విక్రయానికి తరలించిన ఎద్దులు
అమ్మకానికి ఎద్దులు, వ్యవసాయ పనిముట్లు
ఎమ్మిగనూరు, జనవరి20: ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి ఏడాది జరిగే నీలకంఠేశ్వరస్వామి జాతరలో ఎద్దుల విక్రయం జరగడం ఆనవాయితీ. అట్లాగే వ్యవసాయంలో ఉపయోగించే పలుగు, పార, నాగలి, గొర్రు, దంతెలు, కాడిమాన్లులు కూడా విక్రయిస్తారు. దీంతో ఈ జాతరకు రైతు జాతరగా గుర్తింపు ఉంది. పట్టణ శివారులోని మంత్రాలయం రోడ్డు సమీపంలో ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో ఎద్దులు, కోడెలు, దూడలను పశువుల యజమానులు, రైతులు రెండురోజుల ముందే తరలించారు. గురువారం వాటిని చూసేందుకు, కొనుగోలు చేసేందుకు రైతులు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంత జనసందోహంగా కనిపించింది. జత ఎద్దులు రూ. లక్షల్లో పలకటం విశేషం. నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన కోడెలు ఆకర్షణీయంగా నిలిచాయి. అలాగే కోసిగి మండలం చిన్నభూంపల్లికి చెందిన జత ఎద్దులకు రూ. 1.26 లక్షలకు కర్ణాటక రైతులు కొన్నారు. మంత్రాలయం మండలం చిలకడోన గ్రామానికి చెందిన జత ఎద్దులు రూ. 2లక్షలు ధర పలికాయి. అలాగే నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన కోడెలు రూ. 2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పైగా పలుకుతున్నాయి.