రైతన్న చూపు... బొప్పాయి వైపు

ABN , First Publish Date - 2022-01-20T04:43:41+05:30 IST

బొప్పాయి పంటను రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో ఈ ఏడాది విరివిగా సాగు చేశారు.

రైతన్న చూపు... బొప్పాయి వైపు
రాజంపేట మండలం మిట్టమీదపల్లె ప్రాంతంలో సాగుచేసిన బొప్పాయి పంట

20వేల ఎకరాల్లో బొప్పాయి  

రాజంపేట-రైల్వేకోడూరు ప్రాంతాల్లో విరివిగా సాగు  


రాజంపేట / రైల్వేకోడూరు, జనవరి 19: బొప్పాయి పంటను రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో ఈ ఏడాది విరివిగా సాగు చేశారు. రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లో 20వేల ఎకరాల్లో ప్రస్తుతం ఈ పంటను సాగు చేశారు. గత ఏడాది భారీ వర్షాలు కురవడం వల్ల భూ గర్భజలాలు గణనీయంగా పెరిగి బోరుబావులు, కుంటలు, చెరువుల్లో నీరు ఉండటంతో నీటి ఆధారితంగా ఈ పంటను విరివిగా సాగు చేశారు. మామూలుగా ప్రతి ఏడాది నవంబరులో పంటను సాగు చేస్తారు. అయితే నవంబరులో ఎడతెరిపి లేని వర్షాలు కురవడం వల్ల డిసెంబరు మాసాంతంలో బొప్పాయి సాగు చేశారు. మామూలుగా రెండు సంవత్సరాలు దిగుబడి ఇచ్చే ఈ పంటకు విరివిగా తెగుళ్లు సోకుతుండటంతో ఏడాదికే కుదిస్తున్నారు. ఈ ఏడాది కొత్తరకమైన థైవాన్‌ 786 రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఎకరాకు 200 గ్రాముల థైవాన్‌ 786 విత్తనాలను 6వేల చొప్పున కొనుగోలు చేసి విత్తుతున్నారు. ఆరడుగుల నిడివితో ఎకరాకు 1000 నుంచి 1200 మొక్కలను నాటుతున్నారు. ఎకరా సాగుకు 50వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఖర్చులు పోనూ ఎకరాకు లక్ష రూపాయలు తక్కువ లేకుండా ఆదాయం వస్తుం ది. అయితే గత రెండు సంవత్సరాలుగా బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. గత ఏడాది భారీ వర్షాలు కురవడం, అంతకమునుపు ఏడాదిన్నరగా కరోనా పరిస్థితుల వల్ల ఈపంటకు బాగా డిమాండ్‌ తగ్గి కొనేవారు లేక పారవేసే పరిస్థితి ఏర్పడింది. అయితే రైతులు ప్రతి సంవత్సరం రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో బొప్పాయి, అరటి, పసుపు, మామిడి లాంటి పంటల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే బొప్పాయి పంటను కూడా సాగు చేస్తున్నారు. రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లోని శెట్టిగుంట, లక్ష్మీగారిపల్లె, కండ్రిక, చియ్యవరం, నాగవరం, నగిరిపాడు, రాజుకుంట, చెర్లోపల్లె, హస్తవరం, బాలిరెడ్డిగారిపల్లె, కూచివారిపల్లె, వత్తలూరు, అనసముద్రం, మిట్టమీదపల్లె, మేకవారిపల్లె, ఎర్రగుంటకోట, గొబ్బూరువారిపల్లె, పెద్దఓరంపాడు, లింగిరెడ్డిపల్లె, రెడ్డిపల్లె తదితర అన్ని గ్రామాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. జూలై నుంచి డిసెంబరు వరకు పంట దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. ఈ ఏడాది అయినా తమకు లాభాలు వస్తాయన్న నమ్మకంతో అనేక ఏళ్లుగా బొప్పాయిని నమ్ముకున్న రైతులు అదే పంటను సాగు చేశారు.

Updated Date - 2022-01-20T04:43:41+05:30 IST