రేపు ఉత్తనూరులో రైతు మేళా

ABN , First Publish Date - 2021-10-19T05:23:52+05:30 IST

అయిజ మండలంలోని ఉత్తనూర్‌లో బుధవారం నిర్వహించనున్న రైతు మేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రేపు ఉత్తనూరులో రైతు మేళా
ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లు

- ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు

- పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

అయిజ, అక్టోబర్‌ 18 : అయిజ మండలంలోని ఉత్తనూర్‌లో బుధవారం నిర్వహించనున్న రైతు మేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయిజ మాజీ ఎంపీపీ తిర్మల్‌రెడ్డి అధ్వర్యంలో గ్రామంలోని ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.20 లక్షల వ్యయంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు. 


ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు

సదస్సుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు హాజరు కానున్నారు. వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫర్టిలైజర్‌, ఫెస్టిసైడ్స్‌, విత్తనాలు, సేంద్రియ ఎరువులు, మత్స్యశాఖ, ఉద్యానవనశాఖ, ఒంగోలు జాతి ఎద్దులు, గొర్రెలు, మేకలు, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు, గద్వాల చీరలు, పచ్చళ్లు, ఎనిమిది రకాల ట్రాక్టర్లు,  ఆధునిక వ్యవసాయ పనిముట్లు, డ్రిప్‌ ఇరిగేషన్‌ నూతన సాగు పద్ధతులకు సంబంధించిన 40 స్టాళ్ళను ఏర్పాటు చేయనున్నారు. ఆచార్య జయశంకర్‌,  కొండా లక్ష్మణ్‌ బాపూజీ యూనివర్సిటీలకు చెందిన 15 మంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొననున్నారు. మేళాకు హాజ రయ్యే రైతులకు ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పించనున్నారు. అలాగే జిల్లాలో ఉత్తమ ఉపాధ్యా యులుగా పురస్కారం అందుకు 50 మందికి సన్మానం చేయనున్నారు. రైతు సదస్సు ఏర్పాట్లను సోమ వారం అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. వారిలో మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్‌, వెలుగు ఏపీఎం కోటీశ్వరి, మాజీ ఎంపీపీ సుందర్‌రాజ్‌ తదితరులున్నారు.


సీఎం కేసీఆర్‌ ఆశయ సాధనకు కృషి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయాభివృద్ది, రైతు సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన ఆశయ సాధనకు నా వంతు కృషిగా సదస్సును ఏర్పాటు చేస్తున్నాము. రైతులకు కొత్త రకం వంగడాలు, నూతన వ్యవసాయ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సాగులో సస్యరక్షణ పద్ధతులు, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధనపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా మేళాను నిర్వహిస్తున్నాం. 

- తిర్మల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ


Updated Date - 2021-10-19T05:23:52+05:30 IST