అన్నదాతల్లో ఆక్రోశం

ABN , First Publish Date - 2020-12-05T07:14:43+05:30 IST

ఖరీఫ్‌ సాగు చేసిన రైతాంగంపై వరుస ప్రకృతి వైపరీత్యాలు కక్ష కట్టాయి. ఫలితంగా తీవ్ర పంట నష్టాలను చవిచూసిన అన్న దాతల్లో ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది.

అన్నదాతల్లో ఆక్రోశం
పంటను దున్నేస్తున్న రైతు

  • అక్కరకు రావని పండిన పంట చేలనే దున్నేస్తున్నారు
  • ఎకరాకు రూ.25 వేల పైబడే నష్టపోయిన రైతులు
  • వన్నెచింతలపూడిలో పది ఎకరాలను దున్నేసిన రైతు
  • ముంపు నీరుతో కుళ్లిపోయి మొలకలెత్తిన పంట చేలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఖరీఫ్‌ సాగు చేసిన రైతాంగంపై వరుస ప్రకృతి వైపరీత్యాలు కక్ష కట్టాయి. ఫలితంగా తీవ్ర పంట నష్టాలను చవిచూసిన అన్న దాతల్లో ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. ఎంతో శ్రమించి పండిం చిన పంటలు చేతికి వచ్చేసరికి అక్కరకు రాకుండా పోవడంతో రైతులు సహనం కోల్పోతున్నారు. పంటలు తడిసి ముద్దయి మొలకలెత్తి, కుళ్లినకంపు కొడుతున్న పరిస్థితులను అన్నదాతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరుగాలం శ్రమించి తాము పండించిన పంటనే అదే చేతులతో నాశనం చేసే పరిస్థితికి ఒడిగడుతున్నా రంటే వారి దైౖన్య స్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడి గ్రామంలో పది ఎకరాల పంటచేలను శుక్రవారం దుక్కిళ్లు దున్నే ట్రాక్టరుతో దున్నిం చేశారు ఒక రైతు. అక్కడే ఉన్న మరో యాభై ఎకరాలు కూడా దున్నించేందుకు రైతాంగం సిద్ధమవుతున్నారంటే కోనసీమలో ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతల జీవితాలపై ఏవిధమైన ప్రభావం చూపిస్తుందో అర్థంచేసుకోవచ్చు. నివర్‌ తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన కొందరు రైతులు ఓ ప్రాం తంలో ఖరీఫ్‌ సాగు చేశారు. అయితే అక్కడ ముంపునీరు దిగే మార్గం లేకపోవడంతో ఆ చేలల్లో పండిన పంట అంతా పూర్తిగా కుళ్లిపోయి మొలకలెత్తాయి. దాంతో పంటను కూలీలతో ఒబ్బిడి చేయించుకోవాలంటే అనూహ్యమైన భారాన్ని భరించాల్సి వస్తుంది. దీనికంటే పండిన పంటను అలా చేలల్లోనే దున్నేస్తే తదుపరి పం టకు ఎరువుగా అయినా ఉపయోగపడుతుందనే భావంతో రైతులు నిర్థాక్షిణ్యంగా దున్నించేస్తున్నారు. గ్రామానికి చెందిన పది ఎకరాల రైతు నాగరమేష్‌ తన పంట చేలను పూర్తిగా ట్రాక్టరుతో దున్నిం చేశారు. తుఫాను కారణంగా చేలన్నీ నేలనంటాయి. ముంపు నీరు దిగే మార్గం లేకపోవడంతో పూర్తిగా మొలకలెత్తాయి. కూలీలతో వాటిని కోయించాలంటే ఖర్చులు వృథాగా భావించిన నాగరమేష్‌ తనకు సంబంధించిన పది ఎకరాల పంట చేలను శుక్రవారం దుక్కి దున్నే ట్రాక్టరుతో దున్నేశారు. ఇదే తరహాలో పక్కనే ఉన్న మరో యాభై ఎకరాలకు చెందిన రైతులు పంటను కోయకుండానే చేలల్లో దున్నించేయాలనే నిర్ణయానికి వచ్చామని రైతులు విలేకరుల వద్ద ఆవేదన చెందారు. ప్రభుత్వం తడిసి రంగుమారిన, మొలకలెత్తిన ధాన్యాన్ని కొనాలంటే సాధ్యం కాని పని అని, దాంతో ఈ మార్గమే శరణ్యమని భావించి తమ గ్రామంలోనే కాకుండా పలుచోట్ల ఇదే తరహాలో పంట చేలను దున్నించేసి దాళ్వాకు రైతులు సమాయత్తం అవుతున్నారని అక్కడి రైతులు పేర్కొంటున్నారు.  ఈ సందర్భంగా రైతు నాగ రమేష్‌ మాట్లాడుతూ వన్నెచింతలపూడిలో తాను సాగు చేసిన చేలల్లో ముంపు నీరు దిగేందుకు మార్గాలు లేవు. పది రోజు లైనా చేలన్నీ నీళ్లల్లోనే నాని దుర్గంధభరితంగా మారాయి. ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయాం. వరే మార్గంలేకే చేను దున్నించేయాల్సి వచ్చిందని ఆయన ఆవేదన చెందారు.  

Updated Date - 2020-12-05T07:14:43+05:30 IST