వ్యవసాయానికి నీటిమీద బుడగలాంటి మెరుగులు దిద్ది రైతులను ఉద్ధరించినట్లు దగా చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రకటనల వెనుక మోసాన్ని రైతులు గుర్తించాలి.

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

మాజీ శాసన సభ్యులు

Updated Date - 2021-10-09T06:22:43+05:30 IST