ఆశలు ఆవిరి

ABN , First Publish Date - 2020-11-30T05:21:03+05:30 IST

ఆరుగాలం పడిన శ్రమంతా వృధా అయిందని అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు.

ఆశలు ఆవిరి
కొల్లూరులో వరద నీటిలోనే వరి పనలు

ఇంకా నీటిలోనే వరి పనలు

ఆయిల్‌ ఇంజన్లతో నీరు తోడుతున్న కొందరు రైతులు

కొంత పంట అయినా దక్కుతుందని ఆశ


కొల్లూరు, నవంబరు 29: ఆరుగాలం పడిన శ్రమంతా వృధా అయిందని అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడినప్పటికీ తెగుళ్లు, చీడపీడలు, ఎలుకల బారినుంచి వరి పంటను ఎన్నో కష్టాలకోర్చి కాపాడుకున్నారు. శ్రమకు తగిన దిగుబడులు వస్తాయని ఆశిం చారు. అయితే వారి ఆశలను అకాల వర్షాలు నీరుగార్చాయి. చివరిలో నివర్‌ తుఫాను పంటను నాశనం చేసింది. మూడురోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం, ఈదరుగాలులకు కోతకొచ్చిన వరి పంటతోపాటు కోత కోసిన పొలాల్లో ఉన్న వరి ఓదెలు వర్షం నీటిలో నాని ఎందుకు పనికి కాకుండా పోయాయి. వర్షం తగ్గిన పొలాల్లో నీరు బయటకు వెళ్లే వీలు లేకుండా పోయింంది.


నీరు పారే దారి లేక..

పంట కాలువలు, డ్రైనేజ్‌ లు అస్తవ్యస్తంగా ఉండటంతో వర్షపు నీరు కాలవల ద్వారా సక్రమంగా వెళ్లడం లేదు. నీటి నిల్వ కారణంగా వరి కంకులు మొలకెత్తి కుళ్లిపోతున్నాయి. అయినా ఇంకా ఆశ చావక ఎంతో కొంత పంట దక్కుతుందని కొందరు రైతులు వర్షపు నీటిని ఆయిల్‌ఇంజన్‌ ద్వారా బయ టకు పంపుతున్నారు. పంట కాలవలు, మురుగు నీరు వెళ్లే కాలవలు వ్యర్ధాలతో నిండిపోయాయని వాటి వల్లే పొలాల్లోని వర్షం నీరు కాలువల ద్వారా వేగంగా వెళ్లడం లేదని కొల్లూరు కు చెందిన రైతు విశ్రాంత ఉపాఽధ్యాయుడు గుమ్మడి రామ మోహనరావు పేర్కొన్నారు. కాలువల వెంట నివాసం ఉండే వారు వ్యర్ధాలు వాటిలో వేయకుండా చర్యలు చేపట్టడంతో పాటు పంట కాలవల నిర్వహణను అధికారులు, సిబ్బంది సకాలంలో చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు వచ్చినా నష్టాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. కొంతమంది రైతులు మాత్రం జరగాల్సిన నష్టం జరిగిందని, ఎన్ని చేసినా ఒక్క గింజకూడా దక్కదని ఆవేదన వ్యక్తం చేసున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ లో కొల్లూరు మండలంలో రైతులు ఎకరాకు రూ.30 వేలు, అమృతలూరు మండలంలో రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. కౌలుతోపాటు పంటపై మరో రూ.25వేల వరకు పెట్టుబడులు పెట్టామని ఆ మొత్తం కూడా నష్టపోయామని కౌలు రైతులు వాపోతున్నారు. 


Updated Date - 2020-11-30T05:21:03+05:30 IST