గ్రేడింగ్‌లో రైతులు జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2021-04-13T05:37:03+05:30 IST

పొగాకు గ్రేడింగ్‌లో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని టుబాకో బోర్డు రీజనల్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌ సూచించారు.

గ్రేడింగ్‌లో రైతులు జాగ్రత్తలు పాటించాలి
బేళ్లను పరిశీలిస్తున్న ఆర్‌ఎం వేణుగోపాల్‌

టుబాకో రీజనల్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌ 

కనిగిరి, ఏప్రిల్‌ 12: పొగాకు గ్రేడింగ్‌లో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని టుబాకో బోర్డు రీజనల్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌ సూచించారు. పొదిలి రోడ్డులోని టుబాకో వేలం కేంద్రంలో రైతులతో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పొగాకు బేళ్లను వేలం కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో ఇంటి వద్దనే తడి, వేడి లేకుండా చూసుకోవాలన్నారు. ముందు రోజు బోర్డులోని ధరలను పరిశీలించుకొని తదనుగుణంగా బేళ్లను వేలం కేంద్రానికి తెచ్చుకోవాలన్నారు. పొగాకు మండెలను 10 రోజులకు ఓ మారు తిప్పి వేస్తుండాలన్నారు. పొగాకు చూర ముక్కలను అనుమతి లేకుండా విక్రయించరాదన్నారు.  టుబాకో కంపెనీ ప్రతినిధులతో ఆయన మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలని కోరారు. పొగాకు వేలాన్ని పరిశీలించారు. ప్రతి రైతు తమ భూమి సారాన్ని పెంచుకునేందుకు పచ్చిరొట్ట ఎరువులను ఇచ్చే పైర్లను ముఖ్యంగా జనుము పైర్లను వేసుకునేలా రైతులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు టుబాకో వేలం నిర్వాహణాధికారి కేఎం శ్రీనివాసరావు, సిబ్బంది, పొగాకు రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T05:37:03+05:30 IST