Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 5 2021 @ 19:55PM

27న భారత్ బంద్: కిసాన్ మహా పంచాయత్‌ పిలుపు

ముజఫర్‌నగర్: ఈనెల 27న 'భారత్ బంద్‌'కు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న రైతు ఆందోళనలకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సారథ్యం వహిస్తోంది. ఎస్‌కేఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఆదివారంనాడు జరిగిన కిసాన్ మహా పంచాయత్‌లో రైతు నేతలు భారత్ బంద్ పిలుపునిచ్చారు. పంజాబ్, హర్యానా, మహారాష్ట్రతో సహా 15 రాష్ట్రాలకు చెందిన 300కు పైగా యూనియన్ల రైతులు పెద్దఎత్తున హాజరై సంఘీభావం చాటారు.

ఈ సందర్భంగా రైతు నేతలు మాట్లాడుతూ, సాగు చట్టాలను అతి కొద్ది మంది రైతులే వ్యతిరేకిస్తున్నారని కేంద్రం చెబుతోందని, ఇవాళ హాజరైన అశేష జనవాహినిని కేంద్రం చూస్తే 'ఎంత కొద్దిమందో' అవగతమవుతుందని పేర్కొన్నారు. పార్లమెంటులో కూర్చునే వాళ్లకు వినపడేలా రైతు వాణిని బలంగా వినిపించాలని మహాపంచాయత్‌కు హాజరైన అశేష జనవాహినికి నేతలు దిశానిర్దేశం చేసారు. కులమతాలు, రాష్ట్రాలు, వర్గాలు, చిన్న వ్యాపారులు అనే తేడా లేకుండా సమాజంలోని అన్ని వర్గాల వారూ మహాపంచాయత్‌కు హాజరైన విషయం పాలకులు గ్రహించాలన్నారు.

దీనికి ముందు కిసాన్ మహా పంచాయత్ ఒక ప్రకటనలో రైతులు, రైతు కూలీలు, రైతు ఉద్యమ మద్దతుదారుల శక్తి ఏపాటిదో మోదీ, యోగి ప్రభుత్వాలు ఈరోజు తెలుసుకోబోతున్నాయని పేర్కొంది. గత తొమ్మిది నెలల్లో జరిపిన ఆందోళనల్లో ఇది అతిపెద్ద ఈవెంట్ అని తెలిపింది. తమ డిమాండ్లను ఆమోదించని పక్షంలో 2022 ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా రైతు నేతలు ప్రచారం చేస్తారని, 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ కూడా తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించింది.

Advertisement
Advertisement