నీటి కుంటలు.. కోటి లాభాలు

ABN , First Publish Date - 2022-05-11T05:26:15+05:30 IST

ఉపాధిహామీ పథకంలో నిర్మిస్తున్న నీటికుంట (ఫాంపాండ్స్‌)లతో రైతులకు కోటి లాభాలున్నాయి. భూగర్భ జలాలలను పెంచడం ద్వారా బోర్లు, బావులకు జీవం పోయడానికి ఇవి దోహదం చేస్తాయి. కీలకమైన ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

నీటి కుంటలు.. కోటి లాభాలు
కోహెడ మండలం బత్తులవానిపల్లిలో నిర్మాణంలో ఉన్న నీటి కుంట

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు పంట పొలాల్లో నిర్మాణం

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యం

బోర్లు, బావులకు పునరుజ్జీవం 

ఉపాధిహామీలో ఉచితంగా నిర్మాణం

కోహెడ మండలానికి 300 కుంటలు మంజూరు

ఇప్పటి వరకు కట్టింది పది!

ఫాంపాండ్స్‌పై రైతులకు చైతన్యం కరువు

అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం 


కోహెడ, మే 10: ఉపాధిహామీ పథకంలో నిర్మిస్తున్న నీటికుంట (ఫాంపాండ్స్‌)లతో రైతులకు కోటి లాభాలున్నాయి. భూగర్భ జలాలలను పెంచడం ద్వారా బోర్లు, బావులకు జీవం పోయడానికి ఇవి దోహదం చేస్తాయి. కీలకమైన ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. 


వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు..

వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు పంట పొలాల వద్ద చిన్న కుంటల (ఫాంపాండ్స్‌) తవ్వకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఉపాధిహామీ పథకంలో భాగంగా రైతులకు పైసా ఖర్చు లేకుండా ఫాంపాండ్స్‌ను నిర్మించి ఇస్తున్నారు. నీటి కుంటలకు వ్యక్తిగతంగా పొలాల్లో తవ్వితే రూ 2.5 లక్షలు, కమ్యునిటీ ఉపయోగం కోసం అంటే చెరువుల్లో వీటిని నిర్మిస్తే రూ. 4.5 లక్షలను ఉపాధిహామీ కూలీలకు చెల్లిస్తున్నారు. వ్యక్తిగతంగా నిర్మించే కుంటలకు రైతులు పొలాల్లో అనువైన ప్రాంతాన్ని సూచిస్తే, ఉపాధి సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం కూలీలు కుంటలను నిర్మిస్తారు. 8 చదరపు మీటర్ల వైశాల్యం, 3 మీటర్ల వరకు ఈ నీటికుంటలను నిర్మిస్తున్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు నీటి కుంటలు ఉపయోగపడుతాయి. భారీ వర్షాలకు భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. ఎగువ నుంచి కొట్టుకు వచ్చిన సారవంతమైన మట్టి గుంతల్లోకి చేరి ఎరువులా ఉపయోగపడుతుంది. 


మండలానికి 300 మంజూరు

కోహెడ మండలానికి 300 ఫాంపాండ్స్‌ మంజూరయ్యాయి. కానీ ఇప్పటి వరకు కేవలం ఆరు గ్రామాల్లో పది కుంటలను నిర్మించుకున్నారు. మండలంలోని కాచాపూర్‌, పరివేద, సముద్రాల, ఆరేపల్లి, నాగసముద్రాల, బత్తులవానిపల్లిలో రైతులు వ్యక్తిగతంగా, కమ్యూనిటీ అవసరాలకు కుంటలను నిర్మించుకున్నారు. మిగిలిన 21 గ్రామాల్లో ఒక్క కుంటను కూడా నిర్మించలేదు. వర్షపు నీటి నిల్వలో కీలకమైన కుంటల నిర్మాణంపై రైతులను చైతన్యవంతులను చేసేవారు కరువయ్యారు. కుంట తవ్వడానికి కొంత భూమిని కోల్పోయినా ఎంత ఉపయోగకరంగా ఉంటాయో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది.  వర్షాభావ పరిస్థితులు ఉన్న మండలంలో ఫాంపాండ్స్‌ ఎంత కీలకమయినవో రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈజీఎస్‌ సిబ్బంది గ్రామసభలు నిర్వహించాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలుగా సాధ్యం కావడంలేదు. దీంతో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.


అవగాహన కల్పిస్తున్నాం : రంగనాయక్‌, ఏపీవో, కోహెడ మండలం

వ్యవసాయ పొలాల వద్ద ఫాంపాండ్స్‌ ఏర్పాటు  చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మండలంలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. కమతాల విస్తీర్ణం కూడా తక్కువగా ఉన్నది. ఉన్న కొద్దిపాటి పొలంలో కుంటను తవ్వుకుంటే భూమి పోతుందని రైతులు ముందుకురావడంలేదు. అందుకే ఫాంపాండ్స్‌ నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. నీటి కుంటల ద్వారా లాభాలను వివరించి,  అవకాశం ఉన్నచోట నిర్మించుకునేలా కృషిచేస్తాం.

Read more