ప్రణాళికల్లోనే రైతు రుణం

ABN , First Publish Date - 2020-07-04T11:27:08+05:30 IST

జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ వార్షిక రుణ ప్రణాళికలో సింహభాగం వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఇవ్వాలని భారీ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నా ఇచ్చింది నామమాత్రమే.

ప్రణాళికల్లోనే రైతు రుణం

అధిక వడ్డీ ఆశతో గృహ నిర్మాణాలకు రెట్టింపు రుణాలు  

రీషెడ్యూలుకే పరిమితమైన రైతు రుణాలు 

పౌలీ్ట్ర, పాడికి ఇచ్చింది 32%

పారిశ్రామికవేత్తలకు 89.74 %, విద్యార్థులకు 43.84% మాత్రమే..

శతశాతం వార్షిక రుణ ప్రణాళిక సాధించామంటూ బ్యాంకర్ల బీరాలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూలై 3 : జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ వార్షిక రుణ ప్రణాళికలో సింహభాగం వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఇవ్వాలని భారీ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నా ఇచ్చింది నామమాత్రమే. అయినా రుణ ప్రణాళిక 103.42 శాతం అమలు చేశామని బ్యాంకర్లు గొప్పగా చెబుతున్నారు. జిల్లా యంత్రాంగం కూడా శభాష్‌ అంటున్నది. అయితే ప్రాధాన్య రంగమైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అరకొరగా ఇచ్చినా వందశాతానికి పైగా వార్షిక రుణ ప్రణాళిక ఎలా సాధించారనుకుంటున్నారా ?  అయితే చదవండి..


2019-20 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.4,357.12 కోట్ల రుణ ప్రణాళికను జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ ఖరారు చేసింది. ఇందులో 103.42 శాతం మేర రూ.4,506.06 కోట్ల రుణాలు ఇచ్చామని బ్యాంకర్లు సగర్వంగా ప్రకటించి, జిల్లా యంత్రాంగం మన్ననలు అందుకున్నారు. అయితే ఈ స్థాయిలో రుణాలు ఇచ్చారా అని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 


రైతులకు రుణాలు అంతంతే !

2019-20లో ఖరీఫ్‌, రబీ సీజన్లలో కలిపి రైతులకు పంటరుణాలు, కలుపుతీత, కూలి మొత్తాలు, పురుగుల మందుల కొనుగోలు తదితర వాటి కోసం రూ.1,990.15 కోట్లను ఇవ్వాలని బ్యాంకర్లు నిర్ణయించారు. ఇందులో 82.37 శాతం మేర... రూ.1,639.28 కోట్లను రైతులకు రుణాలు ఇచ్చామని బ్యాంకర్లు పేర్కొన్నారు. చెప్పుకోవడానికి ఇది కొంత వరకు మెరుగ్గానే కనిపిస్తున్నా ఇందులో యాభై శాతానికి పైగా రెన్యూవల్‌ చేసినవే ఉన్నాయి. కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ తదితర అనుబంధ రంగాల రైతులకు దీర్ఘకాలిక రుణాలుగా రూ.460.25 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకుని 31.98 శాతం మించి ఇవ్వలేకపోయారు. అంటే వీరికి ఇచ్చిన మొత్తం రూ.147.17 కోట్లు మాత్రమే. రైతుల కోసం గోదాములు, షెడ్లు, కోల్డ్‌స్టోరేజీల నిర్మాణానికి రూ.80.37 కోట్లు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నా.. ఇచ్చింది 0.02 శాతం మాత్రమే.


వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తదితర యంత్రాలు, వాటి పరికరాల కొనుగోలు కోసం రైతులకు రూ.350 కోట్ల రుణాలు ఇవ్వాలనుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేవలం 3.69 శాతం... అంటే రూ.12.91 కోట్లకు మించి ఇవ్వలేదు. వ్యవసాయ రంగాన్ని, రైతులను పూర్తిగా విస్మరించిన బ్యాంకర్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులకు ఇచ్చే రుణాలపై మాత్రమే కాస్త దృష్టి సారించారు. అయితే అది కూడా లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేదు. వ్యవసాయంతో పోల్చితే వీరికిచ్చే రుణాలపై కాస్త ఎక్కువ వడ్డీ రావడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. 


విద్యార్థులకు 43.84 శాతం

ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా అంతంత మాత్రంగానే రుణాలు ఇచ్చారు. విద్యార్థులకు రూ.79.20 కోట్లు ఇవ్వాలని మొదట నిర్ణయించినా 43.84 శాతానికి మించి ఇవ్వలేకపోయారు. అంటే రూ.34.72 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మాత్రం 89.74 శాతం మేర రుణాలు ఇచ్చారు. గతేడాదిలో రూ.421.85 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకర్లు వారికి రూ.378.57 కోట్లు రుణంగా ఇవ్వడం గమనార్హం. 


గృహ నిర్మాణానికి 225.38 శాతం

మిగతా రుణాల సంగతి ఎలా ఉన్నా ఇళ్లు నిర్మించుకునే వారికి మాత్రం మొదట నిర్ణయించుకున్న మొత్తానికి రెట్టింపునకు పైగా... అంటే 225.38 శాతం రుణాలిచ్చారు. 2019-20లో గృహ రుణాలుగా రూ.450.00 కోట్లు ఇవ్వాలనుకున్న బ్యాంకర్లు ఏడాది ముగిసే నాటికి ఏకంగా రూ.1,014.20 కోట్లు రుణంగా ఇచ్చారు. అంటే వడ్డీ ఎక్కువ రావడం వల్లే గృహ నిర్మాణాలకు లక్ష్యాన్ని మించి రుణాలు మంజూరు చేసినట్టు స్పష్టమవుతున్నది. 


ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు కోత

బ్యాంకర్లు గతేడాది రైతులకు సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను పూర్తిగా అమలు చేయకపోవడంతో ఈ ఏడాది (2020-21) రుణ ప్రణాళికను తగ్గించారు. గతేడాదిలో పంట రుణాలుగా రూ.1,990.15 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకుని రూ.1,639.28 కోట్లే ఇచ్చారు. దాంతో ఈసారి రుణ ప్రణాళికలో పంట రుణాలుగా రూ.1,854.52 కోట్ల మేర నిర్ణయించారు. కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ తదితర రంగాల్లో రైతులకు గతేడాది రూ.460.25 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకుని కేవలం రూ.147.17 కోట్లనే ఇచ్చారు. దీంతో ఈసారి ప్రణాళికలో ఈ రంగాలకు రూ.251.00 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే గోదాంలు, షెడ్లు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణాలకు గతేడాది రూ.80.37 కోట్లు నిర్దేశించగా ఈ ఏడాదిలో సగానికి సగం తగ్గించి రూ.41.00 కోట్లుగా నిర్ణయించారు.


వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తదితర వాటి కొనుగోళ్లకు గతేడాదిలో రూ.350.00 కోట్లుగా నిర్ణయించగా ఈ ఏడాది రూ.260.50 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ఇచ్చే రుణాల లక్ష్యాన్ని తగ్గించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ గృహ రుణాలను మాత్రం ఈ ఏడాది రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. గతేడాది రూ.450 కోట్ల హౌసింగ్‌ రుణాలు ఇవ్వాలనేది టార్గెట్‌ కాగా, ఆ మొత్తాన్ని ఈ ఏడాది రూ.950 కోట్లకు పెంచారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం గతంలో రూ.421.85 కోట్లుగా నిర్ణయించుకోగా, ఈ సారి ఆ మొత్తాన్ని మరో వంద కోట్లకు పెంచి రూ.521.50 కోట్లు ఇవ్వాలని నిర్ణయించడం చూస్తే... వడ్డీ ఎక్కువగా వచ్చే రంగాలకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు మొగ్గు చూపుతున్నారన్నది స్పష్టమవుతున్నది. జిల్లా యంత్రాంగం కూడా వంత పాడుతుండడం విచిత్రంగా ఉంది.

Updated Date - 2020-07-04T11:27:08+05:30 IST