దళిత రైతులకు సంకెళ్లు వేశారు

ABN , First Publish Date - 2020-11-01T07:06:46+05:30 IST

ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకోసం భూములు ఇచ్చిన దళిత రైతులకు సంకెళ్లు వేసిన సీఎం జగన్‌కు ఆ పదవిలో ఒక్క నిమిషం కూడా ఉండే అర్హత లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు.

దళిత రైతులకు సంకెళ్లు వేశారు
అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న గోరంట్ల, మధు తదితరులు

  • జగన్‌ ఒక్క నిమిషం కూడా సీఎంగా ఉండడానికి అనర్హుడు 
  • అమరావతి దళిత రైతులపై కేసులను నిరసిస్తూ టీడీపీ, సీపీఐ ధర్నా 

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 31: ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకోసం భూములు ఇచ్చిన దళిత రైతులకు సంకెళ్లు వేసిన సీఎం జగన్‌కు ఆ పదవిలో ఒక్క నిమిషం కూడా ఉండే అర్హత లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో గోకవరం బస్టాండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో శనివారం దళిత రైతుల అరెస్టులను నిరసిస్తూ ధర్నా చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనకు జగన్‌ ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసం దళిత రైతులు భూములు ఇస్తే వారిని తీవ్రవాదుల్లా సంకెళ్లు వేసి అరెస్టులు చేసి తీసుకెళ్లడం హేయమైన చర్య అని, దీనికి జగన్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అమరావతే రాజధానిగా ఉంచాలని, 13 నెలలుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను కరుడుగట్టిన నేరస్తుల్లా పరిగణించడం వారి హక్కులను కాలరాయడమేనని అన్నారు. దళిత రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రతి విషయంలోను మాట తప్పారన్నారు. దళిత రైతులను దారుణంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తప్పుడు విధానాలకు స్వస్తి చెప్పకపోతే జగన్‌ పతనం ప్రారంభమౌతుందని, దీనికి అందుకు ఉద్యమం రాజమహేంద్రవరం నుంచే చేస్తామన్నారు. అనంతరం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టరేట్‌ వరకు నిరసన ప్రదర్శన చేసి సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అంద జేశారు. నిరసనలో సీపీఐ నాయకులు నల్లా రామారావు, శెట్టిబలిజ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పాలిక శ్రీను, టీఎన్‌టీయుసీ జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, టీడీపీ నాయకులు మార్గాని సత్యనారాయణ, వెలుగుబంటి ప్రసాద్‌, వంగమూడి కొండలరావు, యడ్ల అప్పా రావు, బి.రవి, గంగిన హనుమంతరావు, మత్స్యేటి శివసత్యప్రసాద్‌, పిన్నింటి ఏకబాబు, ప్రతిపాటి పుల్లారావు, ఆళ్ల ఆనందరావు, నిమ్మలపూడి రామకృష్ణ, నీలి కోటేశ్వరరావు, శీలం గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-01T07:06:46+05:30 IST