అన్నదాతకు ఎంత కష్టం..

ABN , First Publish Date - 2021-07-30T04:58:15+05:30 IST

అన్నదాతకు ఆదిలోనే అన్నీ కష్టాలు.. ఒక పక్క డబ్బులు అందక ఇబ్బందులు పడితే.. మరో పక్క వరుణదేవుడు నిండా ముంచేశాడు.

అన్నదాతకు ఎంత కష్టం..
పోడూరు మండలం రావిపాడులో నీట మునిగిన చేను

సార్వా సాగుకు అష్టకష్టాలు..

 

పోడూరు, జూలై 29 : అన్నదాతకు ఆదిలోనే అన్నీ కష్టాలు.. ఒక పక్క డబ్బులు అందక ఇబ్బందులు పడితే.. మరో పక్క వరుణదేవుడు నిండా ముంచేశాడు. నిన్నటి వరకూ సొమ్ము లందక ఇబ్బందిపడ్డారు.. సొమ్ములు అందినా... ప్రస్తుతం సాగుకు ఎలా దిగాలో తెలియక లబోదిబోమంటున్నారు. వర్షాలకు నారు మడులు, వరినాట్లు నీట మునిగి మరింత కష్టన ష్టాలను చవిచూడాల్సి వస్తోంది. పోడూరు మండలంలో నక్కల కాల్వ ఉధృతంగా ఉండడం వల్ల చేలల్లో వర్షనీరు ఎక్కడి కక్కడే నిలిచిపోయి నారుమడులు, వరి నాట్లు నీటి ముంపులో కుళ్లిపోతున్నాయి. దీంతో రైతులు కౌలు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది కాల్వల ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో నీళ్లు ఎగదన్నుతున్నాయని వాపోతున్నారు.  మూడు నెలలగా ప్రతీ రోజూ రైతులు సొమ్ముల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే బుధవారం కొంత మందికి సొమ్ములు విడుదల చేశారు. మరికొంత మందికి విడుదల కావాల్సి ఉంది.సొమ్ములు విడుదల కాని వారు.. ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ ఏడాది సార్వా సాగుకు రైతాంగం అష్టకష్టాలు పడుతున్నారు. 


అప్పు చేసి సార్వా నారుమడులు పోశా : సత్యనారాయణ, కౌలు రైతు, రావిపాడు


నేను ఆరు ఎకరాలు కౌలుకు చేస్తున్నా.. రూ. 3 లక్షల వరకూ ధాన్యం సొమ్ములు రావాలి. ఽధాన్యం విక్రయించి మూడు నెలలు దాటింది.. బుధవారం సొమ్ములు అందాయి. ఇంత ఆలస్యంగా అందితే ఎలా.  సార్వా సాగు ఎలా చేయాలో తెలియడం లేదు.. ప్రతీ ఏడాది ముందు పంట డబ్బులు రావడంతో ఆనందంగా సాగు ఆరంభించేవాళ్లం.. ఈ ఏడాది డబ్బులు రాక చాలా కష్టమైంది.. అప్పు తెచ్చి సార్వా సాగుకు నారుమడులు పోశా.. వర్షానికి నారుమడి మునిగి కుళ్లిపోయింది.. కష్టంపై కష్టం.. ఇప్పుడేం చేయాలో తోచడం లేదు.. ప్రభుత్వం రైతు గురించి ఆలోచించాలి. 


మూడోసారి సార్వా నారుమడులు


వీరవాసరం, జూలై 29 :  భారీ వర్షాలకు నీటి ముంపును గురైన నారు మడుల నుంచి నేటికీ రైతులు నీటిని బయటకు పంపే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా నారుమడులు వేసి భారీ వర్షాలకు రైతులు నష్టపోయారు. తిరిగి మూడోసారి నారుమడులు వేసేందుకు సిద్ధపడుతున్నారు.వీరవాసరం పశ్చిమకాలువ ఆయకట్టుపై బాలేపల్లి, మెంటేపూడి , బొబ్బనపల్లి శివారు ఆయకట్టుగా ఉన్న మత్స్యపురిలోనూ రైతులు సార్వా సన్నాహాలు చేస్తున్నారు.  


నష్టపోతే 80 శాతం సబ్సిడీపై విత్తనాలు


ఆకివీడు, జూలై 29 : భారీ వర్షాలకు నష్టపోయిన  రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆకివీడు వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ నంద్యాల సీతారామయ్య అన్నారు.  మాదివాడలో కుళ్లిపోయిన నారుమడులను వ్యవసాయాధికారి ప్రియాంకతో కలిసి గురువారం పరిశీలించారు. మండలంలో 122 ఎకరాలు ఆకుమడులు, 65 ఎకరాల్లో నాట్లు వేసి చేలల్లో నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తున్నామన్నారు. రైతులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. 


Updated Date - 2021-07-30T04:58:15+05:30 IST