దసరా నాటికి రైతు వేదికలు

ABN , First Publish Date - 2020-09-25T05:54:28+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు

దసరా నాటికి రైతు వేదికలు

 నిర్మాణంలో 76 భవనాలు

 నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో అక్టోబర్‌ 15 నాటికి రైతు వేదికల నిర్మాణాలను పూర్తిచేసి దసరా నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ కె శశాంక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ నిత్యం జిల్లాలో పర్యటిస్తూ రైతు వేదికల నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షిస్తున్నారు. జిల్లాలో 76 రైతు వేదికలను నిర్మించాలని తలపెట్టి వ్యవసాయశాఖ ఆ మేరకు వేదికలను మంజూరు  చేసి ఉత్తర్వులను జారీ చేసింది. వీటిలో 70 రైతు వేదికలను ఉపాధి హామీ పథకం కింద, నాలుగు వేదికలను మున్సిపల్‌ పరిధిలో ఉన్న ఇతర గ్రాంట్లతో, మరో రెండు వేదికలను విరాళాలతో నిర్మించాలని నిర్ణయించారు. 76 రైతు వేదికలకు స్థలాన్ని గుర్తించడంతోపాటు నిర్మాణ పనులను శ్రీకారం చుట్టారు. 


మంత్రి సొంత నిధులతో నిర్మాణం

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తన నియోజకవర్గమైన కరీంనగర్‌లో నిర్మించతలపెట్టిన ఏడు రైతు వేదికల్లో రెండింటిని తన సొంత నిధులతో చేపట్టేందుకు విరాళం ఇచ్చారు. ఒక్కొక్క రైతు వేదికను 22 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఇందుకోసం జిల్లాలో 16 కోట్ల 72 లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారు. మంత్రి గంగుల ఇచ్చిన విరాళంతో కరీంనగర్‌ నియోజకవర్గంలోని ముగ్దుంపూర్‌, బద్దిపెల్లి గ్రామాలలో ఇప్పటికే రైతువేదికల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మానకొండూర్‌ నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం మాదాపూర్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణం పూర్తయింది. కరీంనగర్‌ నియోజకవర్గంలో ఏడు, మానకొండూర్‌ నియోజకవర్గంలో 22, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 25, చొప్పదండి నియోజకవర్గంలో 16, హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలో ఆరు రైతు వేదికలను నిర్మించాలని నిర్ణంయించారు. ఇప్పటి వరకు నాలుగు గ్రామాల్లో బేస్‌మెట్‌  పూర్తికాని పరిస్థితి ఉండగా 33 రైతు వేదికలకు బేస్‌మెట్లు పూర్తయ్యాయి. 16 చోట్ల రైతు వేదికల పనులు లెంటల్‌ లెవల్‌కు, 14 చోట్ల రూఫ్‌ లెవల్‌కు వచ్చాయి. రెండు గ్రామాల్లో స్లాబ్‌లు పూర్తయ్యాయి. నాలుగు గ్రామాల్లో ప్లాస్టరింగ్‌ పనులు జరుగుతున్నాయి. 


పనులపై కలెక్టర్‌ సమీక్ష

ఇప్పటి వరకు నిర్మాణ పనులపై 2 కోట్ల 56 లక్షల 14వేల రూపాయలను వెచ్చించారు. అక్టోబర్‌ నాటికే రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తికావాలని నిర్ణయించినా పనులు మందకొడిగా సాగుతుండడంతో కలెక్టర్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుధవారం ఆయన గ్రామీణ అభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, అక్టోబర్‌ 15 నాటికి వేదికల నిర్మాణ పనులు పూర్తికావాలని ఆదేశించారు. దసరా నాటికి రైతు వేదికలన్నిటిని ప్రారంభించాలని, నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కార్మికులు అందుబాటులో లేకుంటే ఇతర జిల్లాల నుంచి , ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని పంచాయతీరాజ్‌ ఇంజనీర్లను కలెక్టర్‌ ఆదేశించారు. దసరాకు మరో నెలరోజుల గడువు మాత్రమే ఉండడంతో ఈ పనులన్నీ పూర్తి చేయడానికి ఇంజనీరింగ్‌ అధికారులు తంటాలు పడుతున్నారు. 

Updated Date - 2020-09-25T05:54:28+05:30 IST