కల్లాల్లో కన్నీళ్లు

ABN , First Publish Date - 2021-04-21T06:06:06+05:30 IST

కల్లాల్లో కన్నీళ్లు

కల్లాల్లో కన్నీళ్లు
బస్తాలకు ఎత్తినా కల్లంలోనే..

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక ఎక్కడి ధాన్యం అక్కడే..

వరి కోతలు మొదలై 15 రోజులైనా చర్యలు శూన్యం

తక్కువ ధర ఇస్తామంటున్న దళారులు

బస్తాకు రూ.466 నష్టపోతున్న రైతులు

ఆకలి తీర్చే అన్నదాతలు వారు. ఆక్రందన వినండంటూ చేతులు జోడిస్తున్నారు. కల్లాల్లో ధాన్యం కళ్ల ముందే మెదులుతుంటే.. కన్నీళ్లు దిగమింగుకుని దీనంగా అర్థిస్తున్నారు. దాళ్వా పంటను దళారుల దోపిడీకి అప్పజెప్పలేక.. కళ్ల ముందే కనిపెట్టుకుని ఉండలేక కష్టాలతో కాలం వెళ్లదీస్తున్నారు. 

తోట్లవల్లూరు : దాళ్వా వరి కోతలు ప్రారంభమై పక్షం రోజులైంది. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొంటామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇంతవరకు ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించకపోవటంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. ఏ గ్రేడ్‌ ధాన్యం 75 కిలోల బస్తాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.1,416 ఉండగా, దళారులు ప్రవేశించి రూ.950కే కొంటున్నారు. దీంతో రైతు.. బస్తాకు రూ.466 నష్టపోతున్నాడు. 

ఖరీఫ్‌ యాప్‌ క్లోజ్‌ కాకపోవడం వల్లే..

తోట్లవల్లూరు మండలంలో దాళ్వా వరిసాగు 4,190 ఎకరాల్లో సాగైంది. చినపులిపాక, బొడ్డపాడు, వల్లూరుపాలెం, రొయ్యూరు, తోట్లవల్లూరు, యాకమూరు గ్రామాల్లో దాళ్వా వరి సాగైంది. బొడ్డపాడు, చినపులిపాక గ్రామాల్లో పదిహేను రోజుల నుంచి వరికోతలు చేపట్టగా, కొనే నాథుడే కరువయ్యాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చినపులిపాకలో పదిహేను రోజులుగా ధాన్యం రాశులు కల్లాల్లో ఆరబెట్టి రైతులు దిక్కులు చూస్తున్నారు. పీఏసీఎస్‌లు, రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని దుస్థితితో రైతులు వెనుదిరిగి వస్తున్నారు. ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు యాప్‌ ఇంకా క్లోజ్‌ కాకపోవడం వల్లే కొనుగోలు కేంద్రాలు తెరవలేదని అధికారులు చెబుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్‌ వ్యాపారులు రంగప్రవేశం చేసి అతి తక్కువ ధరకు కొంటున్నారు. వీరు కొన్న ధాన్యం కూడా కల్లాల్లోనే పరదాలు కప్పి ఉంచుతున్నారు. ముమ్మరంగా వరికోతలు జరుగుతున్న ఈ సమయంలో  కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. 










Updated Date - 2021-04-21T06:06:06+05:30 IST