కార్పొరేట్ పద్మవ్యూహంలో ఒంటరి రైతు

ABN , First Publish Date - 2020-10-22T05:53:52+05:30 IST

కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం వ్యవసాయ మార్కెట్ బయట జరిగే ఆమ్మకాల మీద ఇకనుంచీ మార్కెట్ కమిటీల నియంత్రణకు అవకాశం ఉండదు. రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, గోదాములు ఇతర ప్రదేశాల్లో జరిగే కొనుగోళ్ళపై ఎటువంటి పర్యవేక్షణా...

కార్పొరేట్ పద్మవ్యూహంలో ఒంటరి రైతు

కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం వ్యవసాయ మార్కెట్ బయట జరిగే ఆమ్మకాల మీద ఇకనుంచీ మార్కెట్ కమిటీల నియంత్రణకు అవకాశం ఉండదు. రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, గోదాములు ఇతర ప్రదేశాల్లో జరిగే కొనుగోళ్ళపై ఎటువంటి పర్యవేక్షణా ఉండదు. ఇక్కడ ఒక్కడే వ్యాపారి ఉంటాడు. ధర నిర్ణయం ఆ ఒక్కడి చేతిలో ఉంటుంది. పోటీ ధర ఉండదు. ధర నిర్ణయం తర్వాత సరుకు నాణ్యత లేదని ఏకపక్షంగా ధర తగ్గించే అవకాశం లేకపోలేదు. తూకంలో కోత పెట్టే ప్రమాదమూ లేకపోలేదు. లావాదేవీల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే బడా కార్పొరేట్ కంపెనీలతో బక్క రైతు పోరాడాలి. ఒక సన్నకారు రైతు ‘పెప్సి ఫుడ్స్’, ‘రిలయన్స్’ లాంటి కార్పొరేట్ దిగ్గజాలతో తలపడి తన హక్కులు సాధించుకోగలుగుతాడా ? సింహంతో పోరాటానికి చిట్టెలుకకు స్వేచ్ఛనట. ఎంత గొప్ప న్యాయం ఇది? 


మద్దతు ధరకు మంగళం పాడే, మండీ వ్యవస్థను మటుమాయం చేసే నూతన వ్యవసాయ చట్టం దేశంలోని సన్నకారు రైతాంగానికి పెనుశాపంగా మారనున్నది. ఈ చట్టం స్థానిక మార్కెట్ల మధ్యవర్తిత్వాన్ని తొలగించి, నేరుగా రైతు నుండి పంటను కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని కార్పొరేట్ సంస్థలకు కలిగిస్తున్నది. ‘రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు’ అని కేంద్రం అందంగా నమ్మబలుకుతున్నది. కానీ నాణానికి రెండో వైపున్న నిజం ‘కార్పోరేట్ కంపెనీలు ఎక్కడైనా కొనొచ్చు, రైతు ఎక్కడైనా మోసపోవచ్చు’ అన్నది మాత్రం చెప్పటం లేదు. ఇక ఎవరు ఏ పంట పండించాలి, ఎంత ధర ఉండాలి, ఎవరికి అమ్మాలి- మొదలైన విషయాలన్నీ కార్పోరేట్ శక్తుల కనుసన్నల్లోనే నిర్ణయమౌతాయి. ఇది రైతుల ప్రయోజనాలకు మాత్రమే కాక వ్యవసాయ స్వావలంబనకు, దేశ ఆర్థిక రాజకీయ స్వావలంబనకు అంతిమంగా సార్వభౌమాధికారానికి తీవ్ర విఘాతం కలిగించే చట్టం.


భారత దేశ వ్యవసాయం మీద బహుళజాతి కార్పోరేట్ కంపెనీల గుత్తాధిపత్యం నెలకొల్పడానికి తెచ్చిన ఈ చట్టాన్ని, జాతీయవాదానికి ప్రతినిధులుగా చెప్పుకునే బీజేపీ వర్గాలు (ఒక్క భారతీయ కిసాన్ సంఘ్ తప్ప) నిస్సిగ్గుగా సమర్థిస్తున్నాయి. ‘భళి భళి భళిరా భళి’ అని వారంతా ఈ చట్టానికి భజన చేస్తుంటే, దేశంలోని రైతులేమో ‘సన్నకారు రైతులు బలి, స్థానిక మార్కెట్లు బలి, మద్దతు ధర బలి’ అని మొత్తుకుంటూ రోడ్డెక్కుతున్నారు. పైకి స్వేచ్ఛా వాణిజ్యం అని ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆచరణలో మార్కెట్‍పై ఏదో ఒక బడా కార్పోరేట్ కంపెనీ ఏకాధిపత్యాన్ని (MONOPOLY) కానీ లేదా రెండు కంపెనీల ద్వయాదిపత్యాన్ని (DUOPOLY) కానీ రుద్ద చూస్తున్నది. 




రైతుల మార్కెట్ హక్కుల పరిరక్షణ కోసం స్థానిక మార్కెట్ కమిటీలు ఏర్పడ్డాయి. పోటీ ధర, ఖచ్చితమైన తూకం, సరైన చెల్లింపులు అనే లక్ష్యాలతో, రైతుకు చేరువలో ఉండేలా స్థానిక మార్కెట్ల స్థాపన జరిగింది. మన రాష్ట్రంలో స్వాతంత్ర్యం రాక పూర్వమే అనేక మార్కెట్లు స్థాపించారు. 1933లో వరంగల్, ఆదిలాబాద్ మార్కెట్లు; 1937లో ఖమ్మం మార్కెట్; 1938 లో నిజామాబాద్ మార్కెట్; 1940లో సూర్యాపేట, భువన గిరి మార్కెట్లు; 1946లో వనపర్తి; 1947 లో మంచిర్యాల మార్కెట్లు ఏర్పడ్డాయి. కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నిజామాబాద్, వరంగల్, మార్కెట్‌యార్డులకు తమ పంటలను చిన్న చిన్న మూటలు (సింగిడీలు)- అంటే 5 నుంచి 10 కిలోల ధాన్యం మొదలుకొని, క్వింటాళ్ళ వరకు- అమ్మకం చేయడానికి చిన్నకారు రైతులు వస్తారు. ఇది మన దేశ రైతాంగం వాస్తవ పరిస్థితి. మార్కెట్ యార్డుల్లో రైతుల సమక్షంలో ఎక్కువమంది వ్యాపారులు వేలంలో పాల్గొని పంటలకు ధర నిర్ణయిస్తారు. లైసెన్స్ ఉన్న దడ్వాయిలతో ఖచ్చితమైన తూకం వేస్తారు.


ధర నిర్ణయించేప్పుడు ఇతర మార్కెట్లలో ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకొని మరీ నిర్ణయిస్తారు. ధర నిర్ణయం, తూకం, రైతులకు చెల్లింపుల విషయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుంది. వీటి విషయంలో రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వ్యవసాయ మార్కెట్ కమిటీలు జోక్యం చేసుకొని రైతు వెన్నంటి ఉంటాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీల పర్యవేక్షణ మార్కెట్ యార్డు లోపల జరిగే కార్యకలాపాలపైనే కాకుండా బయట మిల్లుల వద్ద జరిగే అమ్మకాలపై కూడా ఉంటుంది. దాని ద్వారా తూకంలో, ధర చెల్లింపులో మోసాలను, కమిటీలు నివారిస్తున్నాయి. లైసెన్స్ కలిగిన వ్యాపారులు మాత్రమే రైతు నుండి పంటను కొనుగోలు చేస్తారు. ఆ కమీషన్ ఏజెంటు అవకతవకలకు పాల్పడితే మార్కెట్ కమిటీ అతని లైసెన్సును రద్దు చేస్తుంది. ఇవన్నీ రైతాంగం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు. కొత్త వ్యవసాయ చట్టం రైతులు సాధించుకున్న హక్కులను ప్రశ్నార్థకం చేస్తుంది. కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ మార్కెట్ బయట జరిగే ఆమ్మకాల మీద ఇకనుంచీ మార్కెట్ కమిటీల నియంత్రణకు అవకాశం ఉండదు. రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, గోదాములు ఇతర ప్రదేశాల్లో జరిగే కొనుగోళ్ళపై ఎటువంటి పర్యవేక్షణా ఉండదు. ఇక్కడ ఒక్కడే వ్యాపారి ఉంటాడు. ధర నిర్ణయం ఆ ఒక్కడి చేతిలో ఉంటుంది. పోటీ ధర ఉండదు. ధర నిర్ణయం తర్వాత, సరుకు నాణ్యత లేదని, ఏకపక్షంగా ధర తగ్గించే అవకాశం లేకపోలేదు. తూకంలో కోత పెట్టె ప్రమాదమూ లేకపోలేదు. మార్కెట్ యార్డులలో సరుకు అమ్మిన వెంటనే ‘తక్ పట్టీ’ ఇస్తారు. కానీ ఇప్పుడు మార్కెట్ బయట జరిగే అమ్మకాలకు ఎవరూ రశీదు ఇవ్వరు. ఇచ్చినా దానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. రైతులకు చెల్లింపులు ఎప్పుడు చేస్తారో తెలియదు. చెల్లింపులు చేయకపోతే పరిష్కారం కోసం కలెక్టర్ దాకా వెళ్ళాలి. ఇప్పటిదాకా మండల, డివిజన్ స్థాయిలో ఉన్న వివాద పరిష్కార మార్గాలే పూర్తిగా రైతులకు న్యాయం చేయలేకపోతున్నాయి. అలాంటిది జిల్లా అదనపు కలెక్టర్ స్థాయిలో పరిష్కారాలు చేసుకోవాలంటే అది రైతును హేగ్‍లో ఉన్న అంతర్జాతీయ న్యాయ స్థానానికి పొమ్మనడం లాంటిదే. 


కాంట్రాక్ట్‌ వ్యవసాయంలో ఇప్పటివరకు రైతులకు, కార్పొరేట్‌ కంపెనీలకు మధ్య ఒప్పందాల్లో ఏపీఎంసీలు మధ్యవర్తిత్వం చేసేవి. ఈ ఒప్పందాలు ఏపీఎంసీలలో రిజిస్టర్‌ చేయబడేవి. కొత్త బిల్లు ప్రకారం ఈ ఒప్పందాలు కేవలం రైతులకు, కార్పొరేట్‌ కంపెనీలకు మధ్యనే ఉండబోతున్నాయి. లావాదేవీల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే బడా కార్పొరేట్ కంపెనీలతో బక్క రైతు పోరాడాలి. ఒక సన్నకారు రైతు పెప్సి ఫుడ్స్, రిలయన్స్ లాంటి కార్పోరేట్ దిగ్గజాలతో తలపడి తన హక్కులు సాధించుకోగలుగుతాడా ? సింహంతో పోరాటానికి చిట్టెలుకకు స్వేచ్ఛనట. ఎంత గొప్ప న్యాయం ఇది? ఆర్య సంస్కృతికీ తమను తాము గుత్తేదారులుగా చెప్పుకునే బీజేపీ నాయకులకు ‘వివాహేశు వివాదేశు సమయోరుభయ శోభతి’ అనే ఆర్యోక్తి మనసున పట్టినట్టు లేదు. కయ్యమైనా వియ్యమైనా సమవుజ్జీల నడుమ జరగాలన్నది ఒక సాధారణ న్యాయం. అటువంటిది బక్క పేద రైతును బడా కంపెనీల బోనులోకి తోసెయ్యడం కర్కశత్వమే. మార్కెట్ యార్డులు రైతులను సంఘటిత పరిచే ఉద్యమ క్షేత్రాలు. స్థానిక మార్కెట్ యార్డుల దగ్గర, చుట్టు ముట్టు పల్లెల రైతులు ఒక్కటై సంఘీభావం పునాదిగా పోరాటాలకు దిగటం సర్వ సాధారణం. ఏ పరిచయాలు లేని దూర ప్రాంతాల మార్కెట్లలో ఈ ఐక్యత సాధ్యం కాదు. కార్పొరేట్ కంపెనీల పద్మవ్యూహం లో రైతును అభిమన్యుడిగా ఒంటరిని చేయడమే ‘ఒకే భారతం, ఒకే మార్కెట్’ నినాదం అసలు మర్మం. 


తెలంగాణలో 92.5 శాతం మంది ఇదు ఎకరాల లోపు కమతాల చిన్న రైతులే. వీళ్ళంతా కల్లాల వద్దనే పంటలు అమ్ముకుని అవసరాలు తీర్చుకునే బక్క పేద రైతులు. వీళ్ళు లాభసాటి ధర వచ్చే దాక పంటలను గిడ్డంగుల్లో నిల్వ చేసుకుంటారా? రవాణా ఖర్చులు భరించి, తమ పంటను దేశంలో ఎక్కువ ధర లభించే దూర ప్రాంతాల మార్కెట్లకు తరలించుకోగలుగుతారా? దేశంలో ఎక్కడైనా అమ్ముకుని దండిగా లాభపడతారా? ‘చెప్పేటోనికి చెవుడైనా, వినేటోనికి వివేకం ఉండాలని’ సామెత. 


వ్యవసాయ మార్కెట్ కమిటీల వ్యవస్థ ఇప్పుడంతా బాగుందని కాదు. మౌలిక సదుపాయాలు మొదలుకొని ప్రైవేట్ వ్యాపారులు చేసే నిబంధనల ఉల్లంఘనల వరకు అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని సంస్కరించి మార్కెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. స్థానిక మార్కెట్ వ్యవస్థ నిర్వీర్యం అయితే వీటిపై ఆధారపడి బతుకుతున్న వేలాదిమందికి ఉపాధి కరువయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది. ఉద్యోగులు, కమీషన్ ఏజెంట్లు మొదలుకొని హమాలీలు, చాట, మూట కూలీల వరకు అందరి జీవితాలు అగమ్యగోచరమౌతాయి. స్థానిక మార్కెట్ యార్డుల్లో జరిగే వ్యాపారం ద్వారా సగటున ఏటా రూ.150 కోట్లు, చెక్‌పోస్టుల్లాంటి వాటి ద్వారా రూ.200 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. వీటిల్లో పనిచేసే ఉద్యోగులకే రూ.200 కోట్లు ఖర్చవుతాయి. ఇప్పుడు చెక్‌పోస్టులన్నింటినీ ఎత్తేయాల్సి రావడంతో సుమారు రూ.200 కోట్ల మేర ఆదాయం పోతుంది. ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారుల ధరలతో పోటీపడి రైతులను మార్కెట్‌కే రప్పించేలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. 


కార్పొరేట్‌ సంస్థలే మార్కెట్లను శాసిస్తే, అవి మద్దతు ధరల ఒప్పందాలకు అంగీకరించవు. అంటే మద్దతు ధర చెల్లించి, ధాన్యం సేకరించే బాధ్యతనుంచి కేంద్రం మెల్లగా తప్పుకుంటున్నది. సంపూర్ణ కార్పొరేటీకరణకు స్థానిక మార్కెట్ వ్యవస్థ అడ్డుగోడలా ఉంది. కనుక దానిని నిట్టనిలువునా కూల్చేస్తున్నారు. గుప్పెడు మంది కుబేరులకోసం కోట్లాదిమంది బక్క పేదల బతుకులు బలిచేస్తున్నారు. 


సాంస్కృతికంగా జాతీయవాదం, ఆర్థికంగా బహుళ జాతీయ వాదం బీజేపీ ప్రదర్శిస్తున్న అత్యద్భుతమైన కార్పొరేట్ కాషాయ కళా నైపుణ్యం. మేకి ఇన్ ఇండియా మేడిపండు, రైతు బతుకిక రాచపుండు. దేశీయ వ్యవసాయాన్ని రూపుమాపే దేశభక్తికి జోహార్. రక్షణ రంగం, అంతరిక్ష రంగం, విద్యా వైద్య రంగాలతో సహా దేశ వ్యవస్థలన్నిటినీ ఎఫ్.డి.ఐ పేరుతో విదేశీ గుత్త సంస్థలకు నైవేద్యంగా సమర్పించే స్వదేశీ వంచన వర్ధిల్లాలి. కాదన్న మాదన్నలేవరైనా ఉంటే వారిని దేశద్రోహుల జాబితాలో చేరుస్తారు. కటకటాలు లెక్కబెట్టిస్తారు. విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన మహాత్ముడు పుట్టిన నేల గుజరాత్ నుంచి వచ్చిన నరేంద్ర మోదీ స్వదేశీ వస్తు బహిష్కరణను లోపాయకారీగా అమలుచేస్తున్నారు. మోదీ మార్కు దేశభక్తి అంటే ఆచరణలో విదేశభక్తే. 


మహాభారతంలో నన్నయ్యభట్టు హెచ్చరించినట్టు ‘కాలమొక్కరీతిసాగబోదు’. అది కాళోజీ చెప్పినట్టు కాటేసి తీరుతుంది కూడా. కార్పొరేటీకరణ బాధిత సమూహాలను ఒక గొంతుగా మార్చడమే, ఒక తాటి మీదకు తీసుకురావడమే కాలం ఇప్పుడు మనకు నిర్దేశిస్తున్న కర్తవ్యం.


దేశపతి శ్రీనివాస్ 

Updated Date - 2020-10-22T05:53:52+05:30 IST