జోరుగా రైతువేదిక నిర్మాణాలు

ABN , First Publish Date - 2020-10-19T09:10:46+05:30 IST

మండల పరిధిలోని 5 క్లస్టర్లలో రైతువేదిక భవన నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. దసరా పండగ నాటికి అన్ని క్లస్టర్లలో రైతు వేదిక భవనాలను పూర్తి చేసి రైతులకు, అధికారులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే

జోరుగా రైతువేదిక నిర్మాణాలు

మోమిన్‌పేట: మండల పరిధిలోని 5 క్లస్టర్లలో రైతువేదిక భవన నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. దసరా పండగ నాటికి అన్ని క్లస్టర్లలో రైతు వేదిక భవనాలను పూర్తి చేసి రైతులకు, అధికారులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో సర్పంచులు, కాంట్రాక్టర్లు రైతువేదిక పనులను వేగవంతం చేశారు. మండల పరిధిలోని మోమిన్‌పేట, టేకులపల్లి, వెల్‌చాల్‌, మేకవనంపల్లి, కేసారం గ్రామాల్లో రైతువేదిక పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైతువేదిక భవనాలు నిర్మాణాలు ఆగష్టు 15 వరకు పూర్తి చేయవల్సి ఉండగా ఏకదాటిగా వర్షాలు కురవడంతో పనులకు ఆటంకం కలిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పనులు పునరుద్ధరించారు. మండల కేంద్రంలో నిర్మించే రైతువేదిక నిర్మాణం పూర్తిదశలో ఉండగా, టేకులపల్లి, వెల్‌చాల్‌ గ్రామాలలో చివరి దశలో ఉన్నాయి. కాగా దసరా పండుగ వరకు నిర్మాణాలు పూర్తిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తుండగా ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


దసరా నాటికి పూర్తి  

 మండలంలో చేపడుతున్న 5 రైతువేదికలు దసరా నాటికి పూర్తి చేస్తాం. మోమిన్‌పేటలో పూర్తవగా, మిగతా గ్రామాల్లో తుది దశలో ఉంది. దసరా నాటికి పూర్తి చేసి రైతులకు, అధికారులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం.

- ప్రణీత, ఏఈ, మోమిన్‌పేట


ఎంతో ఉపయోగం

 రైతువేదికలు నిర్మించడం వల్ల వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. రైతు తన పొలంలో సమయానుకూలంగా వేసే పంటలపై అధికారుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు సులభమవుతుంది.  

- మోహన్‌రెడ్డి, రైతు, మోమిన్‌పేట

Updated Date - 2020-10-19T09:10:46+05:30 IST