‘వ్యయ’సాయం!

ABN , First Publish Date - 2021-10-13T04:59:36+05:30 IST

జిల్లాలో రబీ సీజన్‌ ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తుండటం, జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ సీజన్‌లో అత్యధికంగా వరి ఆ తర్వాత పచ్చిశనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతుంటాయి.

‘వ్యయ’సాయం!
పంట సాగుకు దుక్కిదున్నతున్న రైతన్న

యేటా పెరుగుతున్న పెట్టుబడులు

అడ్డూఅదుపులేని ఎరువుల ధరలు

సెన్సెక్స్‌తో పోటీపడుతున్న డీజిల్‌

కూలీలపై ‘ఉపాధి’ ఎఫెక్ట్‌!

ఎక్కువ కూలి ఇస్తామన్నా దొరకని వైనం

ఆరుగాలం కష్టాపడ్డా లభించని ‘మద్దతు’

సాగుపై అన్నదాతల్లో నైరాశ్యం  


ఏటా ‘వ్యయ’సాయంలో పెరుగుతున్న పెట్టుబడులతో అన్నదాత కుదేలవుతున్నాడు. ప్రతిరోజు పెరుగుతున్న డీజిల్‌తోపాటు ఎరువుల ధర కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇదిచాలదన్నట్టు కూలీల కొరతతో రైతన్న సతమతం అవుతున్నాడు. అప్పోసప్పో చేసి పంటలు పండించినా తీరా ఉత్పత్తులు చేతికందే దశలో ‘మద్దతు’ కరువవుతోంది. గిట్టుబాటు ధర లభించక చేసిన అప్పులు తీర్చలేక వ్యవసాయం చేయాలంటేనే కర్షకుడిలో నైరాశ్యం నెలకొంది. 


ఉదయగిరి రూరల్‌, అక్టోబరు 12 : జిల్లాలో రబీ సీజన్‌ ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తుండటం, జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ సీజన్‌లో అత్యధికంగా వరి ఆ తర్వాత పచ్చిశనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతుంటాయి. పంట దిగుబడులు అధికంగా రావాలంటే రసాయనిక ఎరువులు వినియోగం తప్పనిసరి. వరికి ఎకరాకు వంద కిలోల డీఏపీ, 50 కిలోల వరకు పొటాష్‌, 75 కిలోల యూరియా వేస్తుంటారు. గతంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరకే ఎరువులు సరఫరా చేసేది. నూతన ఆర్థిక విధానాల పేరుతో ఎరువులపై సబ్సిడీలు ఎత్తివేసింది. దీంతో కంపెనీలు ఎరువుల ధరలను పెంచేసింది. దీంతో పెట్టుబడులు అధికమవుతున్నాయి. ఇటీవల డీఏపీ బస్తా (50 కిలోలు) రూ.1300 ఉండగా రూ.1700లకు చేరింది. పొటాష్‌ రూ.1040 ఉండగా రూ.1600, కాంప్లెక్స్‌ ఎరువు రూ.1550 నుంచి రూ.1700లకు పెరిగింది. అన్నిరకాల పంటలకు పెట్టుబడులు ఎకరాకు రూ.2 నుంచి రూ.5 వేలకు పెరుగుతున్నాయని రైతులు అంటున్నారు. 


డీజిల్‌ భారం


ప్రతిరోజూ పెరుగుతున్న డీజిల్‌ ధరల ప్రభావం వ్యవసాయ రంగంపై పడుతోంది. దుక్కి నుంచి పంట దిగుబడులను ఇంటికి చేర్చే వరకు రైతులకు డీజిల్‌ ఎంతో అవసరం. ఇంధన ధర పెంపు సాకుతో ట్రాక్టర్ల యజమానులు ధరలు పెంచేస్తున్నారు. గతంలో మెట్ట దుక్కికి గంటకు రూ.1200, రోటావేటర్‌కు రూ.1000, లోతు దుక్కులు రూ.2వేలు, గేజ్‌వెల్‌ రూ.2,000 తీసుకొంటున్న యజమానులు ఇప్పుడు రూ.300 నుంచి రూ.400 అదనంగా వసూలు చేస్తున్నారు.


కూలీల కొరత


మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులకు రావాలని కూలీలను బతిమాల్సి వస్తోందని, అధిక కూలి ఇస్తామన్నా ఎవరూ వ్యవసాయ పనులకు రావడంలేదని వాపోతున్నారు. పంట కోత సమయంలో ఇతర ప్రాంతాలు, అధిక కూలి చెల్లించాల్సి ఉండటంతో పెట్టుబడులు రెట్టింపు అయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలుపుతున్నారు. 


గిట్టుబాటు కావడంలేదు


ఏడాదికేడాది పెరుగుతున్న పెట్టుబడులతో వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. కూలీల కొరత రైతులను వేధిస్తోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

- ఈర్ల శంకర్‌,  కొత్తపల్లి, ఉదయగిరి


ప్రభుత్వాలు ఆదుకోవాలి


ప్రభుత్వాల పనితీరుతో రానున్న కాలంలో వ్యవసాయానికి రైతులు స్వస్తి పలికే రోజులు వస్తున్నాయి. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇప్పటికే రైతులు సాగుపై నైరాశ్యం చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు స్పందించకపోతే వ్యవసాయరంగం దివాలా తీసే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 

- కాకు వెంకటయ్య, రైతు సంఘం నాయకుడు


సోమశిలలో 73.195 టీఎంసీల నీరు

అనంతసాగరం : సోమశిల జలాశయానికి ఎగువ నుంచి మంగళవారం 15వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  నమోదైంది. జలాశయంలో 73.195 టీఎంసీల నీరు నిల్వ ఉండగా రెండు గేట్లు ఎత్తి పెన్నాకు 19,930, ఉత్తర కాలువకు 80, కండలేరుకు 300 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.


సబ్సిడీపై వరి, శనగ విత్తనాలు

నెల్లూరు(వ్యవసాయం), అక్టోబరు 12 :  రబీ సీజన్‌లో రాయితీపై వరి, శనగ విత్తనాలు ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వై.ఆనందకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. 8వేల క్వింటాళ్ల బీపీటీ 5204, 8600 క్వింటాళ్ల ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, 6800 క్వింటాళ్ల ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 వరి విత్తనాలతోపాటు 8570 క్వింటాళ్ల జేజీ-11 (శనగలు), 550 క్వింటాళ్ల కేఏకే-2 (శనగలు) అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో తమపేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వరి విత్తనాలపై కేజీకి రూ.5, శనగలు 25 శాతం రాయితీపై ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-13T04:59:36+05:30 IST