భూ వ్యవహారంలో రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-08-19T05:07:55+05:30 IST

కురిచేడు మండలంలోని కల్లూరు గ్రామంలో ఓ భూ వ్యవహారంలో మోరబోయిన శ్రీను అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

భూ వ్యవహారంలో రైతు ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రిలో శ్రీను

పరిస్థితి విషమించడంతో వినుకొండకు తరలింపు

కురిచేడు, ఆగస్టు 18 : మండలంలోని కల్లూరు గ్రామంలో ఓ భూ వ్యవహారంలో మోరబోయిన శ్రీను అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వినుకొండకు తరలించారు. వివరాల్లోకెళ్తే... కల్లూరు గ్రామంలో మోరబోయిన శ్రీను, అతని తమ్ముడు వెంకటేశ్వర్లుకు ఉమ్మడిగా 3 ఎకరాల పొలం ఉంది. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వర్లు తన వాటాగా భావిస్తున్న 1.5 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన వ్యాపారి మోదాల రాములకు రిజిస్టర్‌ చేశారు. రెండేళ్ల క్రితం రాములు అదే భూమిని గ్రామంలోని మరో వ్యక్తికి అమ్మచూపారు. అదే సమయంలో మోరబోయిన శ్రీను కల్పించుకుని తమకే ఆ భూమి ఇవ్వాలని అడిగాడు. తక్కువ రేటుకు అడగడంతో వ్యాపారి రాములు వేరే వ్యక్తికి అమ్మాడు. ఈ విషయమై శ్రీను గ్రామంలోని పెద్దమనుషుల ద్వారా రాములుతో మాట్లాడించాడు. వ్యవహారం తేలకపోవడంతో మండల స్థాయి నేతల సమక్షంలో మాట్లాడించడంతో రాజీకి వచ్చారు. రాములు రిజిస్టర్‌ చేసిన వ్యక్తితో మళ్లీ శ్రీనుకు భూమిని రిజిస్టర్‌ చేసేలా ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత రాములు దగ్గర భూమి కొన్న వ్యక్తి ఒప్పుకోలేదు. దీంతో తమ భూమి తమకు రాదన్న మనస్తాపంతో మోరబోయిన శ్రీను ఇంట్లోనే గురువారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తొలుత స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వినుకొండకు తరలించారు.

Updated Date - 2022-08-19T05:07:55+05:30 IST