‘రైతు’ వ్యధ!

ABN , First Publish Date - 2022-08-17T06:51:36+05:30 IST

ఈ రైతు పేరు గొల్లపల్లి రామకృష్ణ. ఊరు సామర్లకోట. జి.రాగంపేటకు వెళ్లేదారిలో 8.5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని గత ఏడేళ్లుగా సాగు చేస్తున్నాడు.

‘రైతు’ వ్యధ!

జిల్లాలో తగ్గుతున్న వరి సాగు.. పెరిగిన పెట్టుబడులే కారణం

పైగా ధాన్యం విక్రయించుకోడానికి ఏటా తప్పని ఇబ్బందులు

నిరాశతో సాగుకు దూరం 8 కొందరి చూపు ఇతర పంటల వైపు

(సామర్లకోట)

ఈ రైతు పేరు గొల్లపల్లి రామకృష్ణ.  ఊరు సామర్లకోట. జి.రాగంపేటకు వెళ్లేదారిలో 8.5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని గత ఏడేళ్లుగా సాగు చేస్తున్నాడు. అందులో 4 ఎకరాల్లో వరి సాగు, రెండు ఎకరాల్లో బొప్పాయి, రెండున్నర ఎకరాల్లో అపరాల సాగు చేస్తున్నాడు. ఏటేటా సాగు వ్యయం ఊహించని రీతిలో పెరగడం, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేకపోవడం, పండిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రభుత్వం కొన్న ధాన్యానికి సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వంటి కారణాలతో అప్పులకు వడ్డీలు పెరిగి సుమారు రూ.6 లక్షలు నష్టపోయాడు. ఇక్కడితో వ్యవసాయం ఆపకుంటే మరిన్ని అప్పుల్లోకి వెళ్లిపోతానేమోనని భయపడి ఈ ఏడాది వ్యవసాయానికి దూర మయ్యాడు. ప్రస్తుతం కుటుంబ పోషణకు స్టేషన్‌ సెంటర్‌లో జామకాయలు అమ్ముకుంటూ జీవనం నెట్టుకొస్తున్నాడు. 

ఈయన పేరు సోడసాని గోవిందు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామం. గ్రామంలోనూ, పొరుగున ఉన్న జి.మేడపాడు గ్రామంలోనూ సుమారు 16 ఎకరాల దేవదాయ భూములు సాగుచేస్తూ వరి పంట వేసేవారు. సాగు వ్యవయం ఏటేటా పెరగడం, ధాన్యం అమ్ముదామంటే సకాలంలో ప్రభుత్వం డబ్బులు జమచేయకపోవడం వంటి కారణాలతో కొంత నష్టం ఏర్పడుతుండగా, గడిచిన రెండేళ్లుగా పంట నష్టపరిహారం, రైతుభరోసా సాయం, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనా వంటి ప్రభుత్వ పఽథకాలు వర్తింపజేయడంలో అధికారుల నిర్లక్ష్యం తదితర కారణాలతో ఎన్నో నష్టాలు చవిచూశాడు. గత రబీకి చెందిన 250 బస్తాల ధాన్యానికి నేటికీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాది వ్యవసాయం పూర్తిగా విరమించుకున్నాడు. ఇప్పటివరకూ పెద్ద రైతుగా గ్రామంలో పేరున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని గోవిందు వాపోయారు.

వీరిద్దరే కాదు, ఇవాళ చాలామంది రైతుల జీవనచిత్రం ఇదే. ఆనూరుకు చెందిన బండారు వెంకట సత్యనారాయణకు రెండు ఎకరాల పొలం ఉంది. వరిసాగు చేసే సమయంలో కూలీలు దొరకడం కష్టం కావడం, ఎంత కష్టపడినా చివరకు సరైన దిగుబడులు రాకపోవడం, వచ్చినా గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో ఈ ఏడాది వరిసాగుకు విరామం ఇచ్చి ఆరుతడి పంటగా మినుములు వేసేందుకు సమాయత్తం అవుతున్నాడు. ఇలాంటి కారణాలతో ఈ ఏడాది వరి పంట సాగు చేసేవారి సంఖ్య తగ్గుతోంది. ప్రధానంగా పెరిగిన కూలీ రేట్లు, పండిన పంటను విక్రయించుకునేందుకు ఇబ్బందులతోపాటు, సరైన గిట్టుబాటు లేకపోవడం వల్ల వరి సాగుపై రైతులు ఆసక్తి చూపడంలేదు. అధిక విస్తీర్ణంలో పామాయిల్‌, అపరాలు తదితర పంటలను సాగుచేస్తున్నట్టు వ్యవసాయాధికారుల గణాంక సమాచారం ద్వారా తెలుస్తోంది. వరిసాగు చేయాలంటే విత్తనాలు వేసినప్పటి నుంచి పంట ఇం టికి వచ్చేవరకూ ఎకరాకు దాదాపు రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకూ వ్యయం అవుతుంది. వాతావరణం అనుకూలంగా ఉండి పంట బాగా పండితే ఎకరాకు 22 నుంచి 25 బస్తాల దిగుబడి వస్తుంది. అయితే పండిన దాన్యాన్ని అమ్ముకుందామం టే అధికారులు, మిల్లర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏటా ఉత్పన్నమవుతోంది. అన్ని ప్రక్రియలూ ముగించుకుంటే రూ.30 వేలు వస్తాయి. అంటే రైతుకు శ్రమ తప్ప ఏమీ మిగలడంలేదు. అందుకే చాలామంది వరిసాగు చేయడంపై దృష్టిపెట్టడంలేదు. ఇంటి అవసరాలకు మాత్రమే సాగుచేసి మిగిలిన భూమిని ఖాళీగా ఉంచేస్తున్నారు. గతంలో గ్రామాల్లో భూస్వాముల వద్ద నుంచి కౌలురైతులు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగుచేసేవారు. వ్యవసాయాధికారుల, ప్రభుత్వ పరిభాషలో చెప్పాలంటే వీరిని సీసీఆర్‌సీ కార్డుదారులంటారు. కౌలురైతులకు సీసీఆర్‌సీ కార్డులు తీసుకోవా లని పదేపదే చెబుతున్న ప్రభుత్వం ఆ తర్వాత కౌలు రైతులకు ఎటువంటి సాయం అందించడంలేదు. దీంతో కౌలు రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. చాలా గ్రామా ల్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు 15 నుంచి 20 శాతం పొలాల్లో ఎటు వంటి పంటలూ వేయడంలేదు. ఇదే విషయమై వ్యవసాయ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా వరి పండించే రైతులు ఇతర పంటలైన పామాయిల్‌ సాగుకు మారు తున్నారని, మరికొందరు రైతులు పశుగ్రాసం అయిన గడ్డి పెంపకంతో గడ్డి అమ్ము కుంటున్నారని చెప్పారు. వరి పంట విస్తీర్ణం తగ్గిందా, మామూలుగా ఉందా అనే అంశాన్ని ఇంకా పరిశీలించలేదు అని అధికారులు పేర్కొనడం గమనార్హం. 



Updated Date - 2022-08-17T06:51:36+05:30 IST