రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రైతు బలి?

ABN , First Publish Date - 2020-08-06T07:23:03+05:30 IST

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఓ రైతు బలైన సంఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం లింగారెడ్డిపేటలో బుధవారం చోటు చేసుకుంది.

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రైతు బలి?

మనోహరాబాద్‌, ఆగస్టు 5: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఓ రైతు  బలైన సంఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం లింగారెడ్డిపేటలో బుధవారం చోటు చేసుకుంది. రైతు కుటుంబసభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు సూరారం కిష్టయ్య (55)కు సర్వే నంబరు 117లో నాలుగున్నర గుంటల భూమి ఉన్నది. 2018లో ఆ భూమిని అప్పటి రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు అక్రమంగా అదే గ్రామానికి చెందిన మంగళి జాని, భూపాల్‌, నాగరాజు పేర పహానీలో నమోదు చేశారు. తన భూమి వేరే వారి పేర నమోదైందని, తనకు న్యాయం చేయాలని ఏడాది నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ కిష్టయ్య తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు.


పొలాన్ని తన పేర ట్రాన్స్‌ఫర్‌ చేయాలని జాని, భూపాల్‌, నాగరాజులను కూడా ప్రాథేయపడ్డాడు. దీంతో రూ.40 వేలు ఇస్తేనే చేయిస్తామని వారు డిమాండ్‌ చేశారు. దీంతో మనస్థాపానికి  గురైన కిష్టయ్య బుధవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై మరణించాడు. కిష్టయ్య మృతికి రెవెన్యూ అధికారులే కారణమని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.


తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపి రైతు కుటుంబానికి న్యాయం చేయాలని, తప్పుచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీఆర్వో బాలయ్యను వివరణ కోరగా, అప్పట్లో జరిగిన తప్పును కిష్టయ్య తమ దృష్టికి తెచ్చాడన్నారు. వారం క్రితం తహసీల్దార్‌ ఆదేశాల మేరకు అక్రమంగా పహానీలో నమోదైన ముగ్గురికి రెండుసార్లు నోటీసులు ఇచ్చినా తీసుకోలేదన్నారు. త్వరలోనే ఆ పొలాన్ని కిష్టయ్య పేర చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమన్నారు. తప్పకుండా ఆ పొలాన్ని కిష్టయ్య కుటుంబసభ్యుల పేర పట్టా చేస్తామని చెప్పారు.

Updated Date - 2020-08-06T07:23:03+05:30 IST